Sunday, June 23, 2024

******'వరలక్ష్మి- వంటల ఛానల్'.

 బొరుసు చంద్రరావు స్మారక సహరి ఉగాది కామెడీ కధల పోటీలో 2024 బహుమతి పొంది ఈ వారం (31.5.24) సహరి అంతర్జాల వార పత్రిక లో వచ్చిన నా  కథ. 

'వరలక్ష్మి- వంటల ఛానల్'.

"నేను ఒక యూ ట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా!" సీరియస్ గా అంది వరలక్ష్మి. 
తింటున్న ఉప్మా గొంతుకు చుట్టుకుపోగా ఒక గ్లాస్ నీళ్లు తాగి"ఏమి ఛానల్ తల్లీ!" భయంగా అడిగాడు విలాపరావు. అసలు అతని పేరు విలాసరావు, కానీ, పెళ్లయ్యాక విలాసమనేది  సముద్రం లో కొట్టుకుపోయి, విలాపరావుగా స్థిరపడ్డాడు. 

వరలక్ష్మికి సోషల్ మీడియా పిచ్చి.  రోజూ ఒక కొత్త ఐడియా వస్తుంది సోషల్  మీడియా లో పెట్టడానికి. పొద్దున్నే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని"హాయ్ చెలులూ! ఇదిగో నా బ్రష్, పేస్ట్, నేను పళ్ళు తోముతున్నా!" అని ఒకటి, కాఫీ కప్ పట్టుకుని గుడ్ డే బిస్కట్  తింటూ"గుడ్ డే" అనీ, భుజాన టవల్ వేస్కుని "బై స్నానం చేసి వస్తా!" అని పోస్ట్ లు.

 ఎందుకూ పనికిరాని అడ్డమైనవాళ్లు "సూపర్, అదిరింది" అని రిప్లై పెడితే పొంగిపోవడం, వాళ్ళు పెట్టే  పిచ్చి కామెంట్ లకి సమాధానం ఇవ్వడం. ఒకరోజు ఉదయం  విలాసం లేచేసరికి హాల్ లో మాటలు వినపడుతున్నాయి ఏమిటా అని చూస్తే చీర కట్టడం ఎలా అంటూ రికార్డు చేస్తోంది. "ఓయమ్మో! కొంపలు మునుగుతాయ్ ఇలా చీరలు కట్టడం, జాకెట్లు వేసుకోవడం వాట్సాప్ లోనూ,  ఫేస్ బుక్ లోనూ పెట్టకూడదు" అని ఒప్పించేసరికి  తలప్రాణం తోకకి వచ్చింది. ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనే పిచ్చి ఎలా వదుల్తుందో తెలీదు. ఇప్ప్పుడు యూట్యూబ్ ఛానల్  అంటోంది.

"నేను వంటల ఛానల్ పెడతాను" అంది వరం. 
"వంటల ఛానెలా!  కందిపప్పు కి, మినపప్పు కి తేడా తెలీదు, ఆవాలకి, గసగసాలకి తేడా తెలీదు. నువ్వు వంటల గురించి ఛానల్ పెట్టడం ఏమిటీ ? ఉప్మా చూడు ఎలా ముద్దకట్టిందో" అన్నాడు విలపిస్తూ  విలాసం.

" బావుందా! గోధుమ పిండి ఉప్మా! కొత్త ప్రయోగం" ప్రయోగశాలలో ఎలుక ని చూసినట్టుగా చూస్తూ అంది వరం. గోధుమ పిండి  ఉప్మానా... ఎక్కడా వినలేదు!" 
"మరి అదే! నా దగ్గర ఇలాంటివి బోలెడు వంటల ఐడియాలు ఉన్నాయి. 'వరండాలో వంటలు' అనే ఛానల్, మన ఫ్లాట్స్ లో కారిడార్ లో వంటలు చేస్తా! మన ఫ్లాట్స్ లో వాళ్లు కూడా విడియోలో కనిపిస్తారంటే వాళ్లే సబ్ స్క్రైబ్ చేస్తారు" ధైర్యంగా అంది వరం.

