Sunday, June 23, 2024

భలే మందు* ============ (హాస్యకథ)

 *****
                       *భలే మందు*
                     ============
                        (హాస్యకథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏమే, నాంచారీ? మొద్దు మొహమా ? రాత్రి తిన్న కంచాలు కడగకుండా అలా వదిలేసావ్? ఆ ఎంగిలి కంచాలు మీ ఎంకట్రావు వచ్చి తోముతాడా?"  అది ….తన తల్లి గొంతు.

"అలాగే తోముతాడు కానీ, ఇంతకీ ఆ ఎంకట్రావు ఎవడే రామలక్ష్మీ?" అది… తన భార్య అంజని గొంతు.

"ఇంకెవడు ? మీ బాబు, అదే మీ నాన్న!"

"ఔనా? అయినా మా బాబు ఎందుకు తోముతాడే? అవసరమైతే ఆ అంజిబాబు వచ్చి తోముతాడు"

"అంజిబాబా ? ఆడెవడు??"

"ఇంకెవడు? మీ బాబు. అదే నా మొగుడు"
కరాఖండీగా చెప్పింది అంజని.

వంటింట్లో మొదలైన ఉరుములు... పిడుగుల రూపంలో దారి మళ్ళి, తన వైపు దూసుకు రావడంతో, చెవుల్లో తువ్వాలు కుక్కుకుని,  ఏమీ ఎరగనట్టు మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు అంజిబాబు.

ఎవరికైనా అమ్మవారి అష్టోత్తరాలతో, ప్రతిదినం తెలవారుతుంది. కానీ పాపం అంజిబాబుకు మాత్రం అత్తాకోడళ్ళ దుష్టోత్తరాలతో మెలకువ వస్తుంది.

      *****     *****      *****      *****

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో, కొడుకు అంజిబాబును చాలా గారాబంగా పెంచింది రామలక్ష్మి. తన అన్నగారి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంది, కానీ అంజిబాబు మటుకు తల్లిని ఎదిరించి ఆమె మాట వినకుండా తన క్లాసుమేట్ అంజనిని ప్రేమించి,  వివాహం చేసుకున్నాడు. 

తన మేనకోడలు బదులుగా  ఈ ఇంటి కోడలిగా అంజని   వచ్చిందన్న  దుగ్ధతో,  కోడలి మీద చెలరేగిపోతూ ఉంటుంది రామలక్ష్మి.

కాపురానికి వచ్చిన మొదటి రోజుల్లో,

"అంజీ! మీ అమ్మేంటి నన్ను నా పేరుతో  కాకుండా నాంచారీ అని తిడుతుంది?" అమాయకంగా అడిగింది అంజని.

"ఓహ్ అదా ? టూ బర్డ్స్ ఎట్ ఒన్ షాట్  అన్న మాట. అంటే, మా నాన్నమ్మ పేరు నాంచారమ్మ. ఆవిడ మా అమ్మని రాచిరంపాన పెట్టేదట. అదిగో ఆవిడ మీద, నీమీద ఉన్న  కోపాన్ని ఒకేసారి ఇలా ఆ పేరెట్టి  సాధించడం ద్వారా తీర్చుకుంటోందన్న మాట" తల్లి తిట్ల వెనుక ఉన్న రహస్యం చెప్పాడు అంజిబాబు.

మొదట్లో కొన్నాళ్ళు మౌనంగా ఉండి భరించినా, అత్తగారు తగ్గకపోవడంతో తను కూడా మాటలకు పదును పెట్టింది అంజని.

అటు ఎంతో గారాబంగా పెంచిన తల్లి, ఇటు ఎంతో ప్రేమతో చేసుకున్న భార్య. ఇద్దరినీ సముదాయించలేక రైలు చక్రానికీ, రైలుపట్టాకు మధ్య పడి పచ్చడయిపోయిన పావలా బిళ్ళలా అయిపోయింది పాపం, అంజిబాబు పరిస్థితి, గడచిన మూడేళ్లుగా.

