----------
మంత్రం మ(న)నం
-----------------
మననాత్ త్రయేతి ఇతి మంత్రః – మననం చేస్తూండడం వల్ల రక్షించేది మంత్రం. మంత్ర మననం, మంత్ర జపం మంత్ర యోగం అవుతుంది. మంత్ర యోగం దేవతతో సమన్వయం (synthesis) ను ఇస్తుంది. “తతు సమన్వయాత్” అని బ్రహ్మ సూత్రం చెబుతోంది. ఇక్కడ ‘తత్’ అని అన్నది పరమాత్మ అయిన బ్రహ్మన్ ను ఉద్దేశించే అయినా ఈ సమన్వయం (co ordination కాదు) అన్నది ఉద్దేశించబడిన ఏ దేవతకైనా పొసుగుతుంది. మంత్రం అనేది ఒక దేవతకు శబ్ద రూపం.
మననం అంటే అదే పనిగా మానసికంగా వల్లె వేసుకోవడం. ఇలా మంత్ర మననం చేసే వ్యక్తి ముని. మంత్రాన్ని స్మరించుకోవడం కూడా మననమే. మంత్ర మననాన్ని భావంతో చెయ్యాలి. “భావే చోపలబ్దేః” అని బ్రహ్మ సూత్రం. అంటే భావం లోనే దొరుకుతుంది అని అర్థం.
మంత్ర జపాన్ని మాలతో చేస్తారు లేదా చేతి వేళ్ల కణుపులతో లెక్కించుకుంటూ చేస్తారు. మంత్ర జపం మూడు రకాలుగా ఉంటుంది. 1. మానసిక జపం 2. ఉపాంశు జపం. 3. వైఖరీ జపం. మంత్రాన్ని మానసికంగా జపించడం మానసిక జపం అవుతుంది. మంత్రాన్ని శబ్దించకుండా నోటితో అనుకుంటూ జపించడం ఉపాంశు అవుతుంది. మంత్రాన్ని బయటకు వినిపించేట్లుగా ఉచ్చరిస్తూ జపించడం వైఖరీ జపం అవుతుంది. వీటిలో మానసిక జపం ఉత్తమం. ఉపాంశు జపం మధ్యమం. వైఖరీ జపం అధమం.
మంత్ర సాధన వ్యక్తులకు వేరు వేరు రీతులలో లాభదాయకంగా ఉంటుంది.
మంత్రాలలో ఓం కారానికి ప్రత్యేకమైన స్థానముంది. *‘మంత్రాణాం ప్రణవశ్శిరః’*. ఓం కారం మంత్రానికి శిరస్సు. ఓం కారం సర్వాంతర్యామి అయిన బ్రహ్మన్ కు పేరు. *“తస్య వాచకం ప్రణవం”* అని పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడింది. ఒక మంత్రాన్ని ఓం కారంతో మొదలు పెట్టాలి,
దేవనాగరి లిపిలో 16 అచ్చులు, 35 హల్లులు మొత్తం 51 అక్షరాలు కదా? అ కారం నుంచి క్ష కారం వరకూ ఉన్న వర్ణాలను “మాతృక” అని అంటారు. ఆ మాతృక ఆధారంగానే మంత్రాలు పుట్టాయి. మంత్రాలకు మూలాలు వేదాలలోనూ, తంత్రం లోనూ ఉన్నాయి.
మంత్రాలు ప్రార్థనలు, కీర్తనలు కావు. మంత్రాలు ఋషుల చేత ఒక నియమిత పద్ధతిలో నిర్మించబడ్డాయి. మంత్రం దేవతకు సంకేతం. ఈ మంత్రాలలో పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ భేదాలున్నాయి. పుంలింగ దేవతలవి పుంలింగ మంత్రాలు. స్త్రీ లింగ దేవతలవి స్త్రీలింగ మంత్రాలు. పుంలింగ మంత్రాలను సౌర మంత్రాలు అని అంటారు. స్త్రీ లింగ మంత్రాలను సౌమ్య మంత్రాలు అంటారు. పుంలింగ, నపుంసక లింగ శబ్ద రూపాలను మంత్రాలు అని అంటారు. స్త్రీ లింగ మంత్రాలను విద్య అని అంటారు. పుంలింగ మంత్రాలు ‘హుం’ లేదా ‘ఫట్’ అని ముగుస్తాయి. స్త్రీ లింగ మంత్రాలు ‘ ‘స్వాహా’ లేదా ‘ఠం’ అని ముగుస్తాయి. నపుంసక లింగ మంత్రాలు ‘నమః” అని ముగుస్తాయి. నమః అని ముగిసే నపుంసక లింగ మంత్రాలో శక్తి ఉండదు. ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని ‘శారదా తిలకం’ లాంటి గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి.
కాలక్రమంలో తప్పులు దొర్లడం అన్నది మంత్రాల విషయం లోనూ జరిగింది. ఏడు కోట్ల మంత్రాలు ఉండేవని తెలుస్తోంది. కానీ మనకు ఇప్పుడు చాలా కొద్ది మంత్రాలు మాత్రమే తెలుస్తున్నాయి. అవీ తప్పులతోనే మనలో చలామణిలో ఉన్నాయి. గాయత్రీ మంత్రం మొదలుకుని ప్రతి మంత్రమూ తప్పులతోనే వాడుకలో ఉంది. మనకు తెలుస్తున్న పలు దేవతల గాయత్రీ మంత్రాలు దోషాలతోనే ఉన్నాయి. గాయత్రీ ఛందస్సు పరకారం ఆ మంత్రం 24 అక్షరాలలో ఉండాలి. కానీ మనం చూస్తున్న గాయత్రీ మంత్రాలన్నీ ఈ నియతిలో లేవు. అంటే వీటికి శాస్త్రీయత లేదు.
జాగ్రత్తగా తెలుసుకోవలసినదేమిటంటే పుంలింగ దేవతల మంత్రాలు హుం లేదా ఫట్ అనే శబ్దాలతోనే ముగియాలి. స్త్రీ లింగ దేవతల మంత్రాలు స్వాహా లేదా ఠం అనే శబ్దాలతోనే ముగియాలి. ఇవాళ మనం
పుంలింగ మంత్రాలను, స్త్రీ లింగ మంత్రాలను నమః అన్న శబ్దంతో ముగిస్తున్నాము. అంటే మనం శబ్దం ద్వారా మంత్రాలను నిర్వీర్యం చేస్తున్నాము అన్నది నిజం. ఇప్పటికైనా మనం తప్పును దిద్దుకోవాలి.
మంత్రం దేవతకు శబ్ద రూపం. మంత్రం దేవతకు సంకేతం. అని గుర్తుంచుకుని మంత్రాన్ని శబ్ద దోషం లేకుండా మనం మననం చేసుకుంటూ అనుసంధానం చేసుకోవాలి.
- రోచిష్మాన్
9444012279
(23/2/2018 న ఆంధ్రజ్యోతి దినపత్రికలో అచ్చైంది)
No comments:
Post a Comment