మందు తాగిన గంట తర్వాత
మందు తాగాక ఓ పదినిమిషాల్లోనే మనిషికి మత్తు తెలిసిపోతుంది. మనసుకి మత్తు తెలుస్తోంది అంటే, మన రక్తంలో ఆల్కహాల్ నిల్వలు పెరిగిపోయాయని అర్థం. ఇలా ఓ గంటా గంటన్నర గడిచిన తర్వాత శరీరంలోని ప్రతి అవయవమూ ప్రభావితం అవుతుంది. అదెలాగంటే...
కిడ్నీలు
మద్యానికి diuretic అనే స్వభావం ఉంది. అంటే మన ఒంట్లోని నీటిని నిలవ ఉంచకుండా బయటకు పంపేస్తుందన్నమాట. దీనివల్ల నీటిలో పాటుగా శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మనిషి నీరసించిపోతాడు. అతని మెదడులోని నీటిశాతం కూడా తగ్గిపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది.
మెదడు
ఆల్కహాల్ మెదడు మీద చాలా తీవ్రంగా పనిచేస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. అలాంటి స్థితిలో మనిషి ఎంతటి ఉన్మాదానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉంటాడు. మెదడులోని వేర్వేరు వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. మందు తాగిన వెంటనే కొందరు వాంతులు చేసుకోవడానికి కారణం ఇదే!
లివర్ (కాలేయం)
లివర్ ఒంట్లోని చెడు పదార్థాలను వేరుచేసే ఫిల్టర్లాగా పనిచేస్తుంది. అందుకే శరీరంలోకి మద్యం చేరగానే లివర్ మీదే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి క్రమేపీదాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకోసారి లివర్ పూర్తిగా దెబ్బతినేదాకా ఈ వ్యాధి ఉందని బయటపడదు. వ్యాధిని గుర్తించే సమయానికి అది చేతులు దాటిపోయి ఉండవచ్చు!
ఊపిరితిత్తులు
మన ఊపిరి తీసుకునేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తులు చాలా జాగ్రత్తగా పనిచేస్తాయి. కానీ రక్తంలోని అల్కహాల్ మోతాదు దాటినప్పుడు ఈ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా పొలమారడం, వాంతులు లాంటి సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తులలోని కఫం పేరుకుపోయి న్యుమోనియా వంటి రోగాలకు దారితీయవచ్చు.
జీర్ణవ్యవస్థ
మద్యం మన పేగులలోని పైపూతని దెబ్బతీస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్, అల్సర్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు కూడా సరిగ్గా ఒంటికి పట్టవు.
పాంక్రియాస్
మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని చూసుకునే అవయవం పాంక్రియాస్. మద్యం మోతాదు మించినప్పుడు ఈ పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని షుగర్ నిల్వలు ఒక్కసారిగా పడిపోతాయి. చేతులు వణకడం, చెమటలు పట్టడం, కళ్లు అదేపనిగా తిరగడం లాంటి సమస్యలు ఇలా వచ్చేవే! ఆలస్యం చేస్తే మెదడు కూడా దెబ్బతింటుంది.
నాడీవ్యవస్థ
మందు పుచ్చుకున్న కాసేపటికి చేతులూకాళ్లూ తిమ్మర్లు ఎక్కడం, మాట తడబడటం, తూలిపోవడం లాంటి లక్షణాలు గ్రహించవచ్చు. ఇదంతా కూడా మన నాడీవ్యవస్థ మీద ఆల్కహాల్ చూపే ప్రభావమే! మందు తాగాక ఎట్టిపరిస్థితుల్లోనూ బండి నడపకూడదని చెప్పేది కూడా ఇందుకే!
No comments:
Post a Comment