"వరం నీ కాళ్ళు పట్టుకుంటానే! నాలుగేళ్లలో పది ఇళ్ళు మారాం, ఇంక నా వల్ల కాదు. వంట నేను చేస్తాను, హాయిగా కాలుమీద కాలు వేసుకుని ఓటీటీ లో సినిమాలు చూడు నా తల్లివిగా" బతిమిలాడాడు విలాపం. 
"ఊహూ! నేను ఫేమస్ అవుతానని కుళ్ళు నీకు, వంటలు చూపించేవాళ్ళకి వంటలు వచ్చా ఏమిటి? నేను ఇప్పటికే మన ఫ్లాట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇవాళ నా ఛానల్ ఓపెనింగ్ అని, ఒక ఫోటోగ్రాఫర్ ని కూడా పిలిచాను. ఇష్టమైతే నువ్వూ ఉండు, మంచి వంట చేస్తాను తిందుగాని" జాలిపడి చెప్పింది వరం. "ఏంవంట?" ఏడుపు గొంతుతో అడిగాడు విలాపం.

"తోటకూర హల్వా" ఆఁ! అదేమి వంటే..నా వరం!అందరూ తిడతారు" అన్న విలాపం తో "ఏదైనా కొత్తగా ఉంటేనే లైక్లు ఎక్కువ వస్తాయి" అంటుండగానే బ్లింకిట్ లో వరం ఆర్డర్ చేసినవి వచ్చాయి. ఒక తోటకూర కట్ట, అరకిలో నెయ్యి, పావుకిలో జీడిపప్పు, పావుకిలో బాదాం."అమ్మో! ఇవన్నీ సర్వనాశనం అవుతాయి.
"ఎంచక్కా జీడిపప్పు, బాదాం ఉత్తివి  తిందాం, ఆ పిచ్చి వంట చెయ్యక" మొత్తుకుంటున్న మొగుణ్ణి పట్టించుకోకుండా లోపలికి  వెళ్లి మంచి కంచిపట్టు చీర, నగలు వేసుకుని బయటికి వచ్చింది.

అప్పటికే వరండాలో బోలెడుమంది ఆడవాళ్లు మంచి చీరలూ, నగలూ వేసుకుని ఎదురు చూస్తున్నారు. వరం బయటికివచ్చి ఫోటోగ్రాఫర్ కి  సైగ చేసి చక్కగా అలంకరించిన పొయ్యి దగ్గరికి వెళ్లి మిగిలిన ఆడవాళ్ళని కూడా పిలిచి "ఇదిగో చెలులూ! ఇప్పుడు మనం చెయ్యబోయే వంట 'తోటకూర హాల్వా" అనగానే వాళ్ళ ముఖాలలో భయంతో కూడిన, ఆశ్చర్యంతో కలిసిన వణుకు కనిపించింది.

"ఇప్పుడు దానికి కావాల్సిన సామాను చెప్తాను. అరకిలో నెయ్యిలో పావుకిలో జీడిపప్పు, పావుకిలో బాదంపప్పు వేయించి పక్కకి పెట్టండి, అందులోనే సన్నగా తరిగిన తోటకూర నాలుగు స్పూన్స్ వేయించి పక్కకి పెట్టండి, అరకిలో పంచదార ముదురు పాకం పట్టి అందులో జీడిపప్పు, బాదంపప్పు, తోటకూర వేసి స్టవ్ ఆపండి. తినేటప్పుడు మీకు నచ్చకపోతే తోటకూర తీసేసి తినండి." అలా చెప్తూ పంచదార పాకం లో నెయ్యి, బాదాం, జీడిపప్పు అన్నీ వేసాక, పైన తోటకూర వేసి  స్టవ్ కట్టేసి
"అబ్బ! ఎంత మంచి  వాసనో! టేస్ట్ చూడండి"
అని పక్కనున్న సంధ్య కి పెడదామంటే పంచదార గడ్డగట్టి దిమ్మలా అయింది, ఆవిడ తెలివిగా నాలికకి రాసుకుని "అద్భుతం వరం" అంది కానీ, అది చెమ్చాకి రావట్లేదు. 
సంధ్య మాటలు నిజమని నమ్మిన అమాయకపు అనితకి తోటకూరతో ఒక చెంచా నోట్లో పెట్టగానే "వాక్" అంటూ వాంతి చేసుకుంది. "కట్" అంటూ వీడియో ఆపించి
"ఏంటి అనితా! కొంచెంసేపు ఆపుకోలేవా?" అని అరిచింది. 

