Sunday, December 22, 2024

*ఎవరీ “భగవంతుడు*“

*భగవంతుడు వున్నాడా, లేడా,ఎట్లా తెలుసుకొనేది,
వున్నాడనుకుంటే “ఆలోచించండి*”,
లేడనుకుంటే "ఆలోచించకండి"
రెండూ ఉత్తమ మార్గాలే!!*

భగవంతుడు వున్నాడా లేడా, వుంటే, ఎవరీ భగవంతుడు, ఎట్లా వుంటాడు, ఎక్కడవుంటాడు, ఎందుకుంటాడు, ఏమిచేస్తుంటాడు, ఎందుకు కనబడడు, ఎవరెవరికి కనబడుతాడు, ఇటువంటివి, అందరిలో పుట్టెడు ప్రశ్నలు. ఎందుకు మనకు ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు, రూపాలు వేరేకాని, దేవుడు ఒక్కడే అని అంటారు, నిజమా..

అసలు భగవంతుడనేవాడు వున్నాడని మనిషికి చెప్పిందెవరు, ఏమో! భగవంతుడికే తెలియాలి అంటారా, కాదు. మన ఋషులే మనకు తెలియచేశారు. భగవంతుడిని గురించి చెప్పే గ్రంధమే “భాగవతం”. వేదాలను, ఉపనిషత్తులను, అష్టాదశపురాణాలు మొదలైన వాటన్నిటిని రచించి, మనుషులకు తెలియచెప్పింది “వేదవ్యాసుడే” అని అందరకు తెలిసిన విషయమే. రచయత ఒక్కడే కాబట్టి, మన పురాణాలలో చెప్పబడిన కధలన్నిటికి, ఒకదానికొకటి సంబంధంగలిగి వుంటాయి. అందుకే ఎవరైనా తర్కించటం మొదలు పెట్టితే...
ఉదా:- రావణాసురుడు, గొప్ప శివభక్తుడు కదా మరి ఆయన సీతాదేవిని చెరపట్టి, చెడ్డవాడెలా అయాడు అని ప్రశ్నిస్తే, అది ఆయన పూర్వజన్మసుకృతం, అంటే, క్రితం జన్మలో జయ,విజయలుగా విష్ణులోకంలొ వుంటూ, సనకసనానందులనే మునులు చేత శాపం పొందారు, అందువలన వారిలొ ఒకరు రావణాసుర రూపంలో కర్మ ఫలం అనుభవించాడు అని సమధానం వస్తుంది. ఇట్లా చెప్పటంలో పరమార్ధం,తప్పులు చేయద్దు–శిక్షను అనుభవించవద్దు అని తెలుపడమే.

సరే, ఒక్కసారి మొదటి పేరాలోని ప్రశ్నలవద్దకు వద్దాం. వాటికి పెద్దలు చెప్పిన సమాధానాలను కూడా చూద్దాం.

ఎవరీ భగవంతుడు?
– సమస్త చరాచర జీవులను సృష్టించేవాడు.

ఎట్లా వుంటాడు?
౼ నిరాకారుడుగాను, ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగాను వుంటాడు.

ఎక్కడవుంటాడు?
౼ సర్వవ్యాప్తి.

ఎందుకుంటాడు?
౼ జీవుల సంరక్షణార్ధం.

ఏమి చేస్తుంటాడు?
౼ సృష్టి, స్థితి, లయలను నిర్వహిస్తుంటాడు.

ఎందుకు కనబడడు?
౼ చూడాలన్న దృష్టితో వున్న వారందరికి కనబడతాడు( కళ్ళు మూసుకొని, ఎదురుగలేడని అనకూడదు కదా)

ఎవరికి కనబడతాడు?
౼ చూడాలన్న తపన, స్పృహ వున్నవారందరికీ.

ఎందుకు మనకు ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు?
౼ ఒక్కొక్క ప్రత్యేకమైన పనికి ఒక్కొక్క రూపం.

