కథ
అతిథి
– కర్లపాలెం హనుమంతరావు
ఆదివారం ఉదయం. వంటింట్లో పెనం మీద దోసెలు కాలుతున్న వాసన ఇంటిని నోరూరిస్తుంది. కిటికీ పక్కన కూర్చున్న చింటూ బయటికి చూస్తూ అన్నాడు.
“నాన్నా… పిల్లి పిట్టను పట్టుకొచ్చింది!”
అతని అరుపుతో అందరూ అటు తిరిగారు.
వాకిటి తలుపు దగ్గర మిన్నీ నోట్లో ఒక చిన్న పిచ్చుక ఉంది. పిట్ట రెక్కలు కొద్దిగా కదులుతున్నాయి. రక్తం కనిపించలేదు.
చింటూ లేచి తలుపు వైపు వెళ్లబోయాడు.
“ఆగు!” అన్నాడు నాన్న.
“నాన్నా… పిచ్చుకను కాపాడాలి!”
“మన చేతుల్లో లేదు. పిల్లి పట్టుకున్న పిట్ట అది. ప్రకృతి పని ప్రకృతిదే.”
“కానీ అది ఇంకా బతికే ఉంది కదా!”
నాన్న ఏదో చెప్పబోయాడు. అంతలో మిన్నీ పిట్టను నోట్లోంచి నెమ్మదిగా కింద పెట్టింది. పాత డోర్‌మ్యాట్ మీద పిట్ట పడిపోయింది. మిన్నీ ఒక్కసారి దాన్ని చూసి, ఏమీ జరగనట్టుగా లోపలికి వెళ్లిపోయింది.
అందరూ తలుపు దగ్గర చేరారు.
పిట్ట కదలడం లేదు. గుండె కొట్టుకున్నట్టుగా ఛాతీ మాత్రం పైకీ కిందికీ కదులుతోంది.
“దీనికి ఎగరడం రాదా?” చింటూ అడిగాడు.
“దెబ్బ తగిలిందేమో,” అంది చెల్లెలు సిరి.
నాన్న కాస్త దూరంగా నిలబడి, “దగ్గరకు వెళ్లొద్దు. భయపెడితే చచ్చిపోవచ్చు,” అన్నాడు.
సిరి మాత్రం వినలేదు. తలుపు కొద్దిగా తెరిచింది.
అంతే.
పిట్ట ఒక్కసారిగా రెక్కలు విప్పి ఇంట్లోకి దూసుకొచ్చింది.
“అయ్యో!” అంటూ నాన్న కేక పెట్టాడు.
పిట్ట హాల్లో చుట్టూ తిరిగింది. సోఫా మీదుగా, టీవీ మీదుగా, చివరికి గోడకు వేలాడుతున్న అమ్మ పెయింటింగ్ దగ్గర కాసేపు ఆగి మళ్లీ ఎగిరింది.
చింటూ, సిరి దాని వెంట పరుగెత్తారు.
అమ్మ చనిపోయి ఆరు నెలలు అయ్యింది. కానీ ఇంట్లో ఆమె తిరుగుతున్నట్లే ఉంది. గోడ మీద ఫొటో, అలమారలో చీరలు, వంటింట్లో ఆమె చేత్తో పెట్టిన పచ్చళ్లు, హాల్లో మూలన ఆమెకు ఎంతో ఇష్టమైన తంబుర... అన్ని గదుల్లో ఆమె అడుగుల సవ్వడులే.
ఆ రోజు అమ్మ జ్ఞాపకార్థం గోదావరి ఒడ్డుకు వెళ్లి ఆమె అస్థికలు కలపాలని నాన్న నిర్ణయించాడు.
“సంప్రదాయం మానకూడదు,” అని నాన్న ఉద్దేశం.
కానీ పిట్ట మాత్రం బైటకు వెళ్లడం లేదు.
మధ్యాహ్నం అందరం గోదావరి ఒడ్డుకు వెళ్ళారు.
అమ్మకు నీళ్లంటే చాలా ఇష్టం. వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగితే అందరం భయపడుతుంటే, ఆమె మాత్రం ఒడ్డున నిలబడి చూస్తూ ఉండేది గంభీరంగా. “నీళ్లు ఎటు వైపు ప్రవహించినా చివరికి సముద్రానికే కదా చేరతాయి,” అనేది.
నాన్న ఆమె చితాభస్మం ఉన్న చిన్న కలశాన్ని చేతిలో పట్టుకున్నాడు.
“ఒక్కొక్కరు కొంచెం కొంచెం తీసుకుని నీళ్లలో కలపండి,” అన్నాడు.
చింటూ చేతిలోకి వచ్చిన తెల్లటి పొడిని చూసాడు. “ఇది అమ్మేనా?”
నాన్న ఏమీ మాట్లాడలేదు.
సిరి కన్నీళ్లు తుడుచుకుంది.
చింటూ వేళ్ల మధ్య ఉన్న ఆ పొడిని నెమ్మదిగా నీటిలోకి వదిలాడు. “అమ్మకు ఈత వచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది ?” అని తండ్రిని అడిగాడు. బదులు లేదు. ఆయన విన్నాడో లేదో తెలియదు.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిట్ట ఇంకా హాల్లోనే ఉంది.
అమ్మ తంబుర మీద కూర్చుంది. చిన్న తల అటూ ఇటూ తిప్పుకుంటోంది.
“ఇది ఇంకా ఎందుకు పోలేదు?” అన్నాడు నాన్న చిరాకు దాచుకుంటూ.
“దీనికి మన ఇల్లు నచ్చింది కాబోలు ,” అంది సిరి.
“పిట్టలకు ఇల్లు ఉండదు.” అన్నాడు నాన్న.
