ముఖము లేకున్నా బొట్టు పెట్టుకునేది
*గడప* .
‘దేహళి’ అంటే ‘కడప..(గడప).
ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ గడప అంటారు.
గడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను, దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు.
ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు, దాటుతూ వెళ్లాలి తప్ప.
ఈ గడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.
గడప నిర్మాణంవలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది.
ఏ గదికి ఆ గదికి గడప, లేకపోతే పడక గదికీ, వంట గదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు.
‘మడి’ అంటే హద్దు గట్టు అంటే హద్దును ఏర్పరిచే ఒక గడప.
దేవుని పూజకు మడికట్టుకోవడమంటే కూడా అదే అర్థం. ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం. అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది.
గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది. పాములూ, తేళ్లు వంటి పాకుడు క్రిమి కీటకాలు (సరీసృపాలు) ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి.
అదే గడప ఉన్నట్టయితే ఇంట్లోకి రాకుండా బయటినుండే వెళ్లిపోతాయి. అందుకే ఇంట్లో ప్రతి గదికీ గడప (కడప) ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్ధ సాధక నియమాన్ని నిర్దేశించింది.
ఆ గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు, నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి. అది దోషంగా ఉన్నప్పుడు దేహళీభిన్న వేధగా పీడిత ద్వార దోషంగా హాని కలిగిస్తుంది.
ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడవు.
గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.
***
శిశువు ఆరు యేడు నెలలలో గడప దాటితే గారెలు అని ఒక నానుడి.
శిశువు ప్రాకడం ప్రారంభించి గడప దాటినప్పుడు గారెలు తయారు చేయడం ద్వారా వేడుక జరుపుకుంటారు.
ముందు బోర్లా పడతారు.
అప్పుడు బూరెలు,
తరువాత ప్రాకుతారు
అప్పుడు పాయసం,
తరువాత ప్రాకీ ప్రాకీ గడప దాటతారు.
అప్పుడు గారెలు వండుతారు.
గృహరాజ్యంలో ఆనందాల పంపకంలో స్త్రీ పురుషుల సంయుక్త కార్యాలు లేకుండా, ఇరుగు పొరుగుల వారు పాల్గొనకుండా ఒక్కటీ జరగదు.
***
కొన్ని సామెతలు :
కమ్మగుట్టు గడప దాటదు.
అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప.
అరచేవాడి పంచన చేరవచ్చు గానీ, నాలిముచ్చు గడప త్రొక్కరాదు.
మాట పెదవి దాటితే గడప దాటినట్లే.
ఇంటికి గడప అందం.
***
గడప అనేది కేవలం ఇంటి ద్వారానికి సంబంధించిన ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, మన ప్రాథమిక జీవితం, సాంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లోకి కుటుంబ సభ్యులు, అతిథులు, ఇతరులు రావడానికి ఇదొక దారి, ఇంటిలోకి ప్రవేశించడానికి ముందు ఒక రక్షణ గోడ వంటిది గడప.భారతీయ సంస్కృతుల్లో గడప మీద, గడప వద్ద ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించడానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఇది ఇంటికి, ఇంట్లోని వ్యక్తులకూ శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.గడపను ఇంటి శుభరూపంగా, దుష్ట శక్తుల నుండి రక్షణ ఇచ్చే ప్రదేశంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గడప మీదనే అంగీకారాలు, సంప్రదాయ కార్యక్రమాలు, ప్రమాణాలు వంటివి చేస్తుంటారు. గడపను పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి, ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు.
గడప మీద కూర్చోవడం లేదా ఏదైనా తప్పు చేయడం అనేది అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల గడపను అవమానించినట్ల అవుతుందనీ, అది ప్రతికూల శక్తుల ప్రసారం లేదా ఏదైనా ప్రతికూల పరిణామాలు జరగడానికి కారణమవుతుందని అంటుంటారు.
***
మహాభారతం శాంతి పర్వం లో ధర్మరాజు మహాలక్ష్మి ఎక్కడ కొలువు అయి వుంటుంది పితామహా అని అడుగుతాడు.
అంపశయ్య మీద వున్న భీష్ముడు ఇలా సమాధానం ఇస్తాడు.