"సఖులూ! రేపటి మన వంట కాకరకాయ బర్ఫీ. దానికి తగ్గ సరుకులు  చెప్తాను. రేపటికి మీలో ఒకరు రెడీగా పెట్టుకోండి, కిలో కోవా, అరకిలో పంచదార, పావుకిలో జీడిపప్పు, పావుకిలో బాదాం పప్పు, అరకిలో నెయ్యి, రెండు కాకర కాయ ముక్కలు. 
మన వరండాలో వంట మీకు నచ్చితే లైక్  చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్ స్క్రైబ్ చెయ్యండి"
అని విడియో అప్లోడ్ చేసింది. 

సరే! ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసాను, మీరు అందరూ సబ్ స్క్రైబ్ చెయ్యండి" అంటూ హడావిడి పెట్టింది.  ప్రతీ సెకనుకీ చూసినా గంట తర్వాత ఒక్క లైక్ లేదు. పైగా "తోటకూర హాల్వా ఏమిటే నీ బొందా! రేపు కాకరకాయ బర్ఫీనా" అంటూ తిడుతూ కామెంట్స్ పెట్టారు. 

అప్పటికీ అనిత అంది కొంచెం "అందరూ తినగలిగే వంటలు చెప్పచ్చుకదా, లైకులు రాకపోయినా కనీసం హాయిగా తింటాం." 
"లైకులు లక్షల్లో వస్తే డబ్బులు కూడా అలానే వస్తాయి. మరి నీభాగం డబ్బు కావాలా? స్వీట్ కావాలా ? కూరగాయల రసాలు, కాకరకాయ రసాలు వీడియోలు చూడు ఎంతమంది చూస్తారు? అందరూ తాగుతారా ఏమిటీ? మనకి లైకులు కావాలి అంటే ఇలా 'హఠ్కే వంటలే' చూపించాలి" అన్న వరలక్ష్మి మాటలకి అనిత నోరు మూతపడింది. 

స్ట్రాబెర్రీ పులావు, బీట్రూట్ ఆవకాయ, వంకాయ జెల్లీ లాంటి వింతవంటకాలు పెట్టినా లైకులు, వ్యూస్  రాకపోగా తిట్లు వస్తున్నాయి. తనమీద ఎవరో భయంకరమైన కుట్ర చేస్తున్నారని అనుమానం వచ్చింది వరానికి. 

ఈ పిచ్చి ఎలా వదిలించాలో తెలీక గిలగిలా కొట్టుకుంటున్నాడు విలాపం. 
ఛానల్ వారోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన వంట అని మందారపూల కూర, మామిడాకుల పచ్చడి చేస్తానని ముందే అనౌన్స్ చేసింది. 

మర్నాడు చెలులు, సఖులతో వంట మొదలుపెడదామని స్టవ్ వెలిగించగానే జరిగింది ఆ ఘటన. ఫ్లాట్స్ ఉండే అన్నలూ, తమ్ముళ్లూ పదిమంది, కర్రలు, కత్తులేకాక రాజమౌళి, బోయపాటి సినిమాల్లో చూపించే వింత, వింత ఆయుధాలు పట్టుకుని వచ్చారు. 
వాళ్లొస్తున్న సంగతి తెలిసిందేమో విలాపం కూడా అక్కడే ఉన్నాడు. 

