Friday, June 28, 2024

అతిథి-అభ్యాగతుడు*(మన ఇల్లు ఎలా అలంకరించుకోవాలి)

 *అతిథి-అభ్యాగతుడు*(మన ఇల్లు ఎలా అలంకరించుకోవాలి)

అతిథి అన్న మాట తిథి అన్న పదానికి సంబంధించినది. తిథి అంటే ఒక రోజు. ఒక రోజు కన్నా ఎక్కువ కాలం ఉండని వాడు అతిథి. అదేవిధంగా ఫలానా రోజు వస్తానని ముందు చెప్పి వచ్చేవాడు అతిధి కాదు. అలాగే మనం ఫలానా రోజున రండి అని పిలిస్తే వచ్చేవాడు కూడా అతిథి కాదు. భోజన సమయంలో మనం ఎవరు వచ్చినా వారికి అన్నం పెట్టాలి. అలా వచ్చి తినేవాడినే అతిథి అంటారు.

ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? స్వార్థ ప్రయోజనాలతోనో, మెహర్బానీ కోసమో కొందరిని భోజనానికి పిలుస్తారు. వారికోసం ముందుగా వెల్కమ్ డ్రింక్స్, ఆపైన స్నాక్స్, ఆ తరువాత నాలుగైదు కూరలు, రకరకాల పచ్చళ్ళు, వివిధ రకాలైన రైస్ ఐటమ్స్ (బిర్యానీ, పులావు, పులిహార వగైరా) చివరిగా డిసెర్ట్స్, స్వీట్స్. స్వీట్స్ వేరు, డిసర్ట్స్ వేరు అని ఈ మధ్యనే తెలుసుకున్నారు.

మనం పిలిచిన వారు రాకముందే ఇల్లంతా అలంకరణ చేసుకోవాలి కదా. అలంకరణ పూర్తయ్యాక పిల్లలు ఏదైనా కదిలిస్తే వాళ్లకి తిట్లు తప్పవు. అతిథులు వచ్చిన సమయంలో పిల్లలు, (ఒకవేళ ఇంట్లో ఉంటే) పెద్దవాళ్ళు ఏం చేయాలి? వారి గదిలో వారు తలుపు వేసుకుని కూర్చోవాలి. సాధారణంగా వారికి అతిథులు రాకముందే భోజనాలు పెట్టేస్తారు. (అన్ని ఐటమ్స్ పెడతారని ఆశించకండి.) ఆ తర్వాత వారు గది కదలడానికి లేదు.

అతిథులు వస్తారు, ఆహా ఓహో అంటూ ఇంటి అలంకరణనూ, వడ్డించిన పదార్థాలనూ మెచ్చుకుని ఏదో కొంత తిని వెళ్ళిపోతారు. మిగిలిన పదార్థాలన్నీ ఏం చేయాలి? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా. అందులో పెట్టుకోవడం, వారం రోజులు అదే ఇంట్లో ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి పెట్టడం.

ఎందుకీ ఆర్భాటాలు? వీటి ఆరంభాన్ని పాశ్చాత్య పరిపాలన తర్వాతనే చూడవచ్చును. చిలకమర్తి వారి ప్రహసనంలో ఒక జంట ఇంట్లో ఉన్న వృద్ధులను కర్రలు పెట్టుకునే గుడిసెలో ఉంచడం, అక్కడ వృద్ధురాలికి తేలు కుట్టడం, ఆమె బాధతో ఏడుస్తూ ఉంటే కొడుకు వచ్చి నోరు మూసుకోమనడం చదవవచ్చు.ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు.

సనాతన భారతీయ సంప్రదాయం ప్రకారం అతిథి వేరు, అభ్యాగతుడు వేరు. మనం పిలిస్తే వచ్చిన వాడు అభ్యాగతుడు. అనుకోకుండా అవసరార్థం వచ్చిన వాడు అతిధి. అతిథిని భగవంతునిగా భావించి విష్ణు స్వరూపుడుగా తలచి భోజనం పెట్టాలి.

అందరికీ చిన్న విన్నపం. పై అధికారులను తప్పనిసరి అయితే పిలిచి ఇంట్లో వాళ్ళను సర్దుకోమంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మెహర్బానీ కోసం చేయవద్దు. ఇంట్లో వారిని బాధ పెట్టవద్దు.

No comments:

Post a Comment