రూపాలు వేరేకాని, దేవుడు ఒక్కడే అంటారు నిజమా?
౼ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు వేరువేరు కానీ, అన్నిటిని కలిపి “శరీరం” అని ఒక్కటిగానే చెప్తాముకదా!!

ఇప్పుడు రెండవ విషయానికి వద్దాం. భగవంతుడుని గురించి మనిషికి చెప్పింది ఋషులని అనుకున్నాం. వీరిని గురించి తెలుసుకుందాం. ఋషులు గొప్ప ఆలోచనాపరులు తాత్వికవేత్తలు శాస్త్రపరిశోధకులు వ్యూహకర్తలు. ఒకరిగా, సమూహంగా వారు తపస్సు చేసి, విశ్వము యొక్క మూలాలును తెలుసుకొనే ప్రయత్నం చేశారు. తాము కనుగొన్న విషయాలను కొన్ని యేళ్ళపాటు శోధనచేసి, ఋజువు చేసుకొని, వాటిని శాస్త్రబద్ధత కావించారు. మానవుడు ప్రశ్నించదగ్గ ప్రతి విషయాన్ని తెలుసుకోవటానికి గొప్ప ప్రయత్నం చేశారు. వాటి ఫలితమే, వేదాలు, మొదలైనవి. అయితే, ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే కొన్ని,కొన్ని ధర్మాలు, దేశ,కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి అని.

ఉదా:- సూర్యుడు తూర్పుకు ఉదయిస్తాడు. ఇది ఒక ధర్మంగా చెప్పబడింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ ధర్మం ఋజువుకాబడింది. అయితే, తూర్పు దేశాల్లో సూర్యోదయం సమయానికి పశ్చమదేశాల్లో సూర్యోదయం కాదు. ఇది దేశ, కాల,మాన పరిస్థితులకు లోబడి జరుగుతున్నది.

మరి మన ఋషులు కనుగొన్న ఈ “భగవంతుడు” ఎవరు, వారు భగవంతుడిని చూశారా, అంటే “అమరకోశం”లో ’భగవాన్” (తెలుగులో భగవంతుడు) కి అర్ధం చెప్పబడింది. ” భగ” అంటే ఐశ్వర్యమునకును, ఇచ్చకును, సమస్తము తెలిసియుండుట, దొడ్డ తనమునకు, శక్తికి, ప్రయత్నమునకు, కీర్తికి, జ్ఞానమునకు మారుపేరు. ఇట్టి వాటినన్నింటిని ఇవ్వగలవాడు భగవంతుడు. భగవంతునికి మరొక పేరు, ” విష్ణుః “. అంటే “విశ్వమునంతయూ వ్యాపించియుండువాడు” అని అర్ధం.

మరి, భగవంతుడు విశ్వమంతటను వ్యాపించివుండినట్లైతే, మానవులు, మిగిలిన జీవులు ఎక్కడ వున్నట్లు అంటే, భగవంతుడిలోనే మనం వున్నట్లు అర్ధం. అప్పుడు, మనం, భగవంతుడుకంటే వేరుగా లేము అని అర్ధమవుతుంది. అంటే, జీవులందరూ భగవత్స్వరూపులే. అట్లైతే పైన చెప్పినట్లుగా భగవంతునికి గల విశిష్టమైన లక్షణాలన్ని మనకు (ముఖ్యంగా మానవులను ఉదాహరణగా తీసుకుని) ఉన్నాయా, ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే మానవుల్లో అనేక బేధభావములు ఉండకూడదుకదా అటువంటప్పుడు మనమందరము భగవత్స్వరూపములే అన్న సిద్ధాంతం తప్పుఅవుతుంది కదా అనే మీమాంస మొదలవుతుంది, మరి ఋషులు ఎవరిని భగవంతుడిగా చూశారు అనే విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం.

