ఇది కథ కాదు
సి.ఎన్.చంద్రశేఖర్
(9490050214)
ఉత్తరం చివర సంతకం పెట్టబోతున్న సమీర- తలుపు తెరచుకుని గదిలోకి వచ్చిన వార్డెన్ కాత్యాయనిని చూసి ఉలిక్కిపడి, ఉత్తరాన్ని మంచం మీదున్న దుప్పటి క్రింద దాచేసింది.
"ఏమిటి దాస్తున్నావు? ఏదీ...చూపించు!" తీక్షణంగా సమీర వైపు చూస్తూ అంది కాత్యాయని.
"మా నాన్నకు రాసిన ఉత్తరం మేడం!" భయంభయంగా చూస్తూ అంది సమీర.
"నాన్నకు రాసిందా? బాయ్ ఫ్రెండ్ కు రాసిందా? ఏదీ..ఇటివ్వు!"
"నాన్నకు రాసిందే మేడం...ప్రామిస్!"
"నాన్నకు రాసిందే అయితే నాకు చూపడానికి భయమెందుకు?
"అదీ..అదీ...పర్సనల్ విషయం మేడం!"
కాత్యాయని ఓ క్షణం ఆలోచించింది...'సమీర మంచి అమ్మాయి, అమాయకురాలు. పైగా ర్యాంకు హోల్డర్. ఆమెని ఇబ్బంది పెట్టడం బాగుండదు ' అనుకుని
"సరే..వస్తా..తలుపేసుకో!" అంటూ కదిలింది.
మళ్ళీ 'సమీర అమాయకురాలే కావచ్చు. ఇలాంటివాళ్ళను వలలో వేసుకోవాలనుకునే వేటగాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వలలో ఈమె చిక్కుకుని ఉంటే? ' అన్న ఆలోచన వచ్చి, వెనక్కి తిరిగి-
"నేను మొదటి వాక్యం మాత్రం చదివి ఇచ్చేస్తాను...ఆ ఉత్తరం తీసుకురా!" అంటూ కుర్చీలో కూర్చుంది కాత్యాయని.
సమీర భయంభయంగా ఉత్తరాన్ని సగం మడిచి కాత్యాయని చేతికిచ్చింది.
"ప్రియాతిప్రియమైన నాన్నకు...' అన్న సంభోదన చూడగానే-
"సారీ...నిన్ను ఇబ్బంది పెట్టాను!" అంటూ ఉత్తరం తిరిగి ఇవ్వబోతున్న ఆమెకు- మడతకు మరోవైపు పెద్ద పెద్ద అక్షరాలతో "నేను చచ్చిపోతున్నాను నాన్నా!" అన్న వాక్యం కనిపించింది.
"ఏమిటమ్మా...నువ్వు చచ్చిపోదామనుకుంటున్నావా?" ఆశ్చర్యంగా అడిగింది సమీరని.
Vసమీర ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడవసాగింది.
కాత్యాయని "కాస్త ఆగు!" అని విసుక్కుని, తర్వాత ఉత్తరాన్ని చదవసాగింది.
"ప్రియాతి ప్రియమైన నాన్నకు.. నీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం నాన్నా. అక్షరాభ్యాసం నుంచి సంస్కారాభ్యాసం వరకూ నా వెనకే ఉండి నడిపించావు. నీ ప్రోత్సాహం వల్ల నేను టెన్త్ లో స్కూల్ ఫస్ట్, ఇంటర్ లో కాలేజి సెకండ్ వచ్చాను. కలెక్టర్ అవ్వాలన్న ధ్యేయంతో ఈ కాలేజీలో బి.ఏ. చేరాను.
సాఫీగా సాగిపోతున్న నా జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చారు ఇద్దరు యమదూతలు. వారి పేర్లు...సురేంద్ర, ఫణీంద్ర!
నన్ను అనుక్షణం వెంటాడారు. ఓ రోజు ప్రేమ అంటారు. ఓ రోజు తమతో రమ్మంటారు. ఏసిడ్ పోస్తామంటారు. ప్రిన్సిపాల్ తో చెబితే చంపేస్తామంటారు. నేను భయంతో వణకిపోయేదాన్ని. మీతో చెప్పి మిమ్మల్నీ బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు.
నా గుండె పగిలే మరో విషయం...ఈరోజు నాకు తెలిసింది.
