ఉచితానుచితాలు
ఉచితం అంటే సరైనదని, అనుచితం అంటే సరైనది కాదని అర్థం. ఉచితం అంటే ఎలాంటి ఖర్చూ పెట్టుబడి లేకుండా ఊరికే వచ్చేదని మరో అర్థం కూడా ఉంది. తమ కాళ్లపై తాము నిలబడగలిగే స్థితికి చేరే వరకు పిల్లలకు పెద్దలు సహకరిస్తుంటారు. అది ఉచితం. దాన్ని ఆశించడం కూడా ఉచితమే. ఏ ప్రతిఫలం ఆశించకుండా పిల్ల లకు సహాయసహకారాలు అందించడం తమ బాధ్యతగా పెద్దలు భావిస్తుంటారు. స్వతంత్రంగా జీవించగలిగే స్థాయికి ఎదిగే వరకు ప్రతి జీవికి ఉచితంగా సహకరించే గుణం ప్రకృతిది. సృష్టి కొనసాగడానికి అది అవసరం. దాని ఆసరాగా స్వశక్తితో జీవిం చగల స్థితికి చేరాక సైతం ఉచితాలను ఆశించడం అనుచితం. తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించేవారే పరుల నుంచి, పరమాత్మ నుంచి ఏదైనా ఆశించడానికి అర్హులు.
తన శక్తికి తగినది సమర్పించిన తరవాతే మరేదైనా స్వీకరించడం ఉచితం. అప్పుడే ప్రకృతి ధర్మంతో సమన్వయం సాధించి జీవించినట్లు అవుతుంది. పశు పక్ష్యాది మూగ జీవులతో సహా మానవుడు కూడా ప్రకృతిలో భాగమే. ప్రతి ప్రాణీ ప్రకృతి నుంచి ఏదో ఒక రూపంలో తన జీవితానికి అవసర మైంది గ్రహించి తిరిగి మరొక రూపంలో ఇస్తుంటుంది. అనుభవ జ్ఞానంతోనే మని షికి ఉచితానుచితాల గురించి విశ్లేషించగల వివేకం కలుగుతుంది. అవకాశం వచ్చినా అవసరమైన మేరకే స్వీకరించడం వివేక వంతుడి లక్షణం. అప్పుడే పరులకు సైతం దాన్ని పొందే అవకాశం కలుగుతుంది. అవకాశ దుర్వినియోగం తన ధర్మానికి విరుద్ధమని మనిషి గ్రహించినప్పుడే దానిపై కలిగే అత్యాశను నిగ్రహించుకో వడం సాధ్యమవుతుంది. పరుల శ్రేయస్సు దృష్ట్యా అవసరాలను నియంత్రించుకోవడం దేశ భౌతిక ప్రగతికే కాదు, ఆధ్యాత్మిక ప్రగ తికి కూడా తోడ్పడుతుంది. భగవంతుడు లోకబాంధవుడు. లోకంలో అందరూ ఆయ నకు బంధువులే. ఎవరికి, ఏది, ఎంతవరకు యోగ్యత ఉన్నదో అంతవరకే లభ్యమ య్యేలా చేయడమే ఆయన ప్రణాళిక. కర్తవ్య నిర్వహణే యోగ్యతను నిర్ధారిస్తుంది. అనుచితమైన కర్మల వలన ఉచితమైన వనరులను పొందే యోగ్యతను కోల్పోవచ్చు. ఆదిలో భగవద్దత్తమై ఉచితంగా లభించే వాటిని సద్వినియోగం చేసుకుంటేనే జీవి తాన్ని సఫలం చేసుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఆనందదాయకం చేసుకోవచ్చు.
అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమమైనదని పెద్దల వాక్కు. దాని ఉన్నతికి ప్రతిబంధకాలైన అంతఃశత్రువులలో ఒకటైన లోభత్వమే ఖర్చు పెట్టకుండా ఉచితంగా పొందాలనే గుణానికి మూలం. ఆ ప్రభావాన్ని దివ్యశక్తి ఆసరాతో జయిస్తూ ముందుకు సాగడం మనిషి సాధించాల్సిన ప్రజ్ఞ. దాన్ని పరీక్షగా భావించి అదుపులో ఉంచితే జీవనధ్యేయం సుసాధ్యమవుతుంది. ఆనందం అరచేతిలో ఉంటుంది. అంటే చేసిన సత్కర్మను అనుసరించి ఉంటుంది. స్వయంకృషి లేకుండా ఉన్నతిని వాంఛించడం ధర్మం కాదు. తమ జీవన ధర్మాన్ని ప్రకృతి ధర్మంతో సమన్వయ పరచినవారికి మహాభాగ్యమైన ఆరోగ్యం ఉచితమవుతుంది.
దువ్వూరి రామకృష్ణ వర ప్రసాదు
No comments:
Post a Comment