*విజ్ఞాన వీచికలు - 444*
*సూర్యనారాయణ నేమాని*
*" బోధనా భాషగా తెలుగు ఉండాలా, లేక ఆంగ్లమా "*
పిల్లల చదువులో బోధనా భాషగా తల్లి భాషను వాడాలా? లేక ఇంగ్లీషును వాడాలా? అని గత పాతిక, ముప్ఫై ఏళ్ళుగా చర్చలు, వాదనలు, ప్రతి వాదనలు జరుగుతున్నాయి. పసి పిల్లలకు వారి సొంత భాషలోనే విద్యా బోధన ఉండాలి అని ఒక వర్గం అంటుండగా, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఇప్పటి అవసరాలకు తగ్గట్టు ఇంగ్లీషులో బోధన జరగాలని మరో వర్గం గట్టిగా వాదిస్తున్నది. భాషను కాపాడటము, స్వావలంబన, సంస్కృతి, మేథాతనం, వ్యక్త్తిత్వ వికాసం లాంటి అంశాలు మొదటి వర్గానికి వాదనా వస్తువులు. ఉపాధి అవకాశాలు, మార్కెటింగు, ఆర్థిక అసమానతలు, కుల వివక్షతలు రెండో వర్గానికి పనికివస్తున్నాయి.
ఈ విషయం మీద అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు మొదలు విద్యా వేత్తలవరకూ ఏదో ఒక వాదన పక్క నిలబడక తప్పని పరిస్థితి. ఇందులో మళ్లీ ఎవరి కోణం వారిదే. ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నా ఉభయ గుడారాలలోనూ నిజాయితీగా సమాజ మంచి కోరే వారు ఉన్నారు. అలాగే వ్యాపారం, వర్గ ప్రయోజనాల కోణంతో మాట్లాడేవారూ ఉన్నారు. వీరిలో ఏ కొద్దిమందో తప్ప ఎక్కువ భాగం గుడ్డివాళ్ళు ఏనుగును తడిమినట్టు ఉంటుంది. చదువు చుట్టూ ఉన్న అనేక అంశాలను పట్టించు కోకుండా పైపైన కనిపించేదే నిజం అని నమ్మే ధోరణితో సొంత అనిపింపులు వినిపిస్తుంటే ఈ గందరగోళంలో అసలు నిజం ఏది అన్నది పెద్ద ప్రశ్న.
సైన్సులో ‘నిజా’నికి ‘అభిప్రాయా’నికి మధ్య స్పష్టమయిన విభజన రేఖ ఉంటుంది. ఇక్కడ నిజం తెలియనంత వరకే అభిప్రాయానికి విలువ. నిజం తేలాక ఇక దానిమీద అభిప్రాయాలకు తావు లేదు. తెల్లటి కాంతిలో ఏడు రంగులు ఉన్నాయి అని ఒకసారి ప్రయోగపూర్వకంగా తేలాక ఇక దీనిమీద అభిప్రాయాలకు తావు వుండదు. ఆ విధంగా భౌతిక శాస్త్రాలలో నిజాన్ని- అభిప్రాయాన్ని వేరుచేసే గీత ఉంటుంది. సామాజిక అంశాలు కూడా శాస్త్రాలే అయినప్పటికీ అవి భౌతిక శాస్త్రాలు ఉన్నంత నిలకడగా ఉండవు. కారణం ఏమిటంటే అవి తేడాలతో ఉన్న వ్యక్తుల గుంపులతో కట్టబడిన సమాజాన్ని గురించి చదివే శాస్త్రాలు. వీటిని గురించి అటు నిష్ణాతుల నుండి ఇటు సామాన్యుడు వరకు ఎవరైనా మాటాడవచ్చు. అయితే మాటల్లో పరిశీలన, లోతు లేకుండా పైపై గమనింపులతో బిగింపు ‘చూపు’తో వాదనలకు దిగితే అందులో గందరగోళం తప్ప చివరిగా నిజం బయటకు రాదు.
విద్యా విధానం పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ విద్యా ‘బోధన’కు సంబంధించి కొన్ని శాస్ర్తియ పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదని సొంత అనిపింపుల ప్రకారం వాదనలు వినిపించటం, ప్రణాళికలు తయారుచెయ్యటం సరైన పద్ధతి కాదు. ఎందుకూ అంటే ప్రాథమిక విద్యలో కేంద్ర బిందువు ఇంకా ‘వికసించని’ బిడ్డ.
ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ అంశాన్ని ముందుకు తేవాలి అన్నా, దాన్ని అనేక మూలాల నుంచి పరిశీలించాలి. బిడ్డ పుట్టుక, సామర్థ్యం, శారీర ఎదుగుదల, మానసిక వికాసం గమనంలో ఉంచుకోవాలి. బిడ్డ పెరుగుతున్న వాతావరణం, సామాజిక అవసరాలు, సాంస్కృతిక వారసత్వం లాంటి అనేక కోణాల నుంచి చూడాలి. వీటి ఆధారంగా ప్రాథమిక విద్యా బోధన ఎలా ఉండాలో నిర్ణయిస్తే అది ఉన్నంతలో శాస్ర్తియంగా ఉంటుంది. దానివల్ల అనుకున్న ఫలితాలూ వస్తాయి.
బోధనా తీరులు ఎలా ఉన్నా, ఏ సంగతులు బోధిస్తున్నా, బోధించే భాష మీద పిల్లలకు పట్టులేనట్టు అయితే పుట్టుకతో వచ్చే తెలివి, సృజనాత్మకత పూర్తిగా విరబూయవు అని ఇప్పటివరకూ ప్రపంచంలో జరిగిన ప్రతి పరిశోధనా తేల్చింది. అయినా సాంస్కృతిక సామ్రాజ్యవాదం పరోక్షంగా అమలు అవుతున్న నేడు వీటిని వినిపించుకొనే వారే కరువు అయ్యారు.
ఈ నేపథ్యంలో శాస్ర్తియ పరిశోధనా ఫలితాలను ఆయా సమాజాలు కానీ వాటిని నడిపే ప్రభుత్వాలు కానీ తలకు ఎక్కించు కోకపోతే బిడ్డల్లో పుట్టుకతో వచ్చే మానవ వనరులు పూర్తిగా వినియోగం లోకి రావు. ఇది మొత్తం సమాజానికే నష్టం. చదువుకు చెందినంత వరకు బిడ్డకు ప్రకృతి ఇచ్చిన తెలివి మీద సామాజిక శిక్షణ (చదువు) ఇవ్వటంలో ఉండే శాస్ర్తియ సూత్రాలను చర్చకు తేవాల్సిన అక్కర ఉంది.
అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోకుండా ఏ దేశం ముందుకు పోలేదు. పిల్లల్లో ముడిసరుకుగా ఉన్న మానవ వనరులను వెలికి తీయటానికి, వాటిని మెరిగించి ఉపయోగంలోకి తేవటానికి విద్య ఒక పనిముట్టు. దేశ ఎదుగుదలలో, ముందుపోకలో అంత ప్రాధాన్యత ఉన్న విద్యను బాధ్యతగల ప్రభుత్వాలు తమ జాతి అవసరాలకు తగ్గట్టు మలచుకుంటాయి. తమకంటూ ఒక జాతీయ విద్యా విధానాన్ని కట్టుకుంటాయి. ఇది తమ కాళ్ళమీద తాము నిలబడే జాతులు పాటించే పద్ధతి.
మన చెడు రాత (bad luck) ఏమిటి అంటే, ఇక్కడ మనం చదివే చదువులు మన కోసం కాదు. అంటే మన జాతి అవసరాలకు కాదు. కూలీలను తయారు చేయటానికి చెప్పే చదువులు. పరాయివాడికి ఊడిగం ఎలా చేయాలో నేర్పించే చదువులు, వలస పోవటానికి ఉద్దేశించిన చదువులు. జాతికి వెన్ను లేకుండా తయారుచేసే చదువులు.
ఈ నేపథ్యాన్ని తెల్లం చేసుకోకుండా, మన విద్య తీరు తెన్నులు ఎలా ఉన్నాయో పరిగణనలోకి తీసుకోకుండా ‘‘అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నామనే’’ అంచనాలు ఎవరిని మోసం చేయటానికో, జాతిని ఎక్కడికి తీసుకు పోవటానికో పరికించి చూడాల్సిన అవసరం ఉంది.
***********************
No comments:
Post a Comment