“అమ్మకు ఉండేదా?”సిరి ఎదురు ప్రశ్న.
నాన్న ఒక్కసారిగా నిశ్శబ్దమయిపోయాడు.
చింటూ సిరివైపు చూశాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.
కొద్దిసేపటి తర్వాత నాన్న వంటగదిలోంచి కొంచెం బియ్యం, నువ్వులు తీసుకొచ్చి నేలమీద చల్లాడు.
“అతిథి వచ్చింది కదా. ఆకలితో పంపకూడదు.”
నాన్న మాటలకు చింటూ నవ్వాడు.
“ప్రకృతి పని ప్రకృతే చేస్తుందని ఇప్పుడే అన్నావు కదా నాన్నా !”
నాన్న నిదానంగా తల పంకించి అన్నాడు, “ప్రకృతికి మనకన్నా ఎక్కువ పనులుంటాయి. మన పని మనమే చేసుకోవాలి.”
పిట్ట కిందికి దిగి రెండు గింజలు తింది. మళ్లీ తంబుర మీదికి వెళ్లి కూర్చుంది.
ఆ రాత్రి కూడా అది ఇల్లు కదల్లేదు. నిద్రపోయే ముందు సిరి, చింటూ మంచం మీదికి వచ్చి కూర్చుంది.
“చింటూ !…”
“ఏంటి సిరీ ?”
“ఈ పిట్ట అమ్మ ఏమో?”
చింటూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. “అమ్మ అయితే మనల్ని గుర్తుపడుతుంది కదా.”
“గుర్తుపట్టకపోతే?”
“అమ్మ మనల్ని మర్చిపోదు.”
“ఎలా చెప్తావు?”
చింటూ సమాధానం చెప్పలేక పోయాడు.
పిట్ట రెక్కలు కొట్టుకుంటూ పిల్లల వంకే చూస్తోంది.
సిరి ముఖం నిండా దుప్పటి కప్పేసుకుంది.
మర్నాడు రాత్రి పడుకునే ముందు చింటూతో అంది సిరి, “నాకు రాత్రి కల వచ్చింది. అమ్మ పిట్టలా మనింటికి వచ్చిందంట.”
“అమ్మ ఏం చెప్పింది?”ఆత్రుతగాఅడిగాడు చింటూ
“గుర్తులేదురా.” అని పెదాలు చప్పరించింది సిరి.
ఇద్దరూ కాసేపు చీకట్లో మాట్లాడకుండా పడుకుండిపోయారు.
మరుసటి రోజు పొద్దున ఇంట్లోకి చల్లగాలి దూసుకొచ్చింది. నాన్న రాత్రి హాల్లో కిటికీలన్నీ తెరిచే ఉంచాడు కాబోలు. .
చింటూ మెట్ల మీద నుంచి కిందికి వచ్చాడు.
తంబుర ఖాళీగా ఉంది.
“సిరీ! పిట్ట లేదు!”
పిల్లలు ఇద్దరూ కిటికీ దగ్గరికి పరుగెత్తారు.
పిట్ట ఎక్కడా కనిపించలేదు.
నాన్న కూడా వచ్చి చూశాడు. “వెళ్లిపోయింది కాబోలు .”
సిరి ఒక్కసారిగా దిగాలు బడింది. “మనకి చెప్పకుండా ఎట్లా వెళ్ళింది నాన్నా ?”
ఎక్కిళ్ళు దిగమింగుకుంటూ అడిగిన సిరి ఎత్తుకుని కన్నీళ్ళు తుడుస్తూ అనునయంగా అన్నాడు నాన్న “అతిథులు చెప్పి రారు గదా తల్లీ! అలాగే వెళ్ళే ముందు చెప్పరు. అట్లాగని ఏడిస్తే ఎట్లా?"
ఉబికే కన్నీళ్ళను ఆపుకుంటూ వంటగది తలుపు దగ్గర కూర్చుని బయటికి చూస్తోన్న మిన్నీ దగ్గరకు వెళ్లి అడిగాడు చింటూ “నిన్న నువ్వే కదా బుల్లి పిచ్చుకను తీసుకొచ్చింది…?”
మిన్నీ తోక ఊపింది.
అప్పుడే బయట గుమ్మం దగ్గర పిట్టల కిలకిల వినిపించింది.
సిరి పరుగెత్తి తలుపు తెరిచింది.
వాకిట్లో రెండు పిచ్చుకలు కూర్చున్నాయి. ఒకటి ఎగిరిపోయింది. ఇంకొకటి మాత్రం కాసేపు ఇంట్లోకి చూసి, రెక్కలు టపటపలాడించింది .
“అన్నయ్యా… అది మళ్లీ వచ్చింది!”
చింటూ బలవంతాన నవ్వాడు. “ఇది అది కాదు సిరీ… దాని అమ్మ అయి ఉంటుంది!”
“అది మన అమ్మ కదా! మరి మన అమ్మకూ అమ్మ ఉంటుందా?”
సిరి ప్రశ్నకు చింటూ దగ్గర సమాధానం ఏమీ లేదు.
నాన్న మాత్రం వంటింటి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉండిపోయాడు.
అతని కళ్లలో నీళ్లు కనిపించాయి. సిరి అది చూసి అడిగింది—
“నాన్నా… నన్ను ఏడవద్దన్నావు గదా! మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు?”
నాన్న వెంటనే ముఖం తిప్పుకున్నాడు. “ఉల్లిపాయలు కోశానురా తల్లీ.”
సిరి చుట్టూ చూసింది. వంటింట్లో ఎక్కడా ఉల్లిపాయలు కనిపించలేదు!
***
08-09-2026
No comments:
Post a Comment