Friday, January 2, 2026

తెలుగు సూర్యుడు సి. పి. బ్రౌన్

 *తెలుగు సూర్యుడు సి. పి. బ్రౌన్*

*నూర్లార్లు లెక్కచేయక*
*పేర్లెక్కిన విబుధవరుల బిలిపించుచు, వే*
*మార్లర్థమిచ్చు వితరణి* 
*ఛార్లెసు ఫిలిప్పు బ్రౌను సాహెబు కరుణన్*
(బ్రౌన్ సారథ్యంలో వసుచరిత్రకు వ్యాఖ్య రాసిన ములపాక బుచ్చయ్య)

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కేవలం తూర్చిండియా కంపెనీ ఉద్యోగిగానో, కేవల జీతమాత్రోపజీవిగానో బతికి చనిపోయి ఉంటే ఇవాళ ఆయనను గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరమే ఉండేదికాదు. వలస పాలకులనగానే మనకు గుర్తుకు వచ్చేది వాళ్ళ దోపిడీ ఆర్ధిక విధానం. ఆ దోపిడీ విధానం ఇరుకు సందులలోనే బ్రౌన్ ఇరుక్కొని పోయి ఉంటే కూడా మనం ఆయనను ఎప్పుడో చెత్తబుట్టలో పారవేసి ఉండవచ్చు. వలస పాలకులకు సహజమైన జాత్యహంకారం బ్రౌన్ కూడా ప్రదర్శించి ఉంటే ఆయనను ఆనాడే మనం కర్రలతో కొట్టి తరిమేసేవాళ్ళం. ఆయన అలా బతకలేదు గనుకనే మనం ఆయనను తెలుగు సూర్యుడుగా కీర్తించి గుండెల్లో పెట్టుకుని ఉన్నాం.

ఆయనే లేకుంటే మనం ఇవాళ చదువుకుంటున్న ప్రాచీన తెలుగు కావ్యాలు తాటాకులలోనే నిద్రించి శిథిలమైపోయి ఉండేవి. అంతేకాదు అవి చాలాకాలం వరకు అల్ప సంఖ్యాకుల అధీనంలోనే ఉండిపోయేవి. ఆయన తూర్పిండియా కంపెనీ ఉద్యోగిగా, జీతగాడుగా ఉండిపోలేదు. తన జీతంలో పండితులకు జీతమిచ్చి ప్రాచీన కావ్యాలను పరిష్కరింపజేశాడు. వ్యాఖ్యానాలు రాయించాడు. వలసవాదుల అవసరాలకోసమైనా ఆయన తెలుగుభాష వ్యాకరణం గురించి, తెలుగు ఛందస్సును గురించి కృషి చేశాడు. వీరగ్రాంథికం రాజ్యమేలుతున్న సమయంలో వ్యావహారిక భాషను ఉపయోగించాడు. కోస్తాంధ్రలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఉండగా, సిపి బ్రౌన్ తెలుగు ఇంగ్లీషు, ఇంగ్లీషు తెలుగు నిఘంటు నిర్మాణం చేశారు. రాయలసీమను కరువు పీడిస్తుంటే, వలస పాలకుల విధానాలకు భిన్నంగా వాస్తవాలతో నివేదిక పంపాడు. నివేదికలో ఫామిన్ అనే మాట ఉపయోగించి, దానికోసం ఆయన పై అధికారులతో చివాట్లు తిన్నాడు. తెలుగు ప్రజలతో తెలుగు భాషలోనే మాట్లాడడం కంకణం కట్టుకొని అమలు చేశాడు. ప్రాచీన తెలుగు పద్యాలను తెలుగు వాళ్ళే అర్ధం చేసుకోవడం కొంత శ్రమతో కూడిన పనే. అలాంటిది బ్రౌన్ ఆ అప్పటికే ఒక ముందడుగు.

