Sunday, December 22, 2024

 *_శారీ డే..సారీ లే..!_*

చీరకట్టులో ఎన్నెన్ని
గమ్మతులున్నవో..
చిగురాకు పెదవుల్లో
ఎన్ని మత్తులున్నవో..

తెల్ల చీర 
కట్టుకున్నదెవరి కోసమో..
మల్లెపూలు 
పెట్టుకున్నదెవరి కోసమో..

తెల్ల చీర..మల్లె పూలు
పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ..
ఏదో కబురు పట్టుకొచ్చింది
కృష్ణమ్మ..
ఆ కబురేమిటమ్మ..
ఈ ఉరుకెందుకమ్మా..

చెంగావి రంగు చీర 
కట్టుకున్న చిన్నది..
దాని దిమ్మదియ్య
అందమంతా 
చీరలోనే ఉన్నది..!

ఇప్పుడెక్కడికి పోయింది
ఆ అందం..
చీరే అరుదైపోయిన సంస్కృతి..
ఆధునిక కాలం..
ఫేషన్ జాలం..
చీర..మూర..
అలవిమీర..
కోకలిప్పుడు 
కర్టెన్ల పాలు..!

పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా 
నీ పైట కొంగు జారిందే 
గడుసుపిల్లా..
కొంగు జారితేముంది 
కొంటె పిల్లోడా..
నీ గుండె చిక్కుకుందేమో 
చూడు బుల్లోడా..
నిజంగా వాణిశ్రీ చీర కడితే
అపూర్వమే..
ఇప్పుడు చీరకట్టుడు
అయింది పూర్వమే..

లంగా ఓణీ నేటితో 
రద్దైపోనీ..
ఓణీ పోయి చున్నీ వచ్చె..
ఆ చున్నీ కూడా 
రద్దైపోయిన 
కలికాలం..
అసలే చలికాలం..!

సరే..ఎవరి 
అభిరుచి వారిది..
ఒక్కో వస్త్రధారణలో 
ఒక్కో సొగసు..
కాని చీరకట్టునే 
చూడాలంటుంది మనసు..!

చుట్టూ చెంగావి చీర
కట్టావే చిలకమ్మా..
బొట్టూ కాటుక పెట్టి
నే కట్టే పాటను చుట్టి..

ఎన్ని పాటలు రాసారు 
సినీ కవులు..
ఎన్నెన్ని కవితలు అల్లారు
భావకవులు..
చీరకట్టు..
దాని కనికట్టుపై..!

ఒక్కో ప్రాంతంలో
ఒక్కో కట్టు..
దానికి ఒక్కో పేరు..
చీర..కోక..
గుండారు..కచ్చ..
కుడి పైట..ఎడం పైట..
అంతా అచ్చమైన 
అందానికి బాట..!

అమ్మాయిలూ..అక్కలూ..
చెల్లెళ్ళూ..ఆంటీలు..
ఇప్పటి లెక్క ప్రకారం
బామ్మలూ..నైటీ బ్యూటీలూ..
ఎవరి అందం వారిది..
ఎవరి సౌకర్యం వారిది..
మారే ఫేషన్ ..
దాన్ని అనుసరించి 
మీ పేషన్..
మీ ఇష్టం..
అయితే అప్పుడప్పుడు
కట్టండి చీర..
మన సంప్రదాయానికి
వెయ్యొద్దు తెర..

చీరలోని గొప్పదనం తెలుసుకో..
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో..
సింగరమనే దారంతో 
చేసింది చీర..
ఆనందమనే రంగులనే
అద్దింది చీర..
మమకారమనే మగ్గంపై
నేసింది చీర..
చీరలోని గొప్పదనం తెలుసుకో..
ఆ చీర కొని
ఇంట్లో బీరువాలో దాచకు..!

నీ చీర..
చూపు ఓర..
అందాల ధార..
కోపం చురచుర..

అమ్మ చీర..
కన్నీరు తుడిచే
కరుణా ధార...
ఆలి కొంగు
మగాడు పట్టుకు తిరిగే 
బంగారం..
చీరే ఆడదానికి 
అసలైన సింగారం..!

              *_సురేష్.._*

No comments:

Post a Comment