      *****     *****     *****     *****

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన అంజిబాబుకు, తల్లి, పెళ్లాం మద్య  మొదలైన "రామాంజనీయ యుద్ధం" సాయంత్రం ఆట  సాదర స్వాగతం పలికింది.

"ఏమే నంగనాచి నాంచారీ! నేను గుడికి వెళ్లగా చూసి, మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆ సందువాపెట్టె రోడ్డు మీద పడేస్తావా?" అంటూ కోడలు మీద యుద్ధం ప్రకటించింది రామలక్ష్మి.

"ఏం చేసుకుంటావ్,  పాతబడిపోయిన ఆ పల్లవుల కాలం నాటి పాడు పెట్టె? అందుకే బయట పడేసాను. హాయిగా ఉందిప్పుడు!" కయ్యానికి కాలు దువ్వింది అంజని.

"అంటే పాతబడిపోయినవి అన్నీ బయట పడేస్తావా?" రెచ్చగొట్టింది అత్తగారు.

"ఏం డౌటా ? అవసరమైతే నిన్ను కూడా" రెచ్చిపోయింది కోడలు.

"ఔనా ? సరే ఏం చేస్తానో చూడు" అంటూ, అంజని పుట్టింటి వారిచ్చిన టీవీని ఓ పెద్ద పహిల్వాన్ లా రెండు చేతులతో ఎత్తి,

"ఐదేళ్లు మీ నాన్న వాడుకుని మనకిచ్చిన  ఇక్ష్వాకుల కాలం నాటి ఈ దిక్కుమాలిన టీవీ ఇక్కడెందుకే?" అంటూ బయటపడేయడానికి సంసిద్ధమౌతున్న తల్లి, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్న భార్యల మధ్యలోకి దూకిన అంజిబాబు, గంజి పెట్టిన బట్టలా అణిగిపోయాడు.

ఇక ఈ యుద్ధ విరమణ సంధులు, రాయబారాల ద్వారా జరిగే పని కాదనీ, ఇక నువ్వే దీనికి పరిష్కారం చూపాలని ఆ భగవంతునికి భక్తితో విన్నవించుకున్నాడు అంజిబాబు. 

ఈలోగా తన బాల్య మిత్రుడు బుకారా ఫోన్ చేయడంతో, యుద్ధ విరమణ వ్యూహాలకు తాత్కాలిక విరామం ప్రకటించి, ఫోన్ ఎత్తాడు అంజి.

     *****     *****     *****     *****

ఓ నాలుగు రోజుల తరువాత, ఉదయాన్నే గుమ్మ ముందు నిలబడ్డ ఇద్దరు వ్యక్తులను చూసి ఆశ్చర్య పోయాడు అంజిబాబు. వారు తమ గురించి పరిచయం చేసుకోగానే, లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోపెట్టాడు.

అప్పటికే రామాంజనీయ యుద్ధం  ఉదయం ఆట మొదలైపోయింది వంటింట్లో.

బిక్కుబిక్కుమంటూ వింటున్నారు ఆ మిత్రద్వయం. నాకు ఇది మాములే అన్నట్టు  పేపరు తిరగేస్తున్నాడు అంజిబాబు.

"ఏమే నాంచారీ,  నిన్ను తగలెట్టా, ఇది అట్టా? ఇందులో అట్టేదే ? అన్నీ కన్నాలే. కుక్కలు కూడా ముట్టవు ఈ అట్టుని" కయ్యిమంది రామలక్ష్మి.

"ఒసేయ్ రాముడూ! ఆ అట్టు కుక్కలకు కాదు, నీకే. డాక్టర్ నిన్ను చేయమన్నది  డైటింగ్ కానీ  నాతో ఫైటింగ్ కాదు. తిని తగలడు" సర్రుమని జవాబు ఇచ్చింది అంజని.