రాగూరు పద్మావతి గారు 'బ్రౌన్ కావ్య సముద్ధరణము' అనే అంశం మీద పరిశోధన చేశారు. ఆమె ఇచ్చిన బ్రౌన్ సేకరించిన గ్రంథాలు పట్టిక చూస్తే ఆశ్చర్యంలో మునిగిపోతాం. తాను సంపాదించిన తాళపత్ర ప్రతులను పరిష్కరించి శుద్ధ ప్రతులను తయారు చేయడానికి బ్రౌన్ కడపలో భవనమే కట్టించి, దాదాపు పన్నెండు మంది పండితులతో పని చేయించారు. జూలూరి అప్పయ్య శాస్త్రి, తాతా చార్యులు, పరవస్తు చిన్నయ సూరి, చెంచయ్య, కంభం నరసింహాచార్యులు, చిలకమర్తి నరసింహాచారి, సముద్రాల నరసింహాచార్యులు, బుచ్చయ్య శాస్త్రి, ఆరణిమఠం వీరభద్రయ్య, గరిమెళ్ళ వెంకయ్య, పఠ్యం పరబ్రహ్మశాస్త్రి, పమిడిపాటి వెంకట నరసయ్య వంటి అనేకమంది బ్రౌన్ తెలుగు ప్రాచీన కావ్య సముద్ధరణ ఉద్యమంలో యోధులుగా పనిచేశారు. ఒక ఉద్యోగికి, తన ఉద్యోగంతో సంబంధం లేని ఇంతటి సాంస్కృతిక నిబద్ధత ఉండడం ఆశ్చర్యం.

బ్రౌన్ ఆధునికుడు గనుక, అప్పటికి తనకు తెలిసిన ఆధునిక పద్దతుల్లో కావ్య పరిష్కరణ చేయించడంలో, వ్యాఖ్యానం రాయించడంలో, తాను రచనలు చేయడంలో ఆధునిక పాశ్చాత్య పద్ధతులను అనుసరించాడు. వాటిని తెలుగువాళ్ళకు పరిచయం 1 చేశాడు. 1829లోనే కావలి వెంకట రామస్వామి, బ్రౌన్ కలిసి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు పునాది వేశారని తె చరిత్రకారులు గుర్తించారు. బ్రౌన్ జీవితచరిత్ర రాసిన డా. కొత్తపల్లి వీరభద్రరావు గారు Throughout his life he prefered the European method of study. Thus C.P.Brown was the first man and perhaps the only notable foreigner who paved the way for the European method of study in Andhra for subse-quent generations of writers and critics to follow అన్నారు.

తాను తెలుగు సాహిత్యరంగంలోకి ప్రవేశించేనాటికి తెలుగు సాహిత్య పరిస్థితి ఎలా ఉండేదో బ్రౌన్ ఒకచోట పేర్కొన్నారు.

When I began these tasks, Telugu Literature was dying out. The flame was just glimmering in the socket. To revive the literature of a language was an arduous task for one man and be a foreigner. ఇలాంటి స్థితినుంచి మన ప్రాచీన తెలుగు కావ్యాలను సంరక్షించాడుగనకనే ఆయనను తెలుగు సూర్యుడు అని గౌరవించాం. ఆయన అనేక రకాల పదవుల్లో పని చేశారు. ఏ పదవిలో ఉన్నా సాహిత్య సముద్ధరణ ఉద్యమానికి విరామం ఇవ్వలేదు.

సాహిత్యానికి ఎంత చేశారో, బ్రౌన్, సామాజికంగా కూడా
అంతే చేశారు. అక్షరాస్యత అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో బ్రౌన్ స్వయంగా పాఠశాలలు స్థాపించి నిర్వహించారు. సతీ సహగమనాలను కూడా జోక్యం చేసుకుని నివారించారని చరిత్రకారులు చెబుతున్నారు. పేదవాళ్లకు ఆర్ధిక సహాయం చేయడం బ్రౌన్ జీవితంలో ఒక భాగమని ఆయన లేఖలు తెలియజేస్తున్నాయి.

