తెలివంటే ... ?
ఆమె ఐఐఎం లో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూ లో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది . ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది . తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది . పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి . అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్ లో ఉంది. ఇక జీవితం లో పెళ్లిచేసుకోను అంటోంది .
మరో చోట మరో అమ్మాయి . అమెరికా లో అత్యున్నత సంస్థ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది . ఈమె సంపాదన పై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి చిత్రయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది .
మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని { మరి కొన్ని కారణాలు } ఆత్మ హత్య చేసుకొన్నాడు .చదువు సంధ్య లేని వారు యు ట్యూబ్ వీడియో లు చేస్తున్నారు { అంటే యూట్యూబ్ చేసేవారందరూ అలాంటి వారు అని కాదు } . నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియో లు ఏంటి ? అంతకు మించి వీడియో ల కు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియక పోవడం .. పోనీ రాలేదు . అదే జీవితం అనుకొని తనువు చలించడం . ఏంటిది ?
లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే !
కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం . ఒక సారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం . అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని తనకు కంపెనీ ఇచ్చిన షేర్ ల ని అని తెలుసుకోలేని అమాయకత్వం .. ఏంటివన్నీ?
ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మానేజ్మెంట్ , మెడికల్ సైన్స్ , ఇంజనీరింగ్ , మాథ్స్ లాంటి సబ్జెక్టు ల లో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు . సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్ . భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్ .
శ్రీదేవి . ఒక నాటి యువకుల కళల రాణి . అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని, అప్పుల్లో ఇరుక్కొని చిత్రవధ అనుభవించి చివరకు ఇన్సూరెన్సు అమౌంట్ కోసం ప్రాణాలు పోగొట్టుకొనే స్థితి . సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది . తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు ?
చాల మందికి అర్థం కాని విషయం ఒకటుంది . తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పై పట్టుసాధించి మార్కు లు ర్యాంకు లు కొట్టడం కాదు .
మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు . కాలేజి ఎగ్గొట్టి జులాయి లా బలాదూర్ తిరిగేవాడు . కాలేజీ లో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్క్ లైతే, ఆ జులాయి కాంట్రాక్టర్ గానో బిజినెస్ మాన్ గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు . కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది . ఆలోచించండి . ఇదెలా సాధ్యం ?
సోషల్ ఇంటలిజెన్స్ .. సామజిక తేలితేటలు . ఎమోషనల్ ఇంటలిజెన్స్ .. భావోద్వేగ తెలివితేటలు.
ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే . ఎలాగంటారా ?
మార్కు లు , జీతం , సంపద ఇవన్నీ లక్షల్లో . సామజిక తేలితేటలు జీరో . ఇప్పుడు ఈ జీరో తో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది ? బండి సున్నా . అవునా కదా ? సామజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్య ను ఆస్థి / జీతం తో గుణించండి . అనేక రెట్లు అయిపోతుంది .
సామాజిక తేలితేటలు లేక మలిముఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్ , రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు . ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద హీరో గా నటించినా అటు పై అవకాశాలు రావడం లేదని ఆత్మ హత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు . దీర్ఘ కాలం కోమా .. బాత్ టబ్ .. ఉరి.. ఇలా మరణాన్ని పొందిన వారు ఇంకొందరు . తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో !
ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది బాత్ టబ్ ఏంటి ? ఇన్సూరెన్సు అమోంట్ ఏంటి ? కోమా లో ఎవరు ? అని కాదు . ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్ ను పిలల్లకు ఎలా నేర్పాలి ? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని .
ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు ? ఆ వీడియో లో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా ? ఇలాంటి విషయాల పై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే .. మీ పిలల్లు ఇంటర్ నెట్ చీకటి ప్రపంచం లో దొరికే వీడియో లు, ఫిల్ములు కు బానిసలై మీ చేయి దాటి పోతారు . ఆవు / ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ?
పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. ఇదే విషయం పై మరో పోస్ట్ ద్వారా మళ్ళీ కలుద్దాము .
No comments:
Post a Comment