ప్రతి జీవియొక్క శరీరం అణువులయొక్క సమూహం. ఈ సమూహంవల్లనే ఒక ఆకృతి అనేది కనిపిస్తుంది. అణువులలో పరమాణువులు వుంటాయి. ఒక్కొక పరమాణువులో, ఒక కేంద్రకం, ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూవుండే కణజాలం వుంటాయి. కేంద్రకం నుంచి శక్తి ఉత్పత్తి కాబడి, అది కణజాలం ద్వారా బయటకు ప్రసారం చేయబడుతుంది. ఆ బయటకువచ్చిన శక్తితోనే జీవియొక్క అన్ని “క్రియలు” జరుగుతుంటాయి.

విశ్వసృష్టి మొత్తానికి కూడా ఒక “కేంద్రకం”(లేదా మూలాధారం, ఆంగ్లంలో బ్లాక్-హోల్) వున్నదని భావించి, ఆ కేంద్రకాన్ని, జీవిలోని కేంద్రకంతో పోల్చిచూసినట్లైతే, విశ్వం యొక్క సృష్టి ఎట్లా జరిగింది, జరుగుతున్నది మనకి అర్ధం అవుతుంది. ఈ శతాబ్దపు శాస్త్రవేత్తలు కూడా, “విశ్వం” “బ్లాక్-హోల్” నుంచే పుట్టుందని అంగీకరిస్తూ, ఆ బ్లాక్-హోల్ గురించి తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

ఇప్పుడు, మనం ఋషులు తెలుసుకున్న భగవంతుడు దగ్గరకు వద్దాం. దానికన్నాముందు, మరొక విషయం చర్చిద్దాం. ఒకటవ తరగతి చదువుతున్న ఒక విధ్యార్ధికి, ఉపాధ్యాయుడు “యాపిల్ పండు”ను గురించి వివరిస్తూ, ఈ పండు, “గుండ్రంగా, ఎర్రగా, తియ్యగా” వుంటుంది అని చెప్పాడనుకోండి. ఆ విద్యార్ధి, గుండ్రంగా, ఎర్రగా, తియ్యగా వున్న ప్రతి పండును యాపిల్ పండేనని అర్ధంచేసుకుంటాడు. అట్లాగాక, నిజమైన ఆ యాపిల్ పండునే ఉదాహరణగా చూపిస్తే, విద్యార్ధికి చక్కగా అవగాహన అవుతుందికదా, అదేవిధంగా, ఋషులు భగవంతుని గురించి మనకు నిర్దిష్టమైన ఉదాహరణలు ఇచ్చారు. చిన్న తరగతులవారికి చిన్న ఉదాహరణలు పెద్దతరగతివారికి పెద్ద ఉదాహరణలు చెప్పినట్లుగానే, భగవంతుడుని గురించి ప్రాధమికంగా తెలుసుకొనేవారికి “విగ్రహారాధన” (సగుణోపాసన) ఉదాహరణగా చెప్పారు. బుద్ధికుశలత ఎక్కువగా వున్నవారికి “విశ్వచైతన్య శక్తి” (నిర్గుణోపాసన)ని ఉదాహరణగా చెప్పారు.

ఋషులు, భగవంతుడుని, ఒక “శక్తి” స్వరూపంగా తెలుసుకున్నారు. దీనికే సగుణోపాసనలో “ఆదిపరాశక్తి-లలితాదేవి” అనే పేర్లతో వివరించారు. మనం చూసే బొమ్మలు మన ఊహా చిత్రాలే. ఈ మూలశక్తినుంచి వచ్చిన శక్తి ద్వారానే అన్ని క్రియలు జరుగుతుంటాయి. ఈ క్రియలను వారు ముఖ్యంగా “మూడు” రకాలుగా తెలుసుకున్నారు. సగుణోపాసనలో వీటికి, ” బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా” తెలియచేశారు.
బ్రహ్మ – ఇచ్చాశక్తితో సృష్టిని కావించటం.
విష్ణు – తనకున్న జ్ఞానముతో, ఐశ్వర్యములను, అంటే, మనకు కావలసినవాటిని అందచేయటం, లేదా స్థితిని కలుగచేయటం.
మహేశ్వరుడు – సమస్తమును తెలిసినవాడై, సృష్టి,స్థితులను సమయాసమయములనుబట్టి లయింపచేయుటం. ఒక్కసారి పరమాణువును గుర్తుతెచ్చుకుంటే, కేంద్రకం నుంచి శక్తి ఉత్పత్తికాబడి, దాని చుట్టూ తిరుగుతున్న కణజాలం ద్వారా బయటకు వచ్చిన శక్తి అనేక క్రియలను జరిపి, లయమయిపోతుంది.

