*గచ్ఛకాయ రంగులో ఉండేదది , కారం లేకుండా వండిన గుండెకాయ ముక్కలా ఉండేదది. నలుచదరాకారపు చిన్న ఇనుపముక్క అది. దానిని అయస్కాంతం అనేవాళ్ళం. ఆయస్కాంతానికి పిన్నీసులు, నట్లు, మేకులు, రాళ్ళు , మన్ను ఇంకా నావంటి పిల్లలం వచ్చి అతుక్కునే వాళ్ళం . అప్పట్లో ఆయస్కాంతాలు అందరి దగ్గర ఉండేవి కావు. కొందరి దగ్గరే ఉండేవి. ఆ కొందరికి మాత్రమే ఆయస్కాంతాలు ఎలా, ఎక్కడనుండి దొరికేవో నాకు ఇప్పటికీ తెలియదు. కాగితం కింది అయస్కాంతం కాగితం పైని పిన్నీసునో, గుండుసూదినో ఆటలాడిస్తూ ఉంటే ఆ ఇంద్రజాలానికి అందరం కట్టుబడిపోయేవాళ్ళం. ఒక పిల్లి పిల్లకు చిన్న కాగితం ఉండ ఇస్తే అది దానితో ఆటలాడానికి జీవితమంతా గడిపినట్లు. ఆ కాలపు పిల్లవాడికి ఒక ఆయస్కాంతపు ముక్క ఇస్తే వాడు దానికి తన బాల్యమంతా తాకట్టు పడేవాడు. పిల్లలు పిల్లి పిల్లల్లా బ్రతికిన రోజులవి.*
*సంవత్సరానంతర పరీక్షల సెలవులు ముగిసి బడులు తెరుచుకున్నప్పుడు, కొత్త పుస్తకాలకు అట్టల బట్టలు వేసేప్పుడు తరగతి గది మందల్లో ఎవడో ఒకడు మాత్రమే తన నిక్కర్ జేబులో పెట్టుకుని స్టేపులర్ తెచ్చేవాడు అపుడు పిన్నుల మిషిను దాని పేరు. పిల్లలం కళ్ళు ఇంత చేసుకుని దాని చుట్టూ మూగే వాళ్ళం. వాడు దానిని ముట్టనిచ్చేవాడే కాదు. ఎప్పుడైనా మహాదయ తలిచి పిన్నుల వరుసలోని ఒకటీ రెండు పిన్నులు మాత్రం ఊడపెరికి దానం చేసేవాడు. వాటిని అపురూపంగా జామెట్రీ బాక్సులో దాచుకున్న అమాయకపు కాలం చలికాలపు రోజుల్లో లేతగులాబీ రంగు ఎండ అంతా వెచ్చని మా ఆస్తి లా ఉండేది. ఆ పిన్నుల డబ్బాలోని పిన్నుల వరుసని ఫెవికాల్తో అంటించి ( మంచి తెలుగులో అయితే కరిపించి అనాలి ) ఒక ఇల్లు కట్టుకోవాలని నాకు అప్పట్లో కోరిగ్గా ఉండేది.*
*కాగితానికి పెట్టుకునే పేపర్ క్లిప్ హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో ఒకసారి దొరికింది నాకు. అంతకు మునుపు ఎప్పుడూ అటువంటి వస్తువుని నేను చూసి ఎరుగను. సంవత్సరాల తరబడి దానిని దాచుకున్న రికార్డ్ నాకున్నది. ఇప్పటికీ ఆ చాపల్యం పోలేదు, పేపర్ క్లిప్పులు, బైండర్ క్లిప్పులు, రంగు రంగుల దారపు ఉండలతో చిన్న పెట్టె నింపుకుని దాచుకున్నాను నేను. లేదా అవే నన్ను దాచుకున్నాయేమో . అపుడపుడు అలీ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ దారి గూండా నడుస్తుంటే రంగురంగుల క్లిప్పులు, స్టిక్కర్ లు నన్ను బహు దురాశకుడిగా తమ వైపే తిప్పుకుంటాయి.*
*పెళ్ళి పందిళ్ళకు, చావు షామియానాలకు రాట్లు పాతడానికి గుంతలు తీస్తారు కదా, ఆ గుంతల చుట్టూ ఎండ్రకాయల్లా మూగేవాళ్ళం మేము . ఏమో తీస్తున్న ఆ గుంటలో నుండి ఏ వజ్రవైఢూర్యాలు బయల్పడతాయో! ఏ లంకెబిందెలు వెలికి వస్తాయో, కనీసం జినీని స్థాపితం చేసిన సీసా బుడ్డి అయినా దొరక్కపోదా, అది కాకుంటే మకిలి పట్టిన మేజిక్ లాంతరు దొరికినా పరవాలేదు. అసలు పాతాళ భైరవి బొమ్మ దొరికితే అంతకన్నా పండగ ఉందా? అదేమీ దొరికేవీ కావు అయినా నిరాశ పడేవాళ్ళం కాదు పెళ్ళిళ్ళూ , శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి, గుంటలు తవ్వుతూనే ఉంటారు. ఆశ అనేది రాలిపోయిన ఆకు కాదు మళ్ళీ మళ్ళీ మొలకెత్తే కొత్తాకు. ఆలోపు కార్యక్రమం డెకరేషన్ కోసం తోరణాలుగా వేలాడదీసిన వరుస లోనుండి బుల్లి బల్బులు వకటో నాలుగో ఊడిపడి ఉన్నవి దొరికేవీ. చిట్టి పొట్టి అరచేతుల మెత్తని తిన్నెల పై సూర్యభగవానుడు బల్బులా వెలిగేవాడు. అప్పుడొకసారి నిజం సూర్యుడి ని ఒడిసి పట్టే పరికరం మాకు దొరికింది, భూతద్దమది. ఎండ దేవుడిని ఆ అద్దం తలుపు గూండా ఆహ్వానించి కన్నాలు పెట్టే కాగితాలకు మా నోటు పుస్తకాలలో కొదవే ఉండేది కాదు. మగబలిమి పులుముకున్న కొంతమంది వీరులు శూరులు ఆ భూతద్దాలతో తమ తొడలు కాల్చుకుని ఆ బొబ్బ చూపించి గర్వపడేవారు. వారంతా అచ్చమైన ఒక్క మగాడులు అని బడికి బడి పిల్లలంతా ఒప్పుకునేవారు.*
*మా జేజి భలే మంచిది. ఒకసారి ఆవిడకు లక్ష్మీ దేవి కలలోకి వచ్చి మా ఇంట్లో ఒకానొక చోట ఆగి ఘల్లు ఘల్లు మని గజ్జల చప్పుడు చేస్తూ అక్కడిక్కడే దిగబడిపోయిందట. మరుసటి రోజు మా చిన్నాయనలు ఇంట్లో లేని సమయం చూసి మా పిన్నమ్మలు, మా అన్న మా ఇల్లు మొత్తం తవ్విపోశారు. దుడ్డు కాదు కదా, ఒక్క నత్త గుల్ల కూడా దొరకలేదు మాకు. మా ఊరి బయట చెరువు ఉండేది. అది సముద్రం కన్నా పెద్దది అని నాకు ఒక అనుమానపు నమ్మకం. ఎండాకాలంలో అది ఎండిపోయేది. అప్పుడు నేనూ నా ఫ్రెండ్స్ ఆ ఇసుకలో దిగి దాని దిగంతాల అంచులవరకు నడిచి గవ్వలు, శంఖాలు కుప్పలకొద్ది ఏరే వాళ్ళం. ఏరినవన్నీ ఏం చేసేవాళ్ళం అని ఆడగవద్దు. చేసే ప్రతి పనికి ఒక అర్థం పరమార్థం ఉండాలని. కాలం ఈజ్ మనీ అని ఏ బుర్ర ఉన్న పెద్ద మనిషి వచ్చి బాల్యాన్ని పాడు చేసిన కాలం కాదది. కాలం విలువ తెలియకపోయినా క్యాలెండర్ల మీద మోజు ఉన్న రోజులవి. ఎంత మంచి క్యాలెండర్లు వచ్చేవి ఆ రోజుల్లో! ఎంత చక్కని బొమ్మల కళ కళకళలాడుతూ గోడల మీద మేకు పుల్లకు ఊగిసలాడుతూ ఉండేవి. మేకు అంటే మా ఊర్లో, బ్రిడ్జి కింద చెప్పులు కుట్టే ఆయన ఒకరు ఉండేవారు. ఆయన దగ్గర ఒక రకం మేకులు ఉండేవి. బ్లాక్ బ్లూ అని ఒక రంగు ఉంటుంది. ఆ రంగులో ధగధగా మెరిసి పోతూ ఉండేది ఆ మేకు. ఆయనకు ఒక పావలా ఇచ్చి ఒక మేకు కొన్నాను నేను ఒకప్పుడు. ఆ మధ్య బాగా డబ్బు చేసిన ఒకాయన యూ ట్యూబు లో మాట్లాడుతూ మీకు అది కేవలం రూపాయి కావచ్చు. మాకు మాత్రం రూపాయ అంటే నూరు పైసలు అని గర్వంగా చెప్పుకున్నాడు. ఏమో నాకు మాత్రం పావలా అంటే మా చెప్పులాయన దగ్గర కొన్న ఒక మేకు, అర్థరూపాయ అంటే గంట సేపు చిన్న సైకీలు బాడుగ. రూపాయన్నర ఉంటే మసాలా దోస, మూడు వేల రూపాయలతో కోడవటిగంటి కుటుంబరావు సమగ్రసాహిత్యం, ఇరవై ఒక్క వేలు ఉంటే క్యూర్ టెక్ జిగ్ పెన్నుల డబ్బా. మనిషి అంటే ఇంత మనసు, ఇంత ప్రేమ, ఇంత నవ్వు, ఇంత దుఖం, ఇంత కరుణ, ఇంత జ్ఞాపకం.. అనిపిస్తాది తప్పా యూ ట్యూబ్ ఆయన మాదిరి తక్కెడలో తూచి మనిషి అంటే ఇన్నిన్ని కేజీల మాంసం అని ఒప్పుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటుంది.*
No comments:
Post a Comment