ఓడిపోవడం తప్పుకాదు. ఓటమిని ఎంజాయ్ చేయడం తప్పుకాదు. కానీ ఓటమిలోనే ఉండిపోవడం తప్పు, మళ్లీ ప్రయత్నించకపోవడం తప్ప. విజయం సాధించాలంటే ముందు ఓటమి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు... మహా అయితే, లోపలున్న అహంకారం పోతుంది. ఓడిపోవాలి. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాల నుంచి విజయం సాధించే సత్తాను ఒడిసి పట్టుకోవాలి.
ఓటమి, విజయానికి మధ్య చాలా చిన్న అడ్డంకి ఉంటుంది. దాన్ని దాటితే చాలు విజయాన్ని చేరుకోవచ్చు. అది చిన్నదే కావచ్చు. ఎక్కువ మందికి పెద్ద భూతంలా కనిపిస్తుంది. అలాగని దాన్ని దాటడం అంత తేలికైన పనేం కాదు. నూటికి తొంబైతొమ్మిది మంది ఆ గీత దగ్గరే ఆగిపోతారు. ఒక్కరే ఆ గీత దాటి విజయాన్ని రుచి చూస్తారు. అది దాటాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి.
మొదటి ప్రయత్నంలోనే విజయం వచ్చేస్తుందన్న నమ్మకం లేదు. ఒక విజయం సాధించాలంటే అనేక ఓటములు తట్టుకునే మానసికస్థాయి కావాలి. ఓటమికి.. విజయానికి మధ్య పెద్ద పోరాటమే చేయాల్సి రావచ్చు. ఆ పోరాటం చేసేటప్పుడు ఉండే మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. ఆదో సైకలాజికల్ చేంజ్..! మానసిక పరివర్తన.
నెగిటివ్ నుంచి పాజిటివ్
ఓటమిలో రెండు రకాలుంటాయి. ఒకటి నెగెటివ్, రెండు పాజిటివ్. ఒక్కసారి నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే కోలుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. అందుకే ఎన్నిసార్లు ఓటమి పాలైనా నెగెటివ్ ఆలోచనలు రానీయకూడదు. వచ్చాయంటే, ఊలిలా దానిలో కూరుకుపోవడం తప్ప పైకి రావడం అంటూ ఉండదు. ఓడిపోయామని బాధపడుతూ ఉంటే ఓటమిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంటారు. నెగెటివ్ మైండ్ సెట్ అనేది అసలు ఉండకూడదు. ఓటమిని ఎప్పుడూ పాజిటివ్ గానే తీసుకోవాలి. అదే, గెలుపుకు దారి చూపిస్తుంది.
మనిషిని ఇంకాస్త బలవంతుడిగా తయారుచేస్తుంది. గెలుపు పారాన్ని బుర్రకు ఎక్కేలా బోధిస్తుంది. అందుకే, పాజిటివ్ ఫెయిల్యూర్ను ప్రేమపూర్వక హెచ్చరికగా తీసుకోవాలి. ఓటమి భయం ఉన్నంత కాలం గెలుపు ద్వారాలు తెరుచుకోవు. మైండ్ లోని ఆలోచనలే మనిషి గెలుపు, ఓటములను నిర్దేశిస్తాయి. ఓటమి నుంచి గెలుపు వరకు ప్రయాణం చేయడం అంటే మనిషి నెగెటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలకు మారడమే.
ఒంటరితనం నుంచి సలహాలు
ఓటమి చాలామందిని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. ర్యాంకు రాకపోవడం. పరీక్ష పాస్ కాకపోవడం. ప్రాజెక్ట్ సరిగా సబ్మిట్ చేయకపోవడం. ప్రేమలో వైఫల్యం... లాంటి ఓటములు ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అవి మనిషిని మిగిలిన మనుషులకు దూరం చేస్తాయి. అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్లు దూరం కావచ్చు. లేదా ఒటమి పాలయినవాళ్లే ఆ భారంతో ఎవరినీ కలవకపోవచ్చు.
అలాగని ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండిపోతే జీవితం చీకటవుతుంది. నోబెల్ బహుమతి పొందిన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 'స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ" ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన మొదటి సినిమా 'త్రిశక్తి'ఫెయిల్ కావడంతో అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత 'చాందినీ బార్'తో జాతీయస్థాయి పురస్కారం పొందాడు.
ఎందుకంటే, వాళ్లు ఒంటరిగా ఉండిపోలేదు. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించారు. తమకు తామే సలహాలిచ్చుకున్నారు. అద్భుత విజయాల్ని సాధించారు. అందుకే ఓటమి వల్ల వచ్చే ఒంటరితనాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. అండగా నిలిచేవాళ్లు, నిపుణుల సలహాలు తీసుకుని మళ్లీ కర్తవ్యం వైపు వెళ్లాలి.
