ఉపదేశ సారం-28
అద్వైతమే ఆనందం
"ఆత్మా సంస్థితిః స్వాత్మదర్శనం
ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మ నిష్టతా"
తన స్వస్తితిలో తానుండడమే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం . దర్శించడానికి ఆత్మలో రెండు లేవు గనుక..తాను తానుగా ఉండడమే ఆత్మ నిష్ఠ. అందులో జీవేశ్వర భేదానికి తావు లేదు . భగవాన్ రమణ మహర్షి మానవాళికి అందించిన 30శ్లోకాల ఆత్మజ్ఞాన ప్రబోధ గ్రంధం "ఉపదేశ సారం " లోని26 వ శ్లోకమిది . ఈ శ్లోకంలో భగవాన్ రమణులు చెప్పిన ఆత్మ దర్శనం అంటే ..కుర్చీనో , బల్లనో చూసినట్లుగా ఆత్మను దర్శించడం కాదు. అది ఒక వస్తువు కాదు . దానికన్నా వేరుగా మరొకటి ఉండే వీలు లేదు . "నేహానా నాస్తి కించన " అన్నారు . కనుక ఆత్మను దర్శించే మరొక ఆత్మ లేదా జీవుడు ఉండే వీలు లేదు . మరి ఏమిటీ ఆత్మ దర్శం ? అంటే, నేను సర్వవ్యాపకమై , ఏకమై , అద్వయమై ఉన్న ఆత్మను నాకన్నా వేరుగా" ఏమీ లేదు " అనే అనుభవంలో ఉండి పోవడమే . ఇదే అవరోక్షానుభవం అని శ్రుతులు చెప్పేది .
ఒక కోటీశ్వరుడు నిద్రపోతున్నాడు . కల వచ్చింది . కలలో తానొక బిచ్చగాడు . ఆకలితో అలమటిస్తున్నాడు. ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నాడు . ఎక్కడా ముద్ద దొరకట్లేదు . పైగా తిట్లు . ఇంతలో అతడికి మెలుకువ వచ్చింది . కలలోవన్నీ అదృశ్యమై పోయి , " ఇప్పుడు నేను బిచ్చగాణ్ణి కాదు , కోటీశ్వరుణ్ణి అని ఎవరూ చెప్పకుండానే , ఏమీ ఆలోచించకుండానే అతడికి తెలుస్తుంది . అదే కలలో ఉన్నంతసేపే తాను కోటీశ్వరుణ్ణి అనే విషయమే అతడికి గుర్తురాదు . మేలుకొన్నపుడే అది సాధ్యం . అదే స్వానుభవం . అదే స్వస్థితిలో ఉండడం. ఆధ్యాత్మిక కోణంలో మెలకువగా ఉండడం . అంటే ..ఆత్మజ్ఞానం కలగడం . జీవుడుగా ఉన్న వ్యక్తి శ్రవణ , మనన , నిదిద్వాసనల ద్వారా , సాధనాల ద్వారా సమాధి నిష్ఠలో "నేను జీవుణ్ణి కాదు , ఆత్మనే " అని గ్రహిస్తాడు . స్వస్థితిలో ఆత్మగానే ఉండిపోతాడు . మరచిపోవడం , గుర్తు తెచ్చుకోవడం ఉండదు . అదే ఆత్మ సంస్థితి . అలా ఆత్మ సంస్థితిలో ఉండడమే స్వాత్మ దర్శనం . దాన్నే పరమాత్మ సాక్షాత్కారం అంటారు .ఆత్మా నిర్ద్వయాత్ . అంటే రెండు లేవు . ఆత్మ ఏకం ..అది అద్వయం . ఎందుకంటే ..ఆత్మకన్నా నీవు వేరైతే ఆత్మ నీ చేత చూడబడేది అవుతుంది . చూడబడేది దృశ్యం . అది పరిమితం . పరిమితమైనదేదైనా నశిస్తుంది .. నశించేది ఆత్మ కావడానికి వీల్లేదు . కాబట్టి , ఆత్మ ఏకం .
ఒక బాటసారి కాలినడకన వెళ్తున్నాడు . దారిలో తినడానికి చద్దిమూట నెత్తిన పెట్టుకుని వెళ్తున్నాడు . చాలా సేపట్నుంచీ నడుస్తున్నాడేమో బాగా ఆకలి వేసింది . పైగా నెత్తిన చద్ది మూట బరువు . అడుగు పడడం కష్టంగా ఉంది . ఇంతలో ఒక సెలయేరు కనబడింది . వెంటనే అతడు మూట కిందికి దింపి హాయిగా స్నానం చేసి , చద్ది తిన్నాడు . ఇప్పుడతనికి ఆకలి తీరింది . బలం వచ్చింది . నెత్తి మీద మూటలో ఉన్నప్పుడు బరువుగా అనిపించిన అన్నం , కడుపులోకి పొతే బరువు లేకపోగా బలంగా ఉంది . అంటే , వేరుగా ఉంటె భారంగా ఉన్నది . ఒక్కటైపోతే బలంగా మారింది . కాబట్టి అద్వైతమే ఆనందం.
- -by sri దేవిశెట్టి చలపతిరావు,
Sekarana from andhrajyoti .27-10-20
No comments:
Post a Comment