దీనినే పెద్దలు మరొకవిధంగా చెప్పారు. భగవంతుడు ఎక్కడో లేడు మనలోనేవున్నాడు అని. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కూడా నీలోనే వున్నారని చెప్పారు. దేవీ భాగవతం కూడా ఈ విషయాన్ని నిగూఢంగా తెలియచేస్తుంది. కేవలం దేవి భాగవతం దేవతల, అసురుల యుద్ధాల గురించి చెప్పింది కాదు. అది మన మనసులోని మంచి,చెడుల మధ్య జరిగే యుద్ధాల గురించి అన్యాపదేశంగా చెప్పబడింది. దీని అర్ధం, శక్తికి మూలమైన కేంద్రకం మనలోనే పరమాణువు రూపంలో వ్యాపించి ( విష్ణువు అనే పదానికి గూడార్ధం) వున్నదని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ మూల కేంద్రకానికి ముఖ్యంగా మూడు విలక్షణమైన గుణాలున్నాయి

1.శక్తి: కేంద్రకం, తనకు తానుగా తనకు కావలసిన శక్తిని సృష్టించుకోవటం.
2.స్ప్రుహ: తనకుగల శక్తి గురించి, ఆ శక్తికి గల లేదా ఆ శక్తితో చేయగల పనులను గురించి సంపూర్ణ అవగాహన కలిగియుండటం.
3.జ్ఞానం: తనే శక్తి, తనే స్ప్రుహ అని తనకు తానుగా తెలిసి ఉండటం.

పై మూడు లక్షణాలు మనలోవున్నట్లైతే మనలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వున్నట్లే.
ఈ మూడువుంటే, శక్తి మూల కేంద్రకం కూడా మనలో వున్నట్లే. పైన పేరాలల్లో భగవంతుడి లక్షణాలను గురించి ఇట్లా చెప్పుకున్నాం “శక్తికి, ఇచ్చకు, ఐశ్వర్యమునకు, ప్రయత్నమునకు, కీర్తికి, సమస్తమ్ తెలిసియుండుటకు, దొడ్డతనమునకును, జ్ఞానమునకును” మారుపేరు భగవంతుడు అని.
ఈ లక్షణాలన్నింటిని పైన చెప్పినట్లుగా “మూడు విలక్షణమైన గుణములు” గా సూక్ష్మీకరించాం.

పైన చెప్పిన మూడు లక్షణాలు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాల్లో అనుకుందాం) మానవునికి ఆపాదించినప్పుడు, ఏమి జరుగుతుందో పరిశీలిద్దాం

— తనకున్న శక్తితో, మనసులో కోరికలను సృష్టించుకొని, ఆలోచనలు చేయటం

–తనకున్న స్ప్రుహతో, తనలో కలిగిన అలోచనలకు, ప్రయత్నపూర్వకంగా కార్యరూపాన్ని ఇచ్చి, తనకు కావలసిన ఐశ్వర్యములను పొంది
అనుభవించటం, కీర్తిని పొందటం, తనకుగల దొడ్డతనముతో, ఐశ్వర్యములను ఇతరులకు కూడా పంచటం
–తనకుగల జ్ఞానంతో, సమస్తము తనకు తెలిసియుండుటచే, తనలో కలిగే కోరికలను, ఆలోచనలను తనలోనే లయింప చేసుకోవటం(కర్మ పరిత్యాగం).

