*విజ్ఞాన వీచికలు - 438*
*సూర్యనారాయణ నేమాని*
*" నిజమైన చదువు అంటే ఏమిటి? "*
*‘చదువు’*: ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది.
నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి.
మనిషి జీవిత కాలం మనిషికి తెలియంది కాదు. మనకి యింకా యెంత కాలం మిగిలి వుందో కూడా తెలీదు. నిన్నటికంటే యివాల్టికి వున్నది తక్కువే. ఉంటే గింటే బోనస్. అందుకని మనం యెవరమైనా సెలెక్టివ్‌గా మాత్రమే చదువుతాం. దొరికిందల్లా చదివితే జీవితం సరిపోదని మనకి తెలుసు.
*"నిజమైన చదువు అంటే ఏమిటి?"*
చదువు అంటే కేవలం పుస్తకాలు పట్టుకుంటేనే చదువు అని కాదు. చదువు అంటే మనకు నచ్చిన విషయం మీద జ్ఞానం సంపాదించడం. ఆ విషయం ఏమైనా కానీ విద్య కానీ సినిమాలు కానీ ఆటలు కానీ పాటలు లేదా సంగీతం ఇలా రకరకాలుగా మనం ఇష్టంగా ఏదయినా విషయం మీద జ్ఞానం సంపాదించి తెలుసుకుంటామో, అలా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఆ రంగంలో ఉపయోగించి మన జీవితంలో మనం అభివృద్ధి సాధించి అ అభివృద్ధి వలన ఒక్కరికి మంచి జరిగినా మన నిజమైన చదువుకి ఒక అర్థం.అదే నిజమైన చదువుగా నేను భావిస్తున్నాను.
నిజమైన చదువు అనేది మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో, చుట్టాలతో సమాజంతో భేష్ అనిపించుకోవడంకోసమో కాదు అని తల్లిదండ్రులు పిల్లలూ తెలుసుకోవాలి. చదువు అనేది జ్ఞానాన్ని ఇవ్వాలి, మనిషి ఆలోచనలకి రెక్కలు పొదగాలి, అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పాలి. విశాల విశ్వంలో ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీలైనన్ని సబ్జెక్ట్పస్ పట్ల పిల్లలు అవగాహన పెంచుకోవాలి. బావిలో కప్పలలాగా పెరగకుండా, జ్ఞానం అనేది విశ్వవీక్షణ ప్రాప్తి కలిగించాలి.
*చదువని వాడజ్ఞుండగు*
*చదివిన సదసద్వివేక చతురత గలుగున్*
*చదువగ వలయును జనులకు*
*చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!*
ఆంధ్ర మహా భాగవతంలోని పాత్రల చేత పోతన చెప్పించిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటి. హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు-
“బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.
ఈ పద్యం బాగా చదువుకోవాలని చెప్పటమే కాదు; చదువు ఎలా ఉండాలో చెబుతున్నది కూడాను - చదువు ఏం చెయ్యాలటనో చూశారా? అది మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకునే శక్తినివ్వాలట! అంటే మనం చదువుకొని, మంచేంటో-చెడేంటో తెలుసుకోవాలన్నమాట!
*విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్*
*విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్*
*విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్*
*విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!*
చదువును మెచ్చుకుంటూ ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యం 'సుభాషిత రత్నావళి' లోది.
“విద్య రహస్యంగా దాచిపెట్టుకున్న డబ్బులాంటిది. మనుషులకు విద్యే అందం. విద్య వల్లనే కీర్తి-ప్రతిష్ఠలు కలుగుతాయి. అన్ని సుఖాలనూ అందజేసేది విద్యే. విద్య గురువులాగా వివేకాన్నిస్తుంది. విదేశాలలో మనకు చుట్టం విద్యే. విద్య అన్నిటికంటే గొప్ప దైవం. విద్యకు సాటివచ్చే సంపద ఈ లోకంలో మరేదీలేదు. రాజాధిరాజుల చేతకూడా పూజింపబడుతుంది విద్య. అంత గొప్పదైన విద్యను నేర్చుకోనివాడు అసలు మనిషేనా? కాదు” అంటున్నది ఈ పద్యం.
భర్తృహరి అనే గొప్ప సంస్కృత కవి మూడు వందల మంచి సూక్తులతో “సుభాషిత త్రిశతి” అనే పుస్తకం రాశాడు. ఏనుగు లక్ష్మణకవి దాన్ని మొత్తాన్నీ భావం ఏమాత్రం చెడకుండా, చక్కని తెలుగు పద్యాలుగా మలచాడు. వీటిలో ఒక్కో పద్యం ఒక్కోఆణి ముత్యం!
**************************
No comments:
Post a Comment