Tuesday, August 5, 2025

 చింతన -1


| నీ ఉన్నతి నీ చేతిలోనే"

ఉద్ధరే దాత్మనా�త్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః॥
(భగవద్గీత 6-5)

 ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేదా విముక్తికి కారణమైన మనసు వలలో చిక్కితే బంధనాలు.. దానిని జయిస్తే.. విముక్తి. మనసును జయించినవాడే ఆత్మవంతుడు, ప్రశాంతుడు, విజయసాధకుడు. గురువులు, శాస్ర్తాలు, దేవుడు.. ఇవన్నీ మార్గాన్ని చూపుతాయే కాని నడవవలసింది మాత్రం మనమే! పంచభక్షపరమాన్నాలను బల్లపై ఉంచినా.. మనకాళ్లతోనే అక్కడికి నడవాలి. మన కండ్లతోనే చూడాలి. మన చేతులతోనే తినాలి. వందమంది అనుభవజ్ఞులైన వైద్యులు తనచుట్టూ ఉన్నా క్షయరోగి తన దగ్గు తానే దగ్గాలి.
ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే తపన అణువణువునా రగిలిపోయే వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరగలుగుతాడు. సోమరులై, ఇంద్రియలోలురై, ప్రవాహాన్ని అనుసరించి నడిచేవారిని ఏ దేవుడూ ఉద్ధరించడు. అనుక్షణం మన మనసు ధర్మాధర్మ విచికిత్స చేస్తూనే ఉంటుంది.. యుక్తమైన దానిని ఆదరిస్తే.. జీవితలక్ష్యం నెరవేరుతుంది. ఎవరైనా సహాయం చేస్తారు లేదా భగవంతుడే ఉద్ధరిస్తాడనే భావన పనికిరాదు. ఆరుపాళ్లు నువ్వు ప్రయత్నిస్తే.. ఒకపాలు భగవంతుడు సాయపడతాడు. తనను తాను ఉన్నతీకరించుకునే వ్యక్తికే భగవంతుడు కూడా సహాయకారిగా ఉంటాడనే సామెత ఉన్నది. త్రికరణశుద్ధిగా భగవంతుని నమ్మిన భక్తుడొకరు భాగవతం చెబుతున్నాడు. ఊరి పక్కన ఉన్న చెరువుకట్ట తెగి నీరు ఊరిలోకి వస్తున్నది. ఒకరు, ఇద్దరూ, ముగ్గురూ ఇలా పదిమంది వచ్చి నీటిప్రవాహం ఉధృతంగా ఉన్నదని, అందరూ వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్కరుగా శ్రోతలంతా అక్కడినుంచి వెళ్లారు. భక్తుడు మాత్రం భగవంతుడే తనను కాపాడతాడని అక్కడే ఉండిపోయాడు. ప్రవాహవేగం అధికమై చివరకతను ప్రవాహంలో పడి ప్రాణాలు విడిచాడు. భగవంతుని వద్దకు చేరుకున్న భక్తుడు ‘నన్నెందుకు రక్షించలేదు’ అని దేవుణ్ని నిలదీశాడు. అప్పుడు భగవంతుడు ‘పలుమార్లు వివిధ వ్యక్తుల రూపంలో వచ్చి నేను హెచ్చరించాను. నీవే మూర్ఖంగా వచ్చిన అవకాశాలన్నిటినీ చేజార్చుకున్నావు’ అని చెప్పాడు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనే భావన సరైనది కాదు. ప్రయత్నం కర్మఫలాన్ని కూడా మార్చుతుందని చెబుతుంది యోగవాసిష్టం. అవకాశాలు వచ్చి చుట్టూ పలకరిస్తున్నా.. వాటిని గుర్తించలేని గుడ్డివారిని భగవంతుడు కూడా రక్షించలేడు.
భౌతిక ఆకర్షణల వలయంలో చిక్కి, జీవిత గమ్యానికి దూరమైన వాడిలో జాత్యంతరీకరణ జరగదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. మనసును తన అధీనంలో పెట్టుకొని ముందుకు సాగేవానికి మనసే బంధువుగా సాయపడుతుంది. ఆటంకాలు కలుగుతాయనే భ్రాంతిలో, ఆ ఆలోచనలనే మనసుకు సూచనలుగా ఇస్తే.. ఆ మనసే శత్రువై అన్ని కార్యాలయందు అపజయాన్ని ఇస్తుంది. ఉనికిలోనే శూన్యత్వాన్ని, శూన్యత్వంలోనే ఉనికిని గుర్తించగలిగిన వారే అవకాశాలను అందిపుచ్చుకుంటారు.. విజయాన్ని సాధిస్తారు. నిరంతర సాధన, ఆధునీకరణే విజయానికి దగ్గర దారి. ఇతరుల మెప్పుకోలు మనలో ఆశలను, అహంకారాన్ని పెంచుతుంది.. అదే మనస్థాయిని నిర్ణయిస్తే వారికి మనం బందీలమైనట్లే. ఇతరుల ఆలోచనల ప్రకారం లేదా అభిప్రాయాల ప్రకారం నడవడం కాకుండా మన అంతరంగం ఏం చెపుతున్నదో ఆ విధంగా నడిచేవాడే మార్గదర్శకుడు అవుతాడు. జీవిత ప్రయాణంలో అంతరంగమే కేంద్రం కావాలి.. బాహ్యమైన అంచులలో ఇతరుల అభిప్రాయాలు నిలవాలి. అప్పుడే మనసు నీ అధీనంలో ఉంటుంది.. భౌతిక జగత్తులో ప్రగతి ఆధ్యాత్మిక జగత్తులో సుగతి కలుగుతుంది.
(చింతన -1)

Sekrana from Namaste telengana dt.12-8-24

No comments:

Post a Comment