"డాక్టర్ చెప్పకేం? ఎన్నయినా చెప్తాడు. నేను  ఓ పది రూపాయలు ఎక్కువ ఇస్తే, నీకు  అన్నం కాకుండా మేకలా నమలేలా ఆకు కూరలే రోజూ పెట్టమని చెప్తాడు. ఏం  అలా చెప్పించమంటావా? అసలు బొక్కలుతో ఉన్న ఇలాంటి  దిక్కుమాలిన అట్లు తినే బెంజిబండిలా ఉండే మా అంజిగాడు కన్నాలు పడిన కంజీరా మల్లే  అయిపోయాడు" దుమ్మెత్తిపోసింది రామలక్ష్మి.

"ఔనా! అందుకే మరి, నీ వంట తిని బతుకు మీద విరక్తి చెందిన నీ మొగుడు కాస్తా
సన్నాసుల్లో కలిసి కాశీ పోయాడు" అత్త పోసిన దుమ్మును, సమాధానంతో దులిపేసింది కోడలు.

"ఒసే, సన్నాసీ! నా మొగుడు సన్నాసుల్లో కలిసి కాశీకి పోలేదే ! హాయిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని స్వర్గానికి పోయాడే" గొప్పగా చెప్పింది అత్త.

హాలులో కూర్చుని ఈ సంభాషణలు విన్న మిత్రద్వయం ఇక వినే ఓపిక లేక,  వాచిపోయిన చెవులను రుద్దకుంటూ, కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, అంజిబాబు భుజం తడుతూ ఒక్క అంగలో గదిలోంచి రోడ్డుమీదకు వచ్చి పడ్డారు.

     *****     *****     *****     *****

రెండు సంవత్సరాలు గిర్రున తిరిగాయి.

ఆ రోజు సాయంత్రం, ఈ మధ్యనే కొనుక్కున్న కొత్త ఇంట్లో, నలభై అంగుళాల స్మార్ట్ టీవీలో, జీడిపప్పు నములుతూ ఛీఛీ టీవీ ఛానల్లో వస్తున్న "గయ్యాళి అత్త వయ్యారి కోడలు"  టీవీ సీరియల్ ఐదు వందల ఒకటో ఎపిసోడ్ చూస్తున్నాడు అంజిబాబు.

"ఏయ్.. కిట్టప్పా! " అరిచింది టీవీ సీరియల్లో అత్తగారి పాత్రధారి.

"వస్తున్నా తల్లీ" గుండు గోక్కుంటూ వచ్చాడు ఆ పాత్రధారి.

"నా బిడ్డ పిండం నా కోడలు గర్భంలో ఉండకూడదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అండపిండబ్రహ్మాండాలు బద్దలైనా సరే నాకు దాని పిండం, దాని గర్భంలోని పిండం కూడా నాకు కావాలి."

"అమ్మా, ఆ పిండాలు తేకపోతే మీరు నాకు పిండం పెట్టేస్తారని తెలుసు. దానికి ఒకటే మార్గం ఉంది. ఆ చెవి ఇలా పడేయండి" 

"చెవి ఎలా పడేస్తాను, నీ పిండం పెట్టా!  నువ్వే చెవిలోకి వచ్చి తగలడు" చెప్పింది అత్తగారు.

"పుచుక్ పుచుక్......" రహస్యంగా చెవిలో దూరి చెప్పాడు కట్టప్ప.

"నువ్వు గట్టిపిండానివే కిట్టప్పా! సరే, అలాగే కానీ" చెప్పింది అత్తగారు.

        *****     *****     *****     *****

"ఏయ్.. కిట్టప్పా! " అరిచింది కోడలు పాత్రధారి.

"చెప్పు బిడ్డా!" గుండు బరుక్కుంటూ వచ్చాడు ఆ పాత్ర వేస్తున్న గోవర్థనం.