ఎలా చేశారో తెలియదుగాని- నా బాత్రూంలో కెమెరా పెట్టారు. నేను స్నానం చేస్తూంటే వీడియో తీశారు. తమ కోరిక తీర్చమనీ, లేకుంటే ఆ వీడియో ఇంటర్నెట్ లో పెడతామనీ బెదిరిస్తున్నారు.
ఆ వీడియో బయటికి వస్తే నేను తలెత్తుకు తిరగలేను. వాళ్ళకు లొంగిపోవడం కంటే చచ్చిపోవడమే మేలు! అందుకే నేను చచ్చిపోతున్నాను నాన్నా!
నేను కలెక్టర్ కావాలన్న మీ ఆశల్ని ఆవిరి చేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. కానీ ఆడపిల్లగా మాత్రం కాదు నాన్నా! ఈ సమాజంలో మనశ్శాంతిగా బ్రతికే అదృష్టం ఆడపిల్లలకు లేదు. నేటి స్త్రీ మనుషుల మధ్య బ్రతకడం లేదు...కామాంధుల మధ్య బ్రతుకుతూంది. కెమెరా కళ్ళ మధ్య భయంభయంగా బ్రతుకుతూంది. బస్సులో నిలబడ్డా, ట్రైన్లో పడుకున్నా, చెప్పు తెగి వంగినా, రోడ్డుపై నడిచినా..కెమెరాల్లో బందీ అవుతూంది. అంతర్జాలంలో దర్శనమిస్తూంది.
మిమ్మల్నీ, అమ్మనీ తలచుకుంటూంటే నాకు ఏడుపొస్తూంది నాన్నా! ధైర్యంగా ఉండండి నాన్నా. అమ్మకు ధైర్యం చెప్పండి!
శెలవు నాన్నా..
క్షమాపణలతో-
మీ...సమీర.
ఉత్తరం చదవడం పూర్తి చేసిన కాత్యాయని కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
"జరిగింది చిన్న విషయం కాదు. కాని, సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా చనిపోవాలనుకోవడం తప్పమ్మా!" అంది సమీరతో.
సమీర భోరున ఏడవసాగింది.
"ఏడవకమ్మా! నీవు ఉత్తరంలో రాసినట్లు ఆడపిల్ల జీవితం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నీ వయసువాళ్ళే కాదు, మా వయసువాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సమాజంలో నెలకొని ఉంది. నీ సమస్యకు పరిష్కారం నేను కనుక్కుంటాను. నీవు మాత్రం ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాటివ్వు!" అంది కాత్యాయని చెయ్యి చాపుతూ.
ఏడుస్తూనే కాత్యాయని చేతిలో చెయ్యి ఉంచింది సమీర.
"ఈ రాత్రి నా గదిలోనే పడుకుందువుగాని...పద!" అంటూ బయటకు నడిచింది కాత్యాయని.
ఆరాత్రి-చాలాసేపటివరకు కాత్యాయనికి నిద్ర పట్టలేదు.
సమీరకు అభయమైతే ఇచ్చింది కాని- ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆమెకు అర్థంకాలేదు. తర్వాత ఆమెకు తన స్నేహితుడు విశ్వం గుర్తుకొచ్చాడు.
'విశ్వం మంచి రచయిత. తను ఏది పాటిస్తాడో..అదే తన రచనల్లో రాస్తాడు. పైగా అతనికి ఊర్లో మంచి పలుకుబడి ఉంది. అతనికి విషయం చెప్పి సలహా తీసుకుంటే మంచిది!' అనుకుంది.
* * * *
హాస్టల్ ఆఫీసు గుమ్మం దగ్గర నిలబడి 'మే ఐ కమిన్?" అన్న విశ్వం వైపు చూసి-"లోపలికి రావడానికి నీకు కూడా పర్మిషన్ కావాలా?" అంది కాత్యాయని నవ్వుతూ.
"అమ్మాయిల హాస్టల్ కదా...కొన్ని హద్దులు ఏర్పరచుకుంటేనే మంచిది!" అంటూ వచ్చి కాత్యాయని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విశ్వం.
విశ్వం వైపు మెచ్చుకోలుగా చూసింది కాత్యాయని.
'ప్రతి మగవాడూ విశ్వంలాంటి సంస్కారవంతుడైతే స్త్రీలు నిర్భయంగా,మనశ్శాంతిగా బ్రతకవచ్చు!' అనుకుంది మనసులో.
"ఊరక పిలవరు మహానుభావులు!" అన్నాడు విశ్వం నవ్వుతూ.
"ఔను....పనుండే పిలిచాను!" అంటూ ప్రక్కన ఉన్న సమీరను అతనికి పరిచయం చేసి, జరిగిన విషయం చెప్పింది.
"ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నావా?" అని సమీరను అడిగాడు విశ్వం.
"ఇది చిన్న విషయమా అంకుల్...ఆ వీడియో బయతపడితే నేను ఎలా తలెత్తుకు తిరగను?"
"నువ్వేం దొంగతనం చెయ్యలేదు, హత్య చెయ్యలేదు....స్నానం చేశావు. అది తప్పు కాదే! నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వీడియో తియ్యడం వాళ్ళ తప్పు. వాళ్ళు చేసిన తప్పుకు నువ్వెందుకు చనిపోవాలి? ఆ వీడియో బయటికి వస్తే, పది మంది చూస్తే నీకు ఎంబరాసింగ్ గా ఉంటుంది. ఆ విషయం నేనూ ఒప్పుకుంటాను. అప్పుడు నువ్వు ఇక్కడ చదివే బి.ఏ. ఇంకో ఊరెళ్ళి చదువు! చావడం కంటే ఇలా చెయ్యడం నయం కదా?"
"ఇంటర్నెట్ ప్రపంచమంతా ఉంటుంది అంకుల్!"
"ఆ వీడియో ఇంటర్నెట్ లో పెట్టేవాళ్ళు నీ చిరునామా రాసి మరీ అప్లోడ్ చేస్తారా? గతంలో నీలిచిత్రాల్లో నటించిన ఒకావిడ రూటు మార్చుకుని బాలీవుడ్ చిత్రాల్లో నటించసాగింది. ఇప్పుడు ఆవిడ ఓ సెలెబ్రిటీగా మారింది. మరి ఏ తప్పూ చేయని నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. మనిషి మనిషికీ ఆలోచనల్లో ఎంత తేడా ఉందో చూశావా? ఎన్ని కష్టాలొచ్చినా ఓ వ్యక్తి ఎదుగుతాడు. అవే కష్టాలు వచ్చిన మరో వ్యక్తి క్రిందకి జారిపోతాడు. విజయానికీ,అపజయానికీ తేడా..కేవలం ఆలోచనలే!"
సమీర ఆసక్తిగా వింటూండిపోయింది.
"నీ సమస్య గురించి మీ అమ్మానాన్నలకు చెప్పావా?" విశ్వం అడిగాడు.
"లేదు అంకుల్. వాళ్ళు చాలా సున్నిత మనస్కులు. ఇలాంటివి వింటే తట్టుకోలేరు."
"మరి నువ్వు చనిపోతే వాళ్ళు ఆ విషయం విని తట్టుకోగలరా? ఇలాంటి విషయాలు మొదట తల్లితండ్రులతోనూ, తర్వాత ప్రిన్సిపాల్, లెక్చరర్లకూ తప్పనిసరిగా చెప్పాలి. ప్రపంచం గురించి మీకంటే వారికి ఎక్కువ తెలుసు. వారికున్న జీవితానుభవంతో మంచి పరిష్కారాన్ని సూచించగలరు."
"అయినా చదువుకునే పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? సెక్స్ తప్ప ఇంకో విషయం పట్టదా వీళ్ళకి? జాలి,కరుణ, నైతిక విలువలు అక్కర్లేదా వీళ్ళకి?" -ఆవేదనగా అడిగింది కాత్యాయని.
"కాలేజీలో విద్యార్థుల కళ్ళముందు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. వాటికి చలించకుండా తాము కాలేజీకి ఎందుకొచ్చామో తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు జీవితంలో స్థిరపడతారు. చలించి వక్ర మార్గాన ఆలోచించేవారు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఉదాహరణకు బ్యాంకులో పనిచేసే ఉద్యోగుల కళ్ళముందు కోట్ల రూపాయలు ఉంటాయి. అయినా చలించకుండా పనిచేసుకునేవాడు ఉద్యోగంలో ఉంటాడు. చలించి చేతివాటం చూపించినవాడు జైల్లో ఉంటాడు. అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు జరిగేది కూడా ఇదే!"
"నిజమే. ఇంతకూ ఈ అమ్మాయి విషయంలో నీవు ఏమి ఆలోచించావు?" అని అడిగింది కాత్యాయని.
"ఈ ఏరియా ఏ.ఎస్.పి. రామ్మోహన్ నాకు మంచి మిత్రుడు. దొంగతనం చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడేమో గాని-అమ్మాయిలను వేధించేవాళ్ళను మాత్రం తాట ఒలుస్తాడు. సమీరకు ఇబ్బంది కలగకుండా ఈ కేస్ దీల్ చెయ్యమని అతనితో చెబుతాను.." అన్నాడు విశ్వం.
