Friday, June 28, 2024

 *గరుడపురాణం లోని*

_*బృహస్పతి ప్రోక్త నీతిసారం*_ 🙏🌺

నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని, ఇలా బోధించసాగాడు సూతమహర్షి.

"శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధి నేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసు కోవలసిన విషయము.

పురుషార్థ చతుష్టయాన్ని, అనగా ధర్మార్థ కామమోక్షాలను సిద్ధించుకోదలచుకున్న వాడు సజ్జనులతోనే చెలిమిచేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు.

_*సద్భిఃసంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః | నాసద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం ॥*_

క్షుద్రునితో సంభాషణా, దుష్టుని దర్శనమూ, శత్రు సేవకునిపై ప్రేమా, మిత్రునితో విరోధమూ, మూర్ఖునికుపదేశమూ, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణమూ ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వమూ, శత్రువుతో మిత్రత్వమూ నెఱపవలసి వచ్చినపుడు అది శాశ్వతం కాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి.

కాలం బహుశక్తివంతం. దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది, ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలనూ నిర్ణయిస్తుంది.

ఋషులారా! బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడ అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు:

స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్ళను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులనూ రాజర్షులనూ పూజించాలి.

_*ఉత్తమైః సహసాంగత్యం పండితైః సహ సత్కథాం అలుభైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి ॥*_


ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం - వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు.

ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుండుట - ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే; మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి.

ఎవరు మనను పోషిస్తారోవారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా! ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా!


_*పరో పి హితవాన్ బంధుర్బంధు రప్యహితః పరః |*_
_*అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్య మౌషధం ॥*_ 
_*సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః ।*_
_*తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే ॥*_


చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా!

చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు, మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రినీ తల్లినీ, వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు, గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్ళు బతకడం భూమికి బరువు.

_*సాభార్యా యా గృహేదక్షా సాభార్యా యా ప్రియం వదా |*_
_*సాభార్యా యా పతి ప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥*_

ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రదకార్యాలు చేయునది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకొనేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు.

అలాకాకుండా ఎగుడుదిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని వున్నా, అన్నీ వున్నా దరిద్రుడే. ఇలాంటి వాడు పెళ్ళయిన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు.

దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతుభృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క వానికి సుఖం వుండదు. శాంతీ వుండదు.

దుష్టసాంగత్యాన్నొదిలేసి, మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్ళు వీలైనంతవఱకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్నీ మనయొక్క అనిత్యత్వాన్నీ తలుస్తూనే జీవించాలి.

వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడూ బలహీనుడూ మహాశక్తిశాలిగా రూపొందవచ్చు, పచ్చికృతఘ్నుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడై పోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు, అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు.

సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని, దాన్ని తనకూ, స్త్రీలకూ, పిల్లలకూ ఆపదవచ్చినపుడు వాడుకోవడానికి చాలినంతవఱకే దాచుకోవాలి.

వర్ణం కోసమొక వ్యక్తినీ, గ్రామం రక్షించబడవలసి వస్తే తప్పనిసరైతే ఒక కుటుంబాన్నీ, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్నీ త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం, దేనినైనా పరిత్యజించవచ్చును.

_*త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ । గ్రామం జనపదస్యార్థే ఆత్మార్ధే పృథివీం త్యజేత్ ॥*_


దుష్టచరిత్రుని ఇంటిలో నుండడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది.

బుద్ధిమంతుడెపుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదలిపోవునపుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకొన్నాకనే కదలాలి.

దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్నీ, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమినీ, మాయావి యైన మిత్రునీ ఏ మాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి.

పీనాసివాడి చేతిలో పడిన ధనమూ, అత్యంత దుష్టుడూ, కోపిష్టి వద్ద నున్న జ్ఞానమూ, గుణంగానీ శౌర్యంగానీ లేనివానికి గల సౌందర్యమూ, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడూ ఎందుకూ పనికిరారు.

అధికారంలో వున్నవాడికైతే సాయపడడానికి అపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులయి పోతారు. అదే వ్యక్తి పదవీచుత్యుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. 

నిజమైన మిత్రుడెవరో ఆపదవచ్చినపుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వమూ, ఏకాంతంలో శుచితా, వైభవం క్షీణించినపుడు పత్నీ, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బైట పడతాయి.

_*వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః శుష్కం సరః సారసా నిర్ద్రవ్యం పురుషంత్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః | పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః*_
_*దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవశా జ్జనోహిరమతే కస్యాస్తి కో వల్లభః ||*_


ఎవరికి యెవరు? చివరికి యెవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు.

_*లుబ్ధమర్థ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణా । మూర్ఖం ఛందాను వృత్త్యా చ యాథాత థ్యేన పండితం ॥*_

_*సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః | ఇతరేఖాద్యపానేన మానదానేన పండితాః ॥*_


లోభికి ఏదోరూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులనూ, పొగడ్తలతో మూర్ఖులనూ, తాత్త్వికచర్చ ద్వారా విద్వాంసులనూ, మంచి మనసు చేత ఉన్నతాలోచనల చేత దేవతలనూ సజ్జనులనూ ద్విజులనూ మంచి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులనూ, మాన సమ్మానాలతో పండితులనూ ఆకట్టుకోగలము.

నదిని నమ్ముకొని ఒక చోట వుండిపోవాలనుకోవడం తెలివైన పనికాదు. 
అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పదు. అలాగే గోళ్ళతో కొమ్ములతో వుండే జంతువులనూ ఆయుధాన్ని ధరించి తిరిగేవారినీ, రాజ పరివారాన్నీ విశ్వసించి ఉండిపోకూడదు.

_*నదీనాంచనఖీ నాంచ శృంగిణాం శస్త్రపాణి నాం l*_
_*విశ్వాసోనైవ కర్తవ్యః స్త్రీ షు రాజకులేషు చ --*_
_*అర్థనాశం మనస్తాపం గృహేదుశ్చరితానిచ । వంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్ ॥*_

No comments:

Post a Comment