🔱 అంతర్యామి 🔱
# అష్టావక్ర గీత #
🍁పశుపక్ష్యాదులకంటే మానవుడికి విశిష్టతను చేకూర్చేది అతడి బుద్ధి. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకొని జ్ఞానాన్ని ఆర్జించడం మనిషి ముఖ్య కర్తవ్యం. వివిధ కాలాల్లో మహర్షులు, ఆధ్యాత్మికవేత్తలు జీవనమార్గాన్ని నిర్దేశిస్తూ ఉపదేశాలు అందిస్తూనే ఉన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాంఙ్మయంలో భగవద్గీతది ఉత్కృష్టమైన స్థానం. అయితే వేదాంత జ్ఞానాన్ని నైతిక జీవనాన్ని ప్రబోధించిన మరికొన్ని గ్రంథాలనూ గీత పేరుతో వ్యవహరిస్తుంటారు. అష్టావక్ర గీత ఆ కోవకు చెందినది.
🍁ఎవరైనా మోక్షాన్ని కోరుకుంటే విషయ సుఖాల్ని త్యజించాలి. క్షమ, రుజుత్వం, భూతదయ కలిగి ఉండాలి. సంతోషాన్ని సత్యాన్ని అమృత తుల్యంగా భావించాలి అంటాడు అష్టావక్రుడు. ముక్తిని ఆశించేవాడు ముక్తుడవుతాడని, బంధువుల్ని ప్రేమించేవాడు బద్ధుడవుతాడని, బుద్ధిని బట్టి గతి నిర్ణయమవుతుందని, దేహాభిమానమనే తాటితో బందీ అయినవాడు జ్ఞానఖడ్గంతో ఆ పాశాన్ని ఛేదిస్తే సుఖం పొందగలడని అష్టావక్రుడు చెబుతాడు.
🍁 జ్ఞానం, వైరాగ్యం, సుఖదుఃఖాలు, శాంతి, ఆత్మతత్వం మొదలైన అంశాలపై లోకానికి అమూల్యమైన ఉపదేశం అందించాడు అష్టావక్రుడు. ఆ మహర్షి ఏకపాదుడనే రుషి కుమారుడు. తల్లి సుజాత. మాతృగర్భంలో ఉండగా తండ్రి శిష్యులకు పాఠం చెప్పే విధానాన్ని, వాళ్లను విసిగిస్తున్న తీరును అర్థంచేసుకొని ఆక్షేపించాడు. గుర్తొచ్చి పిల్లను వెక్కిరించినట్టు పుట్టకముందే తన బోధన పద్ధతిని తప్పుపట్టి వక్రభాష్యం చేసినవాడు అష్టవంకరలతో పుడతాడని ఏకపాదుడు భార్య గర్భంలోని శిశువు శపించాడు. ఆ శిశువు ఆ విధంగా ఎనిమిది వంకరల దేహంతో పుట్టి అష్టావక్రుడిగా ప్రసిద్ధికెక్కాడు. పుట్టుకతోనే సమస్త వేద విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఇది విష్ణుపురాణ గాథ.
🍁జనక మహారాజు రాజర్షి. బ్రహ్మజ్ఞాని అయిన అష్టావక్రుడు జనకుడికి చేసిన జ్ఞాన బోధ అష్టావక్ర గీతగా ఆధ్యాత్మిక వాంఙ్మయంలో ప్రాచుర్యం పొందింది. గురుదక్షిణగా ఏమిస్తావని జనకుణ్ని అడిగితే తనను తాను సమర్పించుకుంటానన్నాడు. అదే శరణాగతి. శరణాగతులకు జ్ఞానం కరతలామలకం. అహంకారం దూరమవుతుంది. సత్యం అనుభవమవుతుంది. అష్టావక్ర గీత సాధకులకు బోధించే పరమార్థం ఇదే. అష్టావక్ర సంహితగానూ పండితులు వ్యవహరించే ఈ గీత 20 అధ్యాయాల గ్రంథం. పురుషార్ధ జ్ఞానం ఎలా పొందాలి? ఈ సంసారం నుంచి ఏ విధంగా విముక్తి పొందాలి? వైరాగ్యం సాధించే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అష్టావక్ర గీత.
🍁శ్రద్ధ కలిగిన మనసు జ్ఞానాన్ని పొందుతుందని, శిష్యుడు గురువునుంచి జ్ఞానాన్ని స్వీకరించడానికీ శ్రద్ధాభక్తులు చాలా ముఖ్యమైనవని ఈ గ్రంథం ప్రారంభంలోనే ఒక సందేశాన్ని అందిస్తుంది. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య మాయ అనే పొర ఉంటుంది. ఆ మాయను తొలగించి గురువు సాధకుణ్ని సత్యదర్శనానికి యోగ్యుణ్ని చేస్తాడు. శాంతి మనసుకు లభించే నిశ్చల స్థితి. ధనవంతుడు సుఖంగా ఉన్నట్టు లోకం భావిస్తుంది. కాని, అతడికి శాంతి ఉందా అనేది ప్రశ్న. సంసార రహితుడైన యోగికి హర్ష విషాదాలుండవు. అతడు నిజమైన శాంతిని అనుభవిస్తాడు.
🍁కోరికలు నెరవేరనప్పుడు కలిగే దుఃఖం అశాంతస్థితి. అష్టావక్ర గీత బోధించిన ఆత్మతత్వ విచారం వ్యక్తిత్వ వికాసానికి, శీలనిర్మాణానికి దోహదం చేస్తుంది.
🍁 మనలోని పరమాత్మను తెలుసుకునే మార్గాన్ని ఎరుకపరుస్తుంది. 🙏
-✍️ డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment