*భగవద్గీత పారాయణ ఫలం*
*ఈ రోజు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను మరియు విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేయండి.*
*భగవద్గీత పారాయణ ఫలం*
*'గీత’ అనే పదం హద్దును లేక రీతిని సూచిస్తుంది. ‘గీత’ హద్దును సూచిస్తే, మహాభారతంలోని ‘గీత’ రీతిని సూచిం చింది. శివగీత, బ్రహ్మగీత, గణశగీత, హనుమద్గీత, దేవీగీత, వశిష్టగీత, పరాశర గీతా ఇలా ఎన్నో గీత గ్రంథాలున్నప్పటికీ మహాభారతంలోని ‘భగవద్గీత’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించి కర్తవ్యాన్ని సూచించాడు. భగవంతుని ప్రతిరూపమే గీత. ధర్మస్థాపన చేసేందుకు దోహద పడింది.*
*గీత కర్మయోగంలో ఆరంభమై భక్తిశరణాగతిలో అంతమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందు కంటే మానవుని నిత్యజీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. గీత ఏ మతాన్ని ఏ* *సంప్రదాయాల్ని కాదనదు అన్ని మతాలవారూ, సంప్రదాయాల వారూ భగవ ద్గీతను ఆదరిస్తున్నారు. విశ్వమానవ కల్యాణం కొరకు సమస్త ప్రాణికోటికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్త్వాజ్ఞానా మృతమే భగవద్గీత. 700 వందల శ్లోకాలతో 18 అధ్యాయాలలో పొందుపరచబడినది.*
*భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.*
*మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.*
*'క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం’ లో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో మానవ శరీరం ఏ విధంగా ఆవిర్భవించింది. దాని ప్రాముఖ్యత, లక్షణాలు గురించి వివరంగా పేర్కొన్నారు. సత్వ, రజ, తమో గుణాల ప్రాబల్యం వలన మానవుని, నడవడిలోని మార్పులు, వాని ప్రవృత్తులు, శరీర స్పందన గురించి విశదంగా వ్యాఖ్యానించారు. మానవుని జీవిత నడవడికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన సందేశం.*
*మూఢుని మోహాన్ని పోగొట్టి కర్తవ్యపరాయణుని చేస్తుంది. గీతలో కర్మ, జ్ఞాన, భక్తి మూడు విషయాలు కనబడు తుంటాయి. కర్మ సాత్విక, రాజసిక, తామసికమని మూడు విధాలని గీత చెప్పింది. కర్మ ఎప్పటికీ వదలరాదు. ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే. అది కర్తవ్యబుద్ధితో చేస్తుండాలి. ‘కర్మణ వాధికారస్తే మా ఫలేషు కదాచన’ కర్మ చేయడం నీ విధి. దాని ఫలితాన్ని ఇచ్చేది మరొక శక్తి. జ్ఞానం లేని కర్మ వ్యర్థమే. భక్తి లేకపోతే జ్ఞానం అలవడదు. ”సర్వధర్మాన్ పరిత్యజ్య” అన్ని ధర్మాలు వదలి తనను మాత్రమే శరణు పొందమని భగవానుడు చెప్పాడు. నిత్తనైమిత్తిక సమస్త ధర్మాల కంటే కర్మలకంటె భగవశ్చరణాగతి ఎన్నో రేట్లు అధిక ఫలం కలిగిస్తుంది. భగవానుని గీత ధర్మమిది. గీత భగవద్వాణి అగుటవలన వేదరుక్కులతో సమానం. ఇది ఉపనిషత్సారము, అద్వితీయము. భగవద్గీత శ్రీకృష్ణభగవానుని