"నా కడుపులో పెరుగుతున్న పిండం తీసేయాలని నా అత్త ఎవరితోనో మంతనాలు చేస్తోందని తెలిసింది. అందుకే,  నాకు ఎలాగైనా దాని తల, ఆలాగే దాని తలలోని జేజమ్మ రెండూ కూడా కావాలి" కళ్లూ, పళ్లూ రెండూ బయట పెడుతూ కోపంగా చెప్పింది, కోడలు.

"ఒకటి తెస్తే, రెండోది ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది బిడ్డా! కానీ దానికి ఓ ఉపాయం ఉంది. ఆ చెవి ఇలా పడేయ్" అని గోవర్థనం
చెప్పగానే, తన చెవిని అతని నోట్లో పెట్టింది కోడలు.

"పుచుక్ పుచుక్......" రహస్యంగా చెవిలో ఊదేడు గుండు గోవర్థనం.

"అదే నీ తక్షణ కర్తవ్యము" అంటూ పొంగిపోయింది కోడలు.

        *****     *****     *****     *****

ఆ సీరియల్లో అత్త పాత్రలో తన తల్లి రామలక్ష్మి జీవిస్తున్న తీరు, కోడలు పాత్రలో తన భార్య అంజని చెలరేగిపోతున్న తీరు చూసి, ముచ్చట పడి పోయాడు అంజిబాబు, జీడిపప్పు నములుతూ.

     *****     *****     *****     *****

ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉండి, కోడిపుంజుల్లా దెబ్బలాడుకున్న తన భార్య, తల్లి ఈ రెండు సంవత్సరాలుగా బుల్లి తెరకెక్కి నిజమైన అత్తాకోడళ్ళలా దెబ్బలాడుకుంటూ తనతో పాటు అందరికీ వినోదం పంచుతూ, నాలుగు చేతులా సంపాదిస్తూంటే హాయిగా సాగిపోతోంది అంజిబాబు జీవితం.

లేచింది మొదలు రోజంతా దెప్పకోవడాలతో సాగిపోయే ఆ అత్తకోడళ్లకు ఇప్పుడు కష్టాలు చెప్పకోవడానికి  కూడా సమయం దొరకడం లేదు. 

రోజకు మూడు సీరియల్స్ లో నటిస్తూ, ముప్పై సీరియల్స్ ఆరువేల ఎపిసోడ్స్ లా సాగిపోతోంది ఆ అత్తాకోడళ్ల దినచర్య.

సీరియల్ చూస్తూ, జీడిపప్పు, ఆలోచనలు రెండూ కూడా  నెమరేసుకుంటున్న అంజిబాబుకు సడెన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి, ఒక్క ఉదుటున లేచాడు, ఈ అ.కో. సమస్య నివారణకు భలే మందు పంపించిన,  తన స్నేహితుడు మరియు టీవీ సీరియల్స్ సంభాషణల రచయిత అయిన బుకారాకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పడానికి.

ఎందుకంటే...

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున, బుకారా ఫోన్ చేయగానే, అత్తాకోడళ్ల మాటలు, చేష్టలు మద్య ఎలా నలిగి పోతున్నాడో అంజిబాబు చెప్పగానే, అంతా ఆనందంతో విని, నాలుగు రోజులు తిరక్కుండానే , ఆ యుద్ధకాండ ప్రత్యక్ష ప్రసారం చూడడానికి, అత్తాకోడళ్ళ మీద ఓ సీరియల్ తీసే ఆలోచనలో ఉన్న  తనకు తెలిసిన ఓ టీవీ సీరియల్ నిర్మాత, దర్శకుడిని వీళ్ల ఇంటికి పంపి, వీరి జీవితంలో వెలుగులు నింపేలా చేసింది,  అతడే కదా మరి !!

   *****     ***  **శుభం**     ******

(నేను రాసిన ఈ హాస్య కథ గోతెలుగు అనే అంతర్జాల పత్రికలో నవంబర్ 2020లో ప్రచురితమైనది)

No comments:

Post a Comment