అందులో  కొరటాల సినిమాలో విలన్ లాంటి ఓ అన్న "ఏంటమ్మా! తా చెడ్డ కోతి వనమంతా చెడిపిందన్నట్టు నువ్వు వంట చెయ్యవు, చక్కగా వండి పెట్టే మా ఇళ్లల్లో ఆడాళ్ళని పాడుచేసావు. వంటలు మానేసి కొత్త చీరలు కొనడం, తయారవ్వడమే సరిపోతోంది. ఒకోరోజు ఒకళ్ళ చేత సరుకు తెప్పిస్తున్నావ్! అవన్నీ బూడిదలో పోసినట్టే. మామిడాకుల పచ్చడి చేస్తావా? నేను జిల్లేడాకుల హాల్వా, గన్నేరుకాయల కూర చేశా! తింటావా! చస్తావా!" అని ఉరిమాడు. 

ఆ ఫోటోగ్రాఫర్ అన్నీ విడియో తీస్తున్నాడు 'వద్దు' అని వరం సౌజ్ఞ చేసినా. "ఏయ్ ఆడంగులూ ఇంకా ఏంది గుడ్లప్పగించి చూస్తుండారు. ఇంటికి బోయి సరిగ్గా వంటలు చెయ్యుండ్రి లేదంటే మీకూ ఇవే తినిపిస్తా!" అరిచాడు. దెబ్బకి ఠా! ఆడాళ్ళ ముఠా! ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమయ్యారు. 
కొత్తగా కొన్న గద్వాల చీర గొంతులో కుక్కుకొని సినీ ఫక్కీలో లోపలికి పరిగెత్తింది వరం. 
"పోనిలే వరం, ఆయన అసలే పెద్ద రౌడీట, కొన్నిరోజులు ఈ సోషల్ మీడియా గోల మానేసి హాయిగా ఉండు. నేను నీకు అన్నీ చేసిపెడతా! హాయిగా తిని టీవీ చూసుకో" 
"ఎన్ని కలలు కన్నాను! నేను ఫేమస్ అవుతుంటే తట్టుకోలేక ఎవరో కుట్ర పన్నారు" ఏడుస్తూ అని అలానే కుమిలిపోతూ పడుకుంది. 

పొద్దున్నే విలాసం లేచి కాఫీ కలిపి నోట్లో పెట్టుకోపోతుంటే, వరం పెట్టిన పెద్ద పొలికేక వినిపించి పరిగెత్తాడు. సెల్ ఫోన్ చూస్తూ 'ఓ'అని ఏడుస్తోంది వరం. 
"ఏమైందే!" ఖంగారుగా అడిగాడు, మాట్లాడకుండా సెల్ ఇచ్చింది. నిన్న జరిగిన గోల అంతా సోషల్ మీడియాలో పెట్టాడు ఆ ఫోటోగ్రాఫర్. "పోనిలే వరం! అవన్నీ పట్టించుకోకు, నాలుగు రోజులయ్యాక ఎవరూ పట్టించుకోరు" అన్నాడు తేలిగ్గా. 

"నువ్వో పిచ్చోడివి, అవన్నీ ఎవడు పట్టించుకున్నాడు, వ్యూస్, లైకులు చూడు లక్షల్లో ఉన్నాయి. ఈ వీడియో నేను పెడితే బావుండేది" అని ఏడుస్తున్న వరాన్ని చూసి ఏంచెయ్యాలో తేలిక ఉన్న నాలుగు వెంట్రుకలు పీక్కున్నాడు విలాసం. 

"ఇంకా నయం! ఆ మగవాళ్ళని నేనే పిలిచానని, ఆ వీడియో నేనే పెట్టమన్నానని తెలిస్తే చంపేస్తుంది" అనుకుంటూ వేరే గదిలోకి పరిగెత్తాడు విలాసం. 

రచన : శ్రీపతి లలిత.

No comments:

Post a Comment