Monday, June 3, 2024

మహిళామణి పరిణామం గురించి

 మహిళామణి పరిణామం గురించి

పెళ్ళిచూపుల రోజున
మొదట చూచినపుడు
ఆమె ఒక అందాలబొమ్మ

పెళ్ళి రోజున
పీటలమీద కూర్చున్నపుడు
ఆమె ఒక సౌందర్య రాశి

శొభనం రాత్రి రోజున
తెల్లచీర కట్టినపుడు 
ఆమె పోతపోసిన బంగారం

ఏకాంత యాత్రా సమయాన
అరకులోయలో విహరిస్తున్నపుడు
ఆమె పూతపూసిన సింగారం

మొదటి సంతానం కలిగినపుడు
సంతోషములో మునిగినపుడు
ఆమె ఒక సుందర రమణి

రెండవ సంతానం కలిగినపుడు
వంశోధ్ధారకుడు ఉదయించినపుడు
ఆమె ఒక సాధారణ మహిళ

మరి ఐదు వత్సరాల తరువాత
శరీరం స్థూలమయినపుడు
రూపం మార్పుచెందినపుడు
ఆమె ఒకనాటి సుందరాంగి

ఆమె అందం ఏమయింది?
ఆమె అందం ఎక్కడకు పోయింది?
ఆమె అందం ఎందుకు పోయింది?

భర్తకు ధారపోసింది 
పిల్లలకు పంచి పెట్టింది
కుంటుంబానికి ధార పోసింది...

ఇప్పుడామె ఇద్దరుపిల్లల తల్లి
ప్రేమాభిమానములుకల అమ్మ
ఒక ఇంటికి ఆదర్శగృహిణి...

భర్తకోసం పిల్లలకోసం
కుటుంబంకొసం బాధ్యతలు మోస్తున్న
అందం త్యాగంచేసిన సుగుణాలరాశి...

మానవజాతిని కొనసాగించటానికి
సమాజాన్ని వృధ్ధిచేయటానికి
దేముడిచ్చిన వరమే స్త్రీజన్మ...

No comments:

Post a Comment