తండ్రి డేవిడ్ బ్రౌన్ భారతీయ భాషలను అధ్యయనం చేయమని ఇచ్చిన సలహాతో పాటు, చెన్నైలో చదువు పూర్తయి నప్పుడు ఉద్యోగం వచ్చేముందు మద్రాసు గవర్నర్ థామస్ మన్రో విద్యార్థులకు ఒక సలహా ఇచ్చాడు. 'ప్రజల భాష ప్రజాపాలకులైన మీకు తెలిసి ఉంటే పాలనాపరంగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రజలతో మమేకమై పని చేస్తే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికీ మీరు సారథులవుతారు. ప్రజలతో వారి భాషలోనే మాట్లాడండి. వారి సమస్యలు వినండి. పరిష్కరించండి." అంటూ మన్రో ఇచ్చిన సలహా బ్రౌన్ మీద బలమైన ప్రభావం ముద్ర వేసింది. అప్పటిదాకా పాలనకు సరిపోయే తెలుగు మాత్రమే తెలిసిన బ్రౌన్ తన తెలుగు భాషా సంపదను అభివృద్ధి చేసుకున్నాడు. దాంతో మన భాషా సాహిత్యాలకు చరిత్రాత్మకమైన మేలు చేశాడు. ముప్పై నాలుగేళు ఉద్యోగం చేసే సమయంలోనే గాక, తిరిగి ఇంగ్లాండుకు వెళ్లాక కూడా ఆయన తెలుగును వదిలి పెట్టకుండా కృషి చేశాడు. అది ఆయన తెలుగు భాషా నిబద్ధత.

1798, నవంబర్ 10న కలకత్తాలో పుట్టిన సి.పి.బ్రౌన్, 1817 ఆగస్టు నెల మధ్యలో ప్రభుత్వ ఉద్యోగిగా మద్రాసులో అడుగు పెట్టాడు. 1821లో కడపలో రెండు పాఠశాలలు తెలుగు, హిందూస్తానీలు బోధించడానికి స్థాపించాడు. 1824లో అబేదుబాయ్ రచించిన హిందువులు ఆచారాలు, పండుగలు అనే పుస్తకం చదువుతూ ఒకచోట వేమనను గురించి ఉండడం చూశాడు. వేమనను అన్వేషించడం మొదలుపెట్టాడు. బహుశా అప్పటికి వేమన గతించి 150 ఏళ్ళు అయ్యుంటుంది. వేమన పద్యాలు ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. బ్రౌన్ వేమన పద్య సేకరణ మొదలుపెట్టి 1829లో 693 పద్యాలతో ఒక సంపుటి ప్రచురించాడు. వాటిని ఆంగ్లంలోకి అనువదిం చాడు. అయితే మద్రాసులో ఆ ప్రతులు మురిగిపోయాయి. సమాజంలోకి పోలేదు. అందులో కుట్ర ఉందంటారు. ఆయన పట్టు వదలకుండా మళ్ళీ పదేళ్ళు కష్టపడి ఇంకా ఎక్కువ పద్యాలు సేకరించి 1839లో 1215 పద్యాలకు పైగా రెండవ సారి ప్రచురించాడు. అడివంటుకుంది. వేమన శరవేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాడు. వేమనను గ్రీకు భాషలో లూసియాన్ వంటివాడని వర్ణించాడు బ్రౌన్. అప్పటినుంచి నేటిదాకా వేమన పద్యాలు సంఖ్య ఆరు వేల దాకా పోయింది. పరస్పర విరుద్ధ భావజాలాల పద్యాలు వేమన పేరు మీదే చలామణిలోకి వచ్చేశాయి. వేమన మీద బ్రౌన్ అంత శ్రద్ధ చూపడానికి కారణం వేమన పద్యాల్లోని ప్రజాస్వామిక భావజాలమే. విగ్రహారాధన, మతపరమైన కర్మకాండ, కుల వివక్ష, దొంగ ఆధ్యాత్మికత వంటి అశాస్త్రీయభావ ఖండనే కారణం. రాజాస్థానం నుంచి వెలువడిన కావ్యాలను ఎన్నింటినో బ్రౌన్ పరిష్కరింపజేసి ప్రచురించాడు. వేమన పద్యాల్లోని సామాజికత నచ్చి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. దానిని సహించలేని తిరోగమనవాదులు వేమనలో హిందూ వ్యతిరేకత ఉండడమే బ్రౌన్ లాంటి పాశ్చాత్యులు ఆయనను ఇష్టపడడానికి కారణమని భావించారు. అదే కారణమైతే ఆయన పురాణేతిహాసాలు జోలికి పోయేవాడు కాదు కదా! ఇదలా ఉంచుదాం. బ్రౌన్ జీవించి ఉండగానే 1848లో పుట్టిన వీరేశలింగం పంతులు, అప్పటికే రెండవ ప్రచురణ పొందిన వేమన పద్యాలు అందుబాటులో ఉన్నా, తన సంఘ సంస్కరణ ఉద్యమానికి అవసరమైన ముడిసరుకు వేమనలో ఉన్నా, తన ఆంధ్ర కవుల చరిత్రలో వేమనకు చోటు దక్కకపోవడం ఒక మిస్టరీనే.