తర్వాత సమీర వైపు తిరిగి "చూడమ్మా..కొన్ని సమస్యలొస్తే కొందరు ఏవేవో ఊహించుకుని భయపడతారు, మనశ్శాంతి లేకుండా గడుపుతారు. నీలాంటి కొంతమంది ఆత్మహత్యాప్రయత్నం కూడా చేస్తారు. అయితే సమస్యలు చాలాసార్లు సులభంగా పరిష్కారమవుతాయి. నువ్వు కూడా భవిష్యత్తులో కలెక్టర్ అయి 'ఆరోజు ఆత్మహత్య చేసుకునిఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని కాదు కదా! ' అని అనుకుంటావు!" అన్నాడు విశ్వం నవ్వుతూ.
విశ్వం వెళ్ళిపోయాక "ఆ అంకుల్ మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి!" అంది సమీర కాత్యాయనితో.
* * * *
విశ్వం ఇంటికి వచ్చిన కాత్యాయని,సమీరలను విశ్వం భార్య జయంతి సాదరంగా ఆహ్వానించింది.
హాల్లోకి వచ్చిన విశ్వంతో " ఏం విశ్వం! పార్టీ అని పిలిచావు. మీ శ్రీమతి పుట్టినరోజా లేక మీ పెళ్ళిరోజా?" అని అడిగింది కాత్యాయని.
"రెండూ కాదు...చెడుపై విజయం సాధించినందుకు! సమీర సమస్య పరిష్కారమైనందుకు!"
సమీర ముఖం ఆనందంతో వికసించింది.
"ఎలా?" అంది కాత్యాయని ఆశ్చర్యంగా.
"కూర్చోండి...చెబుతాను.
"రామ్మోహన్ వాళ్ళిద్దరినీ సెల్ లో వేసి పోలీస్ ట్రీట్ మెంట్ రుచి చూపించడం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళు అన్నీ ఒప్పేసుకున్నారు. నిజానికి వాళ్ళు హాస్టల్ లో పనిచేసే ఓ వ్యక్తి ద్వారా వీడియో తీయడానికి ప్రయత్నించారు. కానీ రికార్డింగ్ ఫెయిల్ అయింది. అందువల్ల ఏవో వెబ్ సైట్లనుండి డౌన్లోడ్ చేసుకున్న దృశ్యాల్ని సమీరకు చూపి భయపెట్టారు. సమీర అమాయకురాలు కాబట్టి వాటిని పరిశీలించకుండానే నమ్మేసింది. వీడియో గురించి ఆరోజే సమీరను అడగాలనుకున్నాను. తను ఇబ్బంది పడుతుందని అడగలేదు. ఇకపై వాళ్ళు ఏ అమ్మాయి జోలికీ వెళ్ళరు. సమీర జోలికి అసలు రారు."
"ఒకవేళ వాళ్ళు పోలీసులకు వేరే వీడియోలు చూపించి,తర్వాత ఎప్పుడైనా సమీరపై తీసిన వీడియో బయటపెడితే?" అనుమానం వ్యక్తం చేసింది కాత్యాయని.
"ఇక్కడ నా రచయిత బుర్ర ఉపయోగించాను. వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టి వీడియో తీశాము. సమీర వీడియో ఏదైనా బయటకు వస్తే ఈ వీడియో యూట్యూబ్ లో పెడతామని బెదిరించాము.వాళ్లకు సహకరించడానికి ప్రయత్నించిన మీ హాస్టల్ ఉద్యోగి ఎవరో తర్వాత చెబుతాను. అతన్ని హాస్టల్ నుంచి పంపేయండి. అటువంటి వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే."
"అందుకే ఈ బాధ్యత నీకు అప్పజెప్పాను. థాంక్యూ సో మచ్!" అంది కాత్యాయని.
సమీర విశ్వం కాళ్ళమీద పడింది.
విశ్వం ఆమెను లేవనెత్తి "ఇక హాయిగా చదువుకో! నా ఫోన్ నంబర్ ఇస్తాను. నువ్వు కలెక్టర్ కాగానే నాకు ఫోన్ చెయ్యాలి!" అన్నాడు.
పదేళ్ళ తర్వాత సమీర విశ్వంకు ఫోన్ చేసింది...'కలెక్టర్ 'హోదాలో.
* * * *
*(సోమేపల్లి జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ )*