రాజంటే ఎలా ఉండాలి?
ప్రజలను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకోవడంవల్ల విదేహరాజు జనకుడనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. తండ్రిలాంటివాడే కాడు... రాజు, అంతకంటే గొప్పవాడు కనుకనే 'నా విష్ణుః పృథివీపతి' అని ధర్మగ్రంథాలు వెల్లడించాయి. విష్ణు శబ్దానికి అంతటా వ్యాపించినవాడని అర్థం. రాజు తాను పుట్టిన ప్రదేశానికి మాత్రమే పరిమితంకాక దేశానికంతటికీ తన చల్లని పాలనను అందించేవాడని గుర్తించాలి. ప్రజల కష్టాలను తన కష్టాలుగా, ప్రజల సుఖాలను తన సుఖాలుగా భావించినవాడే రాజు. కరవు కాటకాలు సంభవిస్తే ప్రజలను ఆకలికి గురిచెయ్యకుండా అప్పుచేసైనా ఆదుకోవాలి. ప్రజలకెలాంటి కష్టాలూ రాకుండా చూసుకోవాలి. అంతేకాని- తాను భోగలాలసుడై వారి సుఖాలను హరించేవాడు ఎన్నటికీ ధర్మప్రభువనిపించుకోడు.
వ్యర్థాలాపాలతో, ప్రయోజనం లేని పథకాలతో కాలయాపన చేసేవాడు ప్రభువే కాడు. అధికారం ఉందికదా అని అడిగినవారికల్లా అపాత్రదానం చేసి కోశాగారాన్ని ఖాళీ చేసే రాజు ఎన్నటికీ క్షమింపదగినవాడు కాడు. రాజుకు ధర్మబుద్ధి అవసరం. సచివులతో ధర్మాధర్మ వివేచన చేస్తూ, ప్రజలను ధర్మమార్గంలో నడిపించాలి. ‘యథారాజా తథా ప్రజా' అన్న సూక్తిని విస్మరించక, తన జాగ్రత్తలో తానుండాలి. దేశానికి ఏలిక అంటే ప్రజలకు పాలకుడని అర్థం. ప్రజలను సంక్షేమ పథకాల ద్వారా ఆకట్టుకోవడం కంటే, వారిలో శ్రమశక్తిని పెంచి, శాశ్వతమైన ఆర్థిక పరిపుష్టికి మార్గం వేయాలి. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలేగాని అప్పులపాలు చేయరాదు. విద్య, ఆరోగ్యం విషయంలో రాజు అశ్రద్ధ చూపరాదు.
రాజు మేడలో ఉంటే ప్రజలు గుడిసెల్లో ఉంటారు. ఒకవేళ రాజు గుడిసెలో ఉన్నట్లు తన జీవితాన్ని మార్చుకోగలిగితే ప్రజలు మేడలో నివసించగలుగుతారని చాణక్యుడు చెప్పిన మాటలను అధికారంలో ఉన్నవారు ఎన్నడూ మరచిపోరాదు. రాజు ఎప్పుడూ తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండటం, పొగిడినవారికే పదవులివ్వడం మొదలుపెట్టినట్లయితే రాజ్యం అచిరకాలంలోనే అంతరిస్తుంది. తన రాణివాసం కోసం, బంధుజనం కోసం లక్షల ధనాన్ని ఖర్చు చేయడం ప్రజాసేవ అనిపించుకోదు. 'ఈ సంపద అంతా భగవంతుడు ఇచ్చిందే' అన్న భావన ఉండాలికాని, తానే సర్వాధికారినని భావించరాదు.
రాజు సుఖంగా ఉంటే ప్రజలు సుఖంగా ఉన్నట్లు కాదు. ప్రజల సుఖమే తన సుఖంగా భావించాలి. దేశంలో కరవు రాకుండా చూసుకోవాలి. ఆకలిచావులు లేకుండా కాచుకోవాలి. ఈతిబాధలు కలగకుండా జాగ్రత్తపడాలి. ఎవరికి ఏ దుఃఖం వచ్చినా, సమయం సందర్భం అనకుండా, అన్ని వేళలా అందుబాటులో ఉండేవాడే రాజు.
ప్రజలను ఎంతకాలం పాలించాను అనే దానికంటే ఎంత మంచిగా పాలించాను అనే ప్రశ్న వేసుకున్న నాయకుడే జనరంజకుడైన రాజు. అంతేకాని, తన కోసం తనను ఆశ్రయించినవారి కోసం మాత్రమే అధికారాన్ని దుర్వినియోగం చేసే రాజు ప్రజలకు ఏనాటికీ ప్రేమపాత్రుడు కాలేడు.
ఆచార్య మసన చెన్నప్ప
No comments:
Post a Comment