సిపి బ్రౌన్ ఆరోజుల్లోనే యాభైవేల రూపాయలు చెల్లించి వేలకొలది తాళపత్ర గ్రంథాలు సేకరించారనీ, చాలా గ్రంథాలు రచించారనీ, అవన్నీ 52 సంపుటాలుగా లండన్ ఇండియా ఆఫీసులో ఉన్నాయనీ, ఆరోజుల్లో బ్రౌన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక్కొక్క సంపుటం నాలుగు వందల పేజీలు గల ఇరవై సంపుటాలు ఉన్నాయనీ ఆచార్య జిఎన్ రెడ్డి గారు తెలియజేశారు. ఆ గొప్ప వ్యక్తి మరణించిన తొంభై ఏళ్ళకు 1975లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య జిఎన్ రెడ్డి గారి అధ్యక్షతలో సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రం మొదలైంది. అందులో బండి గోపాలరెడ్డి పరిశోధనాధి కారిగా చేరారు. ఆయన చాలా కృషి చేసి బ్రౌన్ వాజ్మయం చాలా సంపాదించారు. కొన్ని సంపుటాలు ప్రచురించారు. ఆ క్రమంలో 1976లో ఆచార్య జిఎన్ రెడ్డి, ఆరుద్ర, బంగోరె కడప జిల్లా రచయితల సంఘం సమావేశాలకు హాజరై బ్రౌన్ నివసించిన స్థలాన్ని చూశారు. ఆ తర్వాత జానమద్ది హనుమచ్చాస్త్రి గారి ప్రయత్నంతో 1987 లో బ్రౌన్ మరణించిన 103 ఏళ్ళకు అప్పటి కడప జిల్లా కలెక్టర్ పిఎల్ సంజీవరెడ్డి, తర్వాత వచ్చిన హరినారాయణ గార్ల సహకారంతో సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం పునాది పడింది. అది 당영 ఎదిగింది. మొండిగోడల నుంచి మహాసౌధం హనుమచ్చాస్త్రి కృషి ఆయనను 'బ్రౌను శాస్త్రి'ని చేసింది. కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం రావడంతో ఆ గ్రంథాలయం సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా రూపొందింది. శాస్త్రి గారు బ్రౌన్ ద్విశతాబ్ది ఉత్సవాలు నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికి, ఇన్నాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రౌన్ పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిధిని విస్తరించాలి. బ్రౌన్ రచించిన గ్రంథాలను, సేకరించిన గ్రంథాలను బంగోరె సంపాదించినవి, ఇతరమైనవి సేకరించాలి. ఆ సంస్థను ఒక అకాడమీగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు సూర్యునికి తెలుగు భాషకు అమరుని వంటివ్యక్తి బ్రౌను సరైన నివాళి అవుతుంది.

*రాచపాళెం చంద్రశేఖర రెడ్డి 94402 22117*
( ప్రజాశక్తి దినపత్రిక సాహిత్య అనుబంధంలో ప్రచురితం)

No comments:

Post a Comment