ముఖారవిందం నుండి స్రవించిన దివ్యామృతం. భగవద్గీత ధర్మాల యొక్క సముదాయమని స్వామి వివేకానందుడు అంటే, వినోభాభావె నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతగా ఉపయోగపడింది అనగా, తిలక్ ప్రపంచ సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల గ్రంథం వేరొకటిలేదు. అది మనుషులను పరమానంద పదవికి కొనిపోగల అపూర్వసాధనం అని … ఇలా ఎందరో మహానుభావులు గీత గురించి వ్యాఖ్యానించారు. భ గవద్గీతా కించి దధీతా గంగాజల లవకణికా పేత సకృదపియేన మురారి సమర్చా క్రియతేత స్వయమ్యో పినచర్చా” అని ఆదిశంకర భగవద్పాదులు భగవద్గీతా ప్రశస్త్యాన్ని వివరించాడు.*
*గీతను భగవానుడు మార్గశిర శుక్ల ఏకాదశినాడు. అర్జునునికి ఉపదేశించినాడు. కాన ఆనాడే గీతాజయంతిని జరుపుతున్నారు. గీతామృతాన్ని మనం గ్రోలి ధన్యులమవుదాం! ‘రసస్రవంతి-కావ్యసుధ*
*పరిత్రాణాయ సాధూనాం* *వినాశాయచ దుష్కృతాం*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే*
*సమస్త గ్రంథాల సారం వేదం. వేదసారం ఉపనిషత్తు. ఉపనిషత్సారాంశం గీత. గీత సారాంశం భగవంతుని శరణాగతి. అనన్యభావంతో శరణు పొందినవానికి సమస్త పాపాలనుండి రక్షింపబడి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. హృషీకేశుడైన శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగంలో చేసిన బోధామృతమే భగవద్గీత. ‘గీ’ అంటే త్యాగం. ‘త’ అంటే తత్వజ్ఞానం. త్యాగాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వివరించేది. లోకంలో కర్మ మార్గం, భక్తిమార్గం, జ్ఞానమార్గాలను అవలంబించే ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రంలో ఉన్నారు. మోక్షం పొందడానికి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలనే నాలుగు ద్వారాలగుండా ఏ ద్వారంనుంచైనా వెళ్లి ముక్తిసౌధంలోకి చేరుకోవచ్చు. ఎక్కడెక్కడి నదులన్నీ సముద్రం చేరునట్లు, ఈ మార్గములన్నియు, జీవుని కైవల్యధామానికి చేరుస్తాయి. చిత్తము తమోగుణంతో కూడిన వాసనలతో నిండిపోయి, కఠినశిల వలె ఉన్నంత వరకు, ఎన్ని పూజలు, హోమాలు, ఉపవాసాలు ఉన్నా, భగవంతుని గాంచలేరు. కొన్ని వేల యుగాలలో చేసిన ఫలితాన్ని సులభంగా పొందే మార్గం భగవద్భక్తి.*
*పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతంలోని భగవద్గీతకు ప్రత్యేక స్థానముంది. భగవద్గీతలోని అక్షరాలకు అనంత శక్తి ఉంది. భగవద్గీత కేవలం భక్తి బోధనే కాదు. హిందూ సంస్కృతి వికాసానికి మూలాధారాలు అందులో ఉన్నాయి.*
*ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలోని పాండవులకు, కౌరవులకు మధ్య జరుగునున్న భీకర సంగ్రామం. ధర్మానికి, అధర్మానికి అనాదిగా అవిరామంగా జరుగుతున్న పోరాటం. ఆ పరిస్థితుల్లో పార్థుడే కాదు, ఎవరున్నా, అంతర్మథనానికి లోను కావలసిందే. పార్థుని సందేహాలకు ఇచ్చిన సమాధానమే ఈ గీతాసారం. నిరాశా నిస్పృహలతో అచేతనావస్థలో ఉన్న పార్థునికి కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుడు అతనిని యుద్ధోన్ముఖుని కావించాడు. ధర్మసంస్థాపన కోసం బోధించిన ఈ గీత నేటి తరాన్ని కూడా అంతే సమర్థంగా కర్తవ్యోన్ముఖుల్ని చేయగలదు. అనేక సంశయాలకు దారి చూపగల జ్ఞానసంపత్తి ఇది. ఈ జ్ఞాన సంద్రాన్ని మధించిన వారెందరో, మహానుభావులు, విద్యావేత్తలు, తాత్వికులు, వేదాంతులు తమ తమ పరిధిలో వారి అవగాహన ప్రస్ఫుటంగా వివరించారు. ఇది భారతీయులకే కాక, యావత్ప్రపంచానికీ మహా ప్రసాదం. ఇహపరాలకు, ప్రాపంచిక, ఆధ్యాత్మికాలకు సంబంధించిన అనేక అంశాలు, పండు వొలచినట్లుగా, తర్కబద్ధంగా సుబోధంగా వివరించారు.*
*గీత అంటే భగవద్గీతే కాదు, వశిష్ట గీత, హంసగీత, భ్రమరగీత, శ్రుతిగీత, బ్రాహ్మణ గీత – ఇలా దాదాపు 18 గీతలున్నాయి. గీత శబ్దం వినబడగానే భగవద్గీత ఒక్కటే మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేది.*
*నేను యుద్ధం చేయను. బంధువులు, తాతలు, అన్నగార్లు, మేనమామలు, వీరిని చంపి రాజ్యాన్ని పాలించాలి. అందుకే నాకీ రాజ్యం వద్దన్నాడు అర్జునుడు. యుద్ధం ఎందుకు చేయాలో గీతలో చక్కగా విడమర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు. నీ విద్యుక్తధర్మాన్ని నీవు నెరవేర్చు. అది కర్మ చేయడం కన్నా గొప్పది. గీత భౌతిక అజ్ఞానంనుండి వుద్ధరించడమే పరమతత్వం.*
*ప్రతి ఒక్కరు కర్మలపై ఆశ లేకుండా కర్మలు చేస్తూ వాటిపైన ఆసక్తి చూపాలి. అపుడే మానవుడు అభివృద్ధి చెందుతాడు. జడపదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం. ఇద్రియాలకంటే మనసు ఉత్తమం. మనసుకంటే ఆత్మ ఉత్తమమైనది. అందుకే మనిషి తాను చేయలదలచిన పని, ఆత్మసాక్షిగా చేయాలి. ఆత్మను ఒప్పిస్తే అన్నిటినీ ఒప్పించినట్లే. ప్రతిఫలాపేక్ష లేకుండా మనము పని చేయడమే మన ధర్మం.*
*భగవద్గీతలో జ్ఞాన కర్మ మార్గాలలో ఏది విశిష్టమైనది అనేదానికి ఎంతటి జ్ఞాని అయినా కర్మలుచేయక తప్పదని కర్మలు చేస్తే ప్రతిఫలాపేక్ష లేకంఉడా చేస్తే దోషం ఉండదని సమన్వయం కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క అధ్యాయ మహత్తు చెప్పడానికి ఒక్కొక్క కథ ఉంది. భగవద్గీతలో 100 శ్లోకాల దాకా సంజయాదుల ప్రశ్నోత్తరాలు, వర్ణనలు, విమర్శలు ఉన్నాయి. గీత మొదటి ఐదు అధ్యాయాలు తన ముఖంగాను, తరువాత వచ్చే 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, 16వ అధ్యాయం ఉదరంగాను, 17, 18 అధ్యాయాలు తన రెండు పాదాలుగాను ఉంటాయని శ్రీమహావిష్ణువు చెప్పాడు. భగవద్గీతలో ఒక అధ్యాయమైనా పారాయణం చేయాలి. కనీసం ఒక శ్లోకమైనా త్రికరణ శుద్ధిగా పఠించాలి.*
*┈┉━❀꧁కృష్ణం వందే꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺🕉️🌺 🙏🕉️🙏 🌺🕉️🌺
No comments:
Post a Comment