Wednesday, August 6, 2025

 *లక్ష్మీకటాక్షం.....* 

*నోములు, వ్రతాలు నిత్యపూజలో భాగం కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి, నిర్దిష్టమైన సమయాల్లో చేసే విశేష అర్చనలు అవి. పూజా విధానాలు, సామగ్రి వాటిలో దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో- ఆది వ్రతం అవుతుంది. ఏకపత్నీ వ్రతం, బ్రహ్మచర్య వ్రతం వంటివి ఆ కోవలోకి వస్తాయి. నోము అనేది నియమితకాలానికి పరిమితం అవు తుంది. పదహారు ఫలాల నోము ఉందంటే-ముత్తయిదువులకు పదహారు రకాల పళ్లు వాయనంగా సమర్పించి, ఉద్యాపనకు ఉపక్రమించడంతో నోము పూర్తయిపోతుంది.*

*శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మి పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించవలసిన విషయం. పౌర్ణమి ముందు కుదరకపోతే ఆ తరవాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఒకరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా నిర్వహించే పూజావిధానాన్ని 'వరలక్ష్మి* *వ్రతం'గానే అందరూ సంభావిస్తారు.*

*లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకు చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడపడానికి కావలసిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ సంపదలుగానే లెక్క ధనం సరే సరి. 'ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే లభిస్తాయి' అని ప్రజల నమ్మకం. వీటిని కోరేవారంతా లక్ష్మీ కటాక్షానికై అర్రులు చాస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి... వంటి పేర్లతో ఆయా అంశాలవారీగా వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.*

*లోకంలోని సకల దారిద్ర్యాలను పారదోలే దేవత శ్రీమహాలక్ష్మి. సమస్త ఉపద్రవాలను ఆమె నివారించగలదు. శంకర భగవత్పాదులు ఆమెను 'సంపత్కరాణి' అని 'త్రిభువన భూతి కరి' (ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేది) అనీ స్తుతించడంలోని విశేషం అదే. వీరిలో 'వర అంటే శ్రేష్ఠమైనది- వరలక్ష్మి! ఏం కోరినా ప్రసాదించగల వరాలతల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంభావించారు.*

*వరలక్ష్మి వ్రతకథలో భక్తురాలి పేరు చారుమతి. అంటే మంచి బుద్ధి కలది. ఆమె సద్గుణాలకు మెచ్చే- లక్ష్మీదేవి ప్రసన్నం అయిందని వ్రతకథ చెబుతుంది. వరలక్ష్మీ వ్రతంలో విశేషం అంతా వ్రతం పూర్తయ్యాకనే ఉంటుంది. వ్రతానంతరం ముత్తయిదువులకు వాయనం ఇచ్చే సమయంలో 'కోరితి వరం' అని ఇల్లాలు అనగానే 'ఇస్తిని వరం' అని ముత్తయిదువు బదులిస్తుంది. 'ఇస్తినమ్మ వాయనం' అని ఈమె అంటే 'పుచ్చుకొంటి వాయనం' అని ఆమె పలుకుతుంది. ఇందులో కోరేవారు ఇచ్చేవారూ అందరూ కథలోని చారుమతులే! అలాగే 'వరం ఇస్తిని' అని ధీమాగా పలికే ప్రతి స్త్రీమూర్తీ వర లక్ష్మీదేవే! ప్రతి ఇల్లాలిని లక్ష్మీ స్వరూపంగా గుర్తించడం, భావించడం, ఎదుటి మనిషిలో దైవాన్ని గమనించడం ఈ జాతికి నేర్పింది-వరలక్ష్మి వ్రతకథ.*

*సంపదను ఇష్టపడే వారంతా లక్ష్మీస్థానాలను గుర్తించాలన్నది దీనిలో మరో ముఖ్యసూచన. లక్ష్మీ విభూతులలో 'మనిషి చెమట చిందించే చోటు'ను ముఖ్యమైన లక్ష్మీస్థానంగా చెప్పారు. ఉచితాలెప్పుడూ అనర్ధదాయకాలే! శ్రమే సంపద. శ్రమకు వెనకంజ వేసేవాణ్ని, ఉచితాలకు ఎగబడేవాణ్ని దరిద్రదేవత వరిస్తుంది. శ్రీదేవి తిరస్కరిస్తుంది. మనిషి చెమట బిందువులోనే శ్రీమహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. శ్రమపట్ల, శ్రమజీవులపట్ల గౌరవం ఉన్నవారంతా ఈ కథలోని చారుమతులు. వారివద్దకు శ్రీమహాలక్ష్మి వచ్చి వాయనం పుచ్చుకొంటుంది. 'ఇస్తినమ్మ వరం' ఆని వారికి నమ్మకంగా మాట ఇస్తుంది. లక్ష్మీ కటాక్షానికి ఆద్యంతాలను నిర్దేశించడమే వర లక్ష్మీ వ్రతకథ లక్ష్యం.!*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌷🌼 🙏🕉️🙏 🌼🌷🌼

No comments:

Post a Comment