Monday, June 3, 2024

 ఆంజనేయ స్వామి జన్మస్థలం ...శివుడు రుద్రాంశలో ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ముందే ఒక మహా భక్తునికి ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చిన స్థలం.ఆంజనేయ స్వామి వారి తల్లి అంజనాదేవి కఠిన తపస్సు చేసిన పుణ్యస్థలం

 స్థల పురాణం

త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి

 అయితే *జపాలి* అనే మహర్షి హనుమంతుడి అవతారనికంటే ముందే ఆ రూపాన్ని దర్శించి, ప్రసన్నం చేసుకోవాలని తలచి అనేక చోట్ల ఘోర తపస్సు చేస్తూ తిరుమల కొండపై అనేక జప / హోమాలు చేసిన పిమ్మట స్వామి సంతోషించి భవిష్యత్తులో అవతరించబోయే హనుమంతుని రూపాన్ని ఇక్కడ స్వయంభుగా వెలసి జపాలి మహర్షికి చూపించినాడని స్థల పురాణం

జపాలి మహర్షి జపాలకు మెచ్చి స్వామి స్వయంభుగా వెలసినందువల్ల ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పిలవబడుతోంది

ఈ క్షేత్రంలోనే పరమ పవిత్రమైన తీర్థాలైన రామగుండం, సీతాగుండం, ధృవతీర్థం వంటి తీర్థాలు ఉండటం వల్ల జపాలి తీర్థం అయ్యింది

 శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి, సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట. అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా ఉన్న తీర్థం ) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం (ఆలయం వెనుక వైపు) అనీ పిలుస్తారు

వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్న భక్త ధృవుడు మొట్టమొదట ఇచటనే తపమాచరించినాడట. ఇప్పటికీ ఇక్కడ ధృవ తీర్థం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే ఆంజనేయస్వామి వారి కైంకర్యాలకు  వినియోగిస్తున్నారు. ఈ తీర్థములోని నీరు అనేకఔషధ గుణాలు కలిగి ఉన్నవని ప్రతీతి.ఆలయానికి పశ్చిమాన ఉన్న తీర్థాన్ని హనుమాన్ తీర్థం అని పిలుస్తున్నారు

 ఆలయ విశిష్టత 

ఎటువంటి కష్టానష్టాలున్నా స్నానం చేసి తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం. జన్మశని కలిగినవారు తమ పుట్టినరోజు నాడు ఇక్కడ స్వామి వారికి పూజ, అభిషేకము చేస్తే శని ప్రభావం వల్ల కలిగే అనేక బాధలు కలగవు అని మరో విశ్వాసం. అలాగే పంచమహా పాతకాలు, భూత, ప్రేత, పిశాచాది బాధలు ఉన్నవారు ధృవ తీర్థంలో స్నానామాచారిస్తే ఆ కష్టాలు తీరుతాయని స్కాందపురాణంలోని వేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడిందట

జపాలి మహర్షి ఇక్కడి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడైనాడట.శ్రీవారి ప్రియ భక్తులైన శ్రీ హాథీరాంబావాజీ కూడా ఇక్కడే సంచరిస్తూ తపస్సు చేసుకునేవారట.ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ హాథీరాంజీ మఠం వారి ఆధీనంలో ఉన్నది.ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు భాగం వినాయకుడి ఆకారంలో ఉండటం మరో విశేషం

జై శ్రీరామ్

No comments:

Post a Comment