*_నేటి ఆకలికేక..._*
*_రేపటి చావుకేక..!_*
🪱🪱🪱🪱🪱🪱🪱
ఎంత ఖరీదైన తిండి
తిన్నామన్నది కాదు..
కల్తీ లేని ఫుడ్డా కాదా
అన్నది సమస్య..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం..
కాని ఆ అన్నమే దొరకని
ఓ రోజు వస్తే..
కడుపుకు ఇంత తిండి
అందక మనుషులు చస్తే...
అలాంటి పరిస్థితిని
ఊహిస్తేనే గగుర్పాటు...
మరలాంటి దుస్థితి
నిజంగా సంభవిస్తే..!
పండే ప్రతి గింజపైనా
తినేవాడి పేరు..
అసలు పైరే మిగలని..
కలికాలంలో
ఆరుగాలం పస్తులుండే
చేటుకాలం దాపురిస్తే..
ఆ గడ్డుకాలం
దరిదాపులకొచ్చేస్తే..
ఎంత కష్టం..ఎంత నష్టం..!?
అలాంటి ఓ రోజు వస్తుందా..
అంతా బాగుంది..
ఆలీజ్ వెల్ కదా..
వద్దే వద్దు ఆ ధీమా..
అది ఆరిపోయే బీమా...
ముందుంది ముసళ్ల పండగ..
విప్పుకు కూర్చుంది
కల్తీ కాలనాగు
తన పడగ...
నువ్వు చేస్తున్న తప్పులు..
చేస్తున్న పాపాలు
నిన్ను కాటు వేసే...
నీతో పాటు అందరికీ
చేటు చేసే
గడ్డు రోజు..
అదిగో వినిపించడం లేదా
డేంజర్ బెల్..గుండె గుభేల్!
నీ దేశం
సుజలాం..సుఫలాం..
మలయజ శీతలామని..
నీ తరం సస్యశ్యామలమని
పొంగిపోకు...
ఇప్పటికీ మెతుకు దొరకని
బతుకులు కోకొల్లలు..
నువ్వు తినిపారేస్తున్న
ఎంగిలి మెతుకుల కోసం
వీధి చివర చెత్త డబ్బా దగ్గర
కుక్కలతో..పందులతో
పోటీపడుతూ ఏరుకుంటున్న
పిల్లాపాపా..బీదా బిక్కీ..
చిరిగిన గుడ్డలతో..
ఎండిన డొక్కలతో..
నీకు కనిపించేది కొందరే..
ప్రపంచంలో కోట్లు..
మానవతకే
పొడుస్తూ తూట్లు!
సోమాలియా..
వినబడ్డం లేదా
ఆ దిక్కు నుంచి
ఆకలికేకలు..
ఇది గతమనుకుంటున్నావేమో
ఇదే వర్తమానం..
అదే బహుమానం..
ఆకలే కొలమానం..!
ఎన్నో దేశాల్లో
ఇప్పటికీ అదే ఆకలి..ఘోరకలి
తిండి దొరక్క
కొందరి మరణం..
తిన్నది కలుషితమై
జబ్బులతో చాలా మంది
దుర్మరణం..
ఇంతకు మించి
ఉంటుందా దారుణం..
తప్పులు పాపాలు
చర్వితచర్వణం..
జగతి గుండెపై
ఎప్పటికీ మాయని వ్రణం!
నేలతల్లి ఒడిలో పచ్చదనం..
నీలాకాశపు సిగలో
పచ్చతోరణం..
ప్రకృతి మాత పచ్చకోక..
వీటన్నిటినీ మనమే చించేసి..
అన్నిటినీ కల్తీలో ముంచేసి..
అరణ్యాలు మింగేసి జనారణ్యాలు..
వరి వంగడాలు తుంచేసి
కాంక్రీట్ కట్టడాలు..
ప్రతి స్టేట్లో..ప్రతి సైట్లో
రియల్ ఎస్టేట్లు..
ఇవి దందాలా..
ముంచేసే ప్రమాదాలా!?
సుయోధనుడి చెరలో
నూటొక్క మెతుకులతో
మిగిలింది నీవెరిగిన శకుని..
మిగిలిన నూరుగురు
విగతులై..
ఆ యుగంలోనే
ఆకలి చావుకు సంకేతాలై..!
ఇకనైనా తెలుసుకో..
నువ్వు చేసే వ్యర్థం
మరోనాటికి అనర్థం..
నీ కల్తీ లేపేస్తూ రోజుకో శాల్తీ
భవిష్యత్ కష్టాలకు
అదే ముడిపదార్ధం...
నీకు అర్దం కాని బ్రహ్మపదార్థం
ఓ మనిషీ..
ఇప్పుడు నువ్వున్నది
గాజుమేడలో..
బలికోరే ఉచ్చు నీ మెడలో..
నువ్వు క్షేమమే...
కాని..ఎదరున్నది నువ్వూహించని క్షామం..
ముంచెత్తే సంక్షోభం..
జాగ్రత్త పడకపోతే
ప్రతి దేశం ఓ సోమాలియా..
ప్రకృతి పరితాపం..
ఆకలి ప్రకోపం..
భద్రం..నువ్వు నేను కాకపోయినా
నీ రేపటి తరం..
మరోనాటి నా తరం చవిచూడబోయే
విలయాన్ని ఆప ఎవరితరం!
పరబ్రహ్మ స్వరూపాన్ని గౌరవిస్తూ..
భావి తరాల గురించి ఆలోచిస్తూ...
ఇప్పటి నుంచీ
నువ్వు తీసుకునే భద్రత
రేపటి ప్రపంచానికి
నువ్విచ్చే వారసత్వం...
నీ మానవత్వం..!
గాలి కల్తీ...
నీరు కల్తీ..
ఆకాశం కాలుష్యమయం..
భూమి బుగ్గిపాలు...
ఇవన్నీ ఇప్పుడు ఒకటై
నిను కాల్చేసే అగ్ని..
నిన్ను కాపాడాల్సిన
పంచభూతాలు
నీ పాపాలకు
భయంకర రూపాలై
నీ ఇంటి రేపటి దీపాలను
ఆదిలోనే ఆర్పేయక ముందే
ఈ కల్తీ..రసాయన..
నిల్వ పదార్థాల
భోజనాలు మాని
బహుజనాల
రక్షణ కోసం
మార్చుకో నీ భక్షణ!
🫀🫁🗣️🦷💧🔥
_నేడు ఆహార భద్రతా దినోత్సవం_
🌒🌒🌒🌒🌒🌒🌒
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
No comments:
Post a Comment