పచ్చని పొలంలో, పారే నీటిలో, పసుపు పూసిన గడపలో, స్వచ్చమైన చిరునవ్వులో, అతిధి అభ్యాగతులతో కళకళలాడే నివాసాలో, పరిశుభ్రతలో, సత్యంలో, దానంలో, ధర్మంలో మహాలక్ష్మి వుంటుంది".
తిరుమల లో మొదటి గడప దగ్గర నుండి దర్శనం ప్రతీ భక్తుడు కొరుకుంటాడు.
***
ఇంటి గడపకి కూడా ద్వారలక్ష్మీగా భావించి పూజలు చేస్తుంటాం . ద్వారానికి పసూపు కుంకుమలతో ప్రతి పండుగకీ అలంకారం చేయడం , పూజించడం మన సంప్రదాయంగా విలసిల్లుతోంది . అయితే మన ఇంట్లో ఉండే గడప సాధారణంగా చెక్కతో చేసినదై ఉంటుంది . కానీ దేవాలయాల్లో , ప్రత్యేకించి పురాతనమైన దేవాలయాల్లో రాతితో చేసిన గడపలు ఉంటాయి . ఆలయంలోపలికి వెళ్లేప్పుడు ఖచ్చితంగా ఈ గడపకి మొక్కే , లోపలికి వెళతారు. అలా ఎందుకో తెలుసుకుందాం .
పూర్వకాలంలో కట్టిన ఆలయాల్లో అద్భుతమైన శిల్పసంపద మన దేశంలోని ఆలయాల్లో ఉన్న గొప్పదనం . ఆధ్యాత్మిక సంపదతోపాటుగా , ఆ ఆలయాల్లో ఉన్న శిల్పకళా సంపద కూడా మన దేశానికే ఉన్న గొప్ప వరాలలో ఒకటి. ఈ ఆలయాల్లో కచ్చితంగా రాతి గడపలే ఉంటాయి . భగవంతుడు ఎక్కడ వెలసిన కొండలమీద ఎక్కువగా స్వయంభువై వ్యక్తం కావడం అనేది ఇక్కడ మనం పరిగణించాల్సిన అవసరం ఉంది . కొండలన్నీ కూడా రాతి బండలే ఎక్కువ . అలాగని వాటిని రాతి బందాలనుకునేరు . ఆ పర్వతాల్లో తపస్సుని ఆచరించిన మహర్షులు , తాపసులు కూడా ఉన్నారు . ఒకప్పుడు ఈ పర్వాతాలకి రెక్కలుండి , అవి ఎగిరే శక్తిని కూడా కలిగి ఉండేవని పురాణాలు చెబుతున్నాయి . గొప్ప చరిత్రగలిగిన, పవిత్రమైన ప్రదేశాలు ఈ పర్వతాలు .
అలాంటివారిలో భద్రుడు , హిమవంతుడు, నారాయణుడు కూడా ఉన్నారు . భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే అటువంటి కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఇటువంటి గడపలు దేవాలయాల్లో ఉన్నప్పుడు నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా జాగ్రత్తగా దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.
గడపకు అటూ ఇటూ కాళ్ళుపెట్టి నించోకూడదు కూడా.
***
ఆలగడప అని ఒక పట్టణం మిర్యాలగూడ జిల్లా లో ఉన్నది.
గడప తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని గ్రామ పంచాయతి కేంద్రం.
కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని గడప కావటమే.
***
ఒక చక్కని ఆరుద్ర సినిమా గీతం :
"ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
ముద్దు మురిపాలలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ఆరనైదోతనము ఏ చోట నుండు
అరుగులలికేవారి అరచేతనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరికొలిచేవారి కొంగుబంగారు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్ళు
మొగడు మెచ్చినచాన కాపురంలోన
మొగలిపూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంతవైభోగం.."
అలాగే సినారె గీతం ఒకటి:
" ముంగిట వేసిన ముగ్గులు చూడు
ఓ లచ్చా గుమ్మాడీ
ముత్యాల ముగ్గులు చూడు
ఓ లచ్చా గుమ్మాడీ
ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాన
పూచిన రంగవల్లులే సుమా... "
స్వస్తి
No comments:
Post a Comment