బాధ నుంచి కర్తవ్యం
ఓటమి కలిగినప్పుడు బాధేస్తుంది. బాధను దిగమింగుకోలేక పోతే కన్నీళ్లు వస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని దిగులేస్తుంది. ఆ బాధ నుంచి కోలుకోవడం కష్టమే. అలాంటప్పుడు మనసంతా శూన్యమై పోతుంది. లోపల తెలియని నిస్సత్తువఆవహిస్తుంది. ఎక్కువ రోజులు అలాగే ఉండిపోతే కాలం ఆగిపోదు. జీవితం వృథాగా గడిచిపోతుంది. అలాగని ఆ బాధలో ఉండిపోతే విజయం రాదు.
అందుకే, ఆ బాధ నుంచి వీలైనంత తొందరగా కోలుకోవాలి. కన్నీటిని దిగమింగాలి. ఓటమి వల్ల ఎదురైన అనుభవాల నుంచి కర్తవ్యం వైపు నడవాలి. బాధలో ఉన్న మనసుకు నచ్చజెప్పుకుని, మళ్లీ మాములు మనుషులవ్వాలి. వెంటనే కుదరకపోయినా క్రమక్రమంగా రోజువారీ జీవితంలోకి అడుగుపెట్టాలి.. బాధ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మనసు తేలికపడుతుంది. సరికొత్తగా ఆలోచిస్తుంది. తప్పులను సరిదిద్దుకోవచ్చు. విజయానికి కావాల్సిన కొత్త సూత్రాలను సిద్ధం చేసుకోవచ్చు. ఓటమి వల్ల వచ్చే బాధలోనే ఉండిపోకుండా కర్తవ్యం వైపు మళ్లడం తప్పనిసరి.
కుంగుబాటు నుంచి కర్తవ్యం
ఓటమి ఎదురైనప్పుడు 'అయ్యో..! అలా ఎలా జరిగింది? నేనెందుకు ఓడిపోయాను?' అనుకుంటూ కుంగిపోయే వాళ్లే ఎక్కువమంది ఉంటారు. కుంగుబాటు నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. బాలీవుడ్ నటుడు షారుఖాన్ 'నా సినిమా ఫెయిల్ అయిన ప్రతిసారీ నేను మరింత కష్టపడడం నేర్చుకున్నాను. మరింత వైవిధ్యంగా ప్రేక్షకుల ఎదుట నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాను' అని చెప్పాడు.
అభినవ్ బింద్రా లండన్ ఒలింపిక్స్లోలో విజయం సాధించిన తర్వాత 'బీజింగ్ ఒలిపింక్స్ నేను ఓడిపోవడానికి కారణం నా మానసిక స్థితే" అన్నాడు. అంటే.. ఓటమి, గెలుపు ఏదైనా మనసుపై ఆధారపడి ఉంటుంది. ఓటమి వల్ల వచ్చిన కుంగుబాటులోనే ఉండిపోతే సాధించేదేం ఉండదు. ఓటమి వల్ల వచ్చే కుంగుబాటును మనసులోంచి తీసిపారేయాలి. కొత్తగా విజయం కోసం ప్రయత్నించాలి. మాసిన చొక్కా విప్పి, ఉతికిన చొక్కా వేసుకున్నట్లు, ఆలోచనలను మార్చుకోవాలి.
ఓటమి నుంచి గుణపాఠాలు
ఓడిపోవడం అంటే ఎక్కడో ఏదో లోపం జరిగిందనే అర్ధం. అంతేగానీ ప్రయత్నించడమే తప్పు అని కాదు. విజయం సాధించిన వాళ్లకు, ఓడిపోయిన వాళ్లకు ప్రధాన తేడా ప్రయత్నలోపమే తప్ప మరొకటి కాదు. అలాగే విజయం సాధించే వాళ్లు చివరి నిమిషం వరకు పోరాడతారు. ఏ చిన్న ఆదరువు దొరికినా దాని సాయంతో ముందుకు పోతారు. ఓడిపోయిన వాళ్లు ఎక్కడో, ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటారు.
అందుకే, ఓటమి ఎదురైనప్పుడు అందుకు సంబంధించిన కారణాలను బేరీజు వేసుకోవాలి. అంతేగానీ విజయం కోసం మళ్లీ ప్రయత్నించకుండా ఊరుకోవడం పొరపాటు.. చేసిన పొరపాట్లు తెలుసుకోకుండా, మళ్లీ మళ్లీ అవే చేస్తూ పోతుంటే.. అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. ఓటమిని స్వీకరించలేకపోవడం అంటే మార్పును అంగీకరించలేకపోవడమే. గెలుపుకోసం ఎప్పటికప్పుడు తమను తాము మార్చుకుంటూ పోవాలి.
No comments:
Post a Comment