Tuesday, December 24, 2024

 *దేవాలయలు.....*

*మనదేశంలో ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయమైన ఉంటుంది. దేవాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.*

*ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది... అలా ప్రతి గ్రామంలోనూ దేవాలయాన్ని నిర్మించు కోవలసిన అవసరమేమిటి... ఒక వేళ దేవాలయంలేని గ్రామమున్నట్లయితే ఏమవుతుంది...*

*ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. ప్రతియొక్కరికీ మానసిక ప్రశాంతత స్థిరచిత్తంతో జీవించాలని ఉంటుంది. దేవుని కటాక్షం లేకుండా అటువంటి జీవితం లభ్యమవటం అసాధ్యం. దేవుని కటాక్షం లభించాలంటే దేవాలయాలు అవసరం.*

*సనాతన ధర్మంలో వాస్తవానికి దేవుడు లేని చోటు లేదు. భగవంతుడు సర్వాంతర్యామి. మరి దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే దేవాలయాలెందుకు... ఒక దేవాలయంలో దేవుని బందించి, ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా...*

*ఇటువంటి సందేహాలను లేవనెత్తే వారు పూర్తిగా ఏమి తెలియను వారు కాదు. అయితే వాళ్లు సత్యాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోలేదు. అందువలనే ఇటువంటి సందేహాలు తలెత్తుతుంటాయి. పరమాత్మా సర్వాంతర్యామి అనటంలో ఇటువంటి సందేహం లేదు. అయితే తగు అవగాహన, సంస్కారం లేని కారణంగా సామాన్యులు పరమాత్మ సర్వాంతర్యామి అనే విషయాన్ని హృద్గతం చేసుకోలేక పోతున్నారు.*

*అయితే అటువంటి అవగాహన సంస్కారం ప్రహ్లాదుని వంటి మహాపురుషులకే ఉంటుంది. మహాభక్తుడైన ప్రహ్లాదునికి ప్రతిచోటా దైవదర్శనం భాగ్యం లభించేదని శ్రీమద్భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే సామాన్యులు ప్రహ్లాదునికున్న సంస్కారాన్ని, అధికారాన్ని కలిగి ఉండరుకదా.*

*అయుతే దైవ భక్తిని పెంపొందించుకోవడానికి సామాన్యులు ఏమిచేయాలి... మన పూర్వీకులు మనకి చాల మార్గాలను సూచించారు. శాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం ప్రాణప్రతిష్ట చేయబడిన దేవత విగ్రహాలను పూజిస్తే తప్పకుండా దైవకటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. పామరులు కూడా సులభమైన ఈ మార్గాన్ని అవలంబించి దైవ కటాక్షాన్ని పొందవచ్చు.*

*ఒక దేవాలయంలో దేవుని బందించి ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా అనే సందేహం అడగవచ్చు. దీనికి శ్రీ శంకరాభగవత్పాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు...*

*"యధా సకల భూమండలాధిపతి రపి అయోధ్యాపతిః ఇతి వ్యవహ్రియతే"*

*భూమండలాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యాధిపతిగా అభివర్ణిస్తున్నాము. అంతమాత్రాన ఆయన అధికారం తగ్గిపోతుందా... ఆయన అయోధ్యాపతి మాత్రమే కాదు, లోకాధిపతి కూడాను.*

*అలాగే పరమాత్మా ఇతరచోట్ల ఉన్నట్లే దేవాలయంలో కూడా ఉంటాడు. అయితే దేవుడిని అన్వేషించే వారి సౌలభ్యం కోసం ఒక స్థానాన్ని చూపించాలని దేవాలయాన్ని దైవస్థానంగా చూపిస్తాం. దేవాలయంలో దేవుని ఆరాధన ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందవచ్చు.*

*ప్రహ్లాదుని వంటి శ్రద్ధా భక్తులు అధికారికత మీకు కనక ఉన్నట్లయితే, అటువంటి సంస్కారాలను మీరు కూడా పొందగలిగినట్లైతే భగవంతుడిని అన్నిచోట్లా మీరు కూడా దర్శించవచ్చు. అప్పుడు మీరు దేవాలయానికే వెళ్లి దేవుడిని పూజించాల్సిన పనిలేదు, ప్రతిచోటు మీకు దేవాలయమే అవుతుంది. అయితే ప్రహ్లాదుని స్థాయి మనం చేరుకునే దాకా దేవాలయానికి వెళ్లి పూజించక తప్పదు. అందువలన దేవాలయాలు అవసరమవుతున్నాయి.*

*మరి మన విన్నపాలను భగవంతుడు పట్టించుకుంటాడా అనే అనుమానానికి ఆస్కారం లేదు. భగవంతుడు అనంతమైన కరుణామూర్తి. శృతి ఇలా వివరించింది...*

*"అపాణిపాదో జవనో గ్రహీతా*
*వశ్యత్య చక్షు: స శృణోత్య కర్ణ: |*
*సవేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా*
*తమాహురగ్య్రo పురుషం మహన్తం ||"*

*భగవంతుడు మనవంటివాడు కాదు, మనకు చేతులున్నాయి కాబట్టి వస్తువులను పట్టుకుని పైకెత్త గలుగుతున్నాము. కాళ్ళున్నాయి కాబట్టి నడవగలం. చేతులు లేకపోయినా భగవంతుడు పైకెత్తగలడు నడవగలడు. మనం భక్తితో ఏది సమర్పించినా... ఫలం, పుష్పం, పత్రం, తోయం... భగవంతుడు స్వీకరిస్తాడు.*

*మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వచ్చాము... గ్రామాలలో దేవాలయం లేకపోతే ఏమవుతుంది... అంటే మనం ఎవరి ముందు మన కష్టాలను చెప్పుకుంటాము... అయితే సామాన్యులు భగవంతుడిని ఎక్కడ దర్శించగలరు... దేవాలయాలలో మాత్రమే దర్శించగలరు.*

*ఈ అవసరాలను తీర్చటానికి మన పూర్వీకులు ప్రతి గ్రామంలో కనీసం ఒక్క దేవాలయాన్నైనా నిర్మింపచేశారు. సనాతన ధర్మం సుస్థిరంగా చైతన్యవంతంగా ఉండటంలో దేవాలయాలు ప్రముఖమైన పాత్రలు నిర్వహిస్తాయి. దేవాలయాలు లేకపోతే సనాతన ధర్మం దయనీయస్థితిలో ఉండేది. సనాతన ధర్మ సంరక్షణకు దేవాలయాలే ఆశాజ్యోతులు. అందువలన దేవాలయాలు అత్యంతావశ్యకం...*

          *ఆధ్యాత్మికం ఆనందం*

🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

No comments:

Post a Comment