తంతుః పటే స్థితో యద్వదుపాదానతయా తథా ౹
సర్వోపాదానరూపత్వా త్సర్వత్రాయమవస్థితః ౹౹165౹౹
165. నూలు పోగులు వస్త్రమునందు వ్యాపించి ఉండి వస్త్రమునకు ఉపాదాన కారణమైనట్లే,యావద్విశ్వమున వ్యాపించియున్న అంతర్యామి దానికి ఉపాదానకారణమగుచున్నాడు.
పటాదప్యాన్తరస్తన్తుస్తన్తోరప్యంశురాన్తరః ౹
అన్తరత్వస్య విశ్రాన్తిర్యత్రాసావనుమీయతామ్
౹౹166౹౹
166. వస్త్రము కంటె నూలుపోగులు సూక్ష్మములు. పోగులకంటె వానిలోని దారములు సూక్ష్మములు.ఇట్టి సూక్ష్మము కంటె సూక్ష్మవస్తువు లెచ్చట అవసానించునో అచ్చట ఈశ్వరుడు గలడని అనుమానము వలన తెలిసికో !
వ్యాఖ్య:- ఆంతరతముడగుటచే ఈశ్వరుడు నేరుగా అన్ని భూములందును తెలియబడడు. అనుమానము చేతనే తెలిసి కొనగలము.
ఉపాదాన నిమిత్తకారణములనగా ఏది కార్య స్వరూపమునందు ప్రవేశించునో ఏది లేక కార్యము సిద్ధించదో అది ఉపాదాన కారణము.
ఉదాహరణమునకు మృత్తిక(మట్టి) ఘటమునకు(కుండకు)
ఉపాదాన కారణము,ఎట్లనగా మృత్తిక ఘట స్వరూపమునందు ప్రవేశించుచున్నది.మృత్తిక లేక ఘటము కలుగుట లేదు.ఇచట ఘటమునకు మృత్తిక ఉపాదాన కారణమై యుండు నట్లు ఈశ్వరుడు తన ఉపాధియైన జడమాయ చేత జగత్తునకు ఉపాదాన కారణమై యున్నాడు.
అట్లే ఏది స్వరూపమునందు ప్రవేశించుటలేదో,అయినను కార్యమునకు భిన్నముగ నుండి కార్యముచేయుచున్నదో అది నిమిత్తకారణము.
ఎట్లనగా ఘట స్వరూపమునందు కుమ్మరి ప్రవేశించుట లేదు. అయినను కుమ్మరి చే ఆఘటము చేయబడు చున్నది. కావున యిచ్చట "కుమ్మరి"నిమిత్తకారమై యున్నాడు.
అట్లే ఈశ్వరుడు తన చేతన భాగము చేత జగత్తునకు నిమిత్త కారణమై యున్నాడు.
కనుక ఈశ్వరుడు జగత్తునకు అభిన్న(భిన్నముకాని),
నిమిత్త,ఉపాదానములనబడు రెండు కారణములును తానేయై యున్నాడు.
మట్టిని కుండగా భావించినట్లే, దారాలను వస్త్రముగా పొరపడినట్లే అజ్ఞానులు శరీరాన్ని ఆత్మగా భావిస్తుంటారు.
కుండమీద దాని లక్షణాలమీదను మనం దృష్టిని కేంద్రీకరించడం వలన,కుండ తయారు కావడానికి కారణమైన మట్టిని విస్మరిస్తున్నాము.
అదే విధముగా ఒక వస్త్రాన్ని మనం చూసేటప్పుడు దానికంతటికీ ఆధారంగా ఉండే దారాలను గుర్తించ లేకపోతాము.
వస్త్రానికి దారంకంటే వేరుగా ఉనికే లేదని,బట్టనుండి దారాలను తొలగిస్తే వస్త్రమే వుండదనీ గ్రహించాలి.ఆ సూక్ష్మతత్త్వన్ని సూక్ష్మముగా గ్రహించాలి.
మనం శరీరాన్ని చూస్తున్నప్పటికీ, నిజానికి మనం చూస్తున్నది చైతన్యాన్ని మాత్రమే.
No comments:
Post a Comment