కాబట్టి, సృష్టి, స్థితి, లయలు మనలోనేవున్న “మూలశక్తి” లేదా, “విశ్వచైతన్యశక్తి”లోనే నిబిఢీకృతమై వున్నాయి. హెచ్చు,తగ్గులు, బేధ,భావములు కూడా మన సృష్టే. అందుకే అంటారు“యత్భావం-తత్భవతి” అని, చిన్నపిల్లవాడి దగ్గరనుండి, పెద్దవాళ్ళవరకు, ఏ మంచి లేదా చెడు పని చేసినా, అది వారి అంతరాత్మకు తెలియకుండా వుండదు.

ఉదా:- ఒకటవ తరగతి చదువుతున్న పిల్లవాడు, ఉపాధ్యాయుడు ఇచ్చిన ఇంటిపనిని చేయకుండా, ఆడుకొని, బడికి వెళ్ళే సమయంలో గుర్తుకొచ్చి, ఉపాధ్యాయుడు ఇచ్చే శిక్షనుంచి తప్పించుకొనటానికి, తనకి కడుపునొప్పి వచ్చిందని తల్లికి చెప్పి, బడికి వెళ్ళలేదనుకోండి. ఆ పిల్లవాడు చెప్పిన అబద్ధం అతని “అంతరాత్మ”కు తెలుసు. కానీ, అబద్ధం చెప్పటం వలన, అది ఒక అలవాటుగా మారితే, భవిష్యత్ లో అతని జీవితానికి కలిగే తీవ్ర పరిణామాలు ఎట్లా వుంటాయని మాత్రం ఆ వయసులో, ఆ కుర్రవాడికి అవగాహన ఉండదు.

మూల శక్తి లేదా విశ్వచైతన్య శక్తినుంచి సృష్టింపబడిన వాటిలో, మానవులు ఒక రకం అయితే, వృక్షజాతి, జంతుజాతి, మొదలైనవెన్నో ఇతర రకాలు!!. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ మూల శక్తి, పంచభూతములు, లేదా, పంచధాతువులనబడే
” ఆకాశం, గాలి, నీరు, అగ్ని, భూమి ” యొక్క సమ్మేళనం. ఒక్కొక్క జాతి, లేదా, ఒక్కొక్క వస్తువు సృష్టింపబడినప్పుడు, అందులోని మూల శక్తిలో పంచభూతముల సమ్మేళనం ఖచ్చితంగావుంటుంది. అయితే, ఈ పంచభూతముల “సమ్మేళన నిష్పత్తి”, ఒక్కొక్కసారి, సమానముగా వుండదు. దీన్నే మనం కొందరిలో “తేడాలు”గా గుర్తిస్తుంటాం.

ఉదా:- ఒక వందమంది వ్యక్తుల్లో, ఒకతనికి గ్రుడ్డితనం వుందనుకుందాం. మిగితా విషయాలల్లో, అతను అందరిలాగానే వున్నాడు. ఏ పంచభూతముల సమ్మేళనంవల్ల అతనికి దృష్టి జ్ఞానం కలుగుతుందో, అట్టి సమ్మేళనంలో లోపంవల్ల అతనికి దృష్టి లోపం వచ్చివుండవచ్చు కాని, ఆ లోటు మరొక చోట భర్తీకాబడుతుంది. అతనికి స్పర్శ జ్ఞానం, మిగిలినవారందరికంటే ఎక్కువగా ఉండవచ్చు, లేదా వినికిడి జ్ఞానం ఎక్కువగా వుండవచ్చు.

ఉపసంహారం:- పైన చర్చింన విషయాలద్వారా, భగవంతుడిలో నేనువున్నాను అన్నా, నాలోనే భగవంతుడు ఉన్నాడన్నా, ఏమీ తేడా లేదు. ఎందుకంటే, నేను అంటే “మూల శక్తి”,లేదా “విశ్వచైతన్యశక్తి” లేదా “పరమాత్మయే” కాబట్టి సున్నాలోంచి, సున్నా తీసివేస్తే సున్నా అన్న చందాన ఇది కూడా మూలశక్తి ఒక ” బిందువు” ఆ బిందువునుండి సృష్టింపబడిన విశ్వం ఒక చక్రంలాంటిది, దీనికి, తుది, మొదలు అనేది లేనే లేదు వుండదు కూడాను!!

No comments:

Post a Comment