Saturday, July 30, 2022

సహనమే.. సాధకునికి సంజీవని

 ,సహనమే.. సాధకునికి సంజీవని

🌷🌷🌳🕉🌳🌷🌷

సహనం అనేది మానవునికి అత్యంత ప్రధానమైన లక్షణంగా భాసించాలి. సహనం విజయానికి ప్రధానమైన కారణంగా ఎన్నోసందర్భాల్లో నిలుస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి ఒత్తిడికీ లోను కాకుండా, విజయం వైపు సాగడమే సహనానికున్న ఔన్నత్యం.. సహనం అనే గుణం మానవునికి విలువైన ఆభరణం వంటిది.

సహనం అంటే క్షమ, ఓర్పు అని కూడా చెప్పవచ్చు. సహనంగా ఉండడం అనేది మనిషిలోని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. సహనంగా ఉండడాన్ని అసమర్థతకు నిదర్శనంగా భావించరాదు. ‘‘అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు’’ అన్న మాటను మనం తరచూ వింటూనే ఉంటాం కదా..!!

లౌకికంగా జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, ఆలోచనా ధోరణి ఎంత అవసరమో, దారిలో వచ్చే కష్టాలనూ, యాతనలనూ భరించడం, సహనాన్ని కోల్పోకుండా ఉండడం మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వెళతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఒకానొక గురుకులంలో ఒక శిష్యుడు తోటివారితోనూ, గురువుగారితోనూ ఎంతో అసహనంగా ప్రవర్తించేవాడు. గురువు చెప్పిన విషయాలను పూర్తిగా వినకుండానే తనకు తోచిన రీతిలో దురుసుగా మాటలు మాట్లాడడం, వింతైన భాష్యాలను చెప్పడం అతని నైజంగా ఉండేది. గురువుగారు అతని ప్రవర్తనకు ఎంతగానో విసిగిపోవడమే గాక, ఒకింత ఆవేదనకూ గురయ్యేవారు. సహనంగా వ్యవహరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని అతనికి తెలియచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఒకసారి గురువుగారు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడే పెద్దగా వాన కురిసి, వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. ఆయన ఒక శిష్యునితో ‘‘నాయనా.. కొంచెం పక్కనే పారుతున్న సెలయేటిలోని నీరు తీసుకుని వస్తావా.. దాహాన్ని తీర్చుకుందాం’’ అనడంతో శిష్యుడు సెలయేటి చెంతకు వెళ్ళి తిరిగివచ్చాడు. ‘‘గురువర్యా.. ఆ నీళ్ళు బురదగా ఉన్నాయి. తాగడానికి ఏమాత్రం బావుండవు’’ అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత గురువు గారు అతన్ని సెలయేటి దగ్గరకు పంపడం, మళ్ళీ అదే సమాధానం చెప్పడం జరిగింది. రెండు మూడుసార్లు ఆ విధంగా జరిగాక, శిష్యుడు చివరకు ఆనందంగా నీటితో తిరిగి వచ్చాడు. ‘‘గురువుగారూ.. ఇప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే తాగడానికి తెచ్చాను’’ అన్నాడు.

గురువుగారు అతని వైపు చూస్తూ, ‘‘నాయనా.. మనమంతా కొంత సమయం సహనంతో వేచి ఉన్నాం. అందుకే నీళ్ళు మామూలుగా ఉన్నాయి. మనం వేచి ఉన్న సమయాన నీటిలోని బురద స్వయంగా స్థిరపడింది. అందుకే ఇప్పుడు నీవు తెచ్చిన నీరు ఎంతో నిర్మలంగా ఉంది. మీ మనస్సు కూడా అలాంటిదే! ఇది ఆలోచనలనే బురదతో నిండి ఉన్నప్పుడు, మీరు దానిని తొట్రుపాటుకు లోను కాకుండా అలానే ఉంచాలి. మనసుకూ స్థిరపడడానికి కొంత సమయం అవసరం. అసహనానికి గురికావడంవల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. నీటిద్వారా నీవు తెలుసుకున్న ఉదాహరణే సహనంతో వర్తిస్తూ, విజయమార్గాన సాగడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని చెప్పగానే శిష్యునికి కనువిప్పు కలిగింది. నాటినుంచి సహనంగా ప్రవర్తించడం అలవరుచుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు ఆ శిష్యుడు.

సహనం అనేది కొద్దిపాటి చేదుగానే ఉంటుంది. కానీ, సహనం యిచ్చే ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి. భూమాతకున్న సహనం ఎవరికుంది? ఎక్కడన్నా ఓటమి ఎదురైతే, క్రుంగిపోకుండా, ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు లేదా సహనం కలిగి ఉండడం అంటే,  కేవలం ఒక బొమ్మలాగా మూలన నిశ్సబ్దంగా కూర్చోవడం కాదు. తాను వేచి ఉన్న తరుణం రాలేదని గ్రహించి, వైఫల్యానికి దారితీసిన కారణాలను కూలంకషంగా అన్వేషించి, విజయపథానికి బాటలు వేసుకోవడమే సహనంలోని ఆంతర్యం.

ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది.

ప్రతి క్రీడాకారుడూ గుర్తుంచుకోవలసిన వ్యక్తిత్వం శ్రీ లంక మాజీ కెప్టెన్‌ మర్వన్‌ సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఆడిన తొలి 6 ఇన్నింగ్సులో 5 సార్లు సున్నా పరుగులు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమైన మర్వన్, మరో ఇన్నింగ్సులో ఒక పరుగు సాధించాడు. అటువంటి ఆటతో ఆరంభించిన మర్వన్‌ ఎంతో సహనంతో  ఆటను కొనసాగించి, శ్రీ లంక జట్టుకు 4 ప్రపంచ కప్పుల్లో ప్రాతినిధ్యం వహించడమేగాక, జట్టుకు నాయకుడుగానూ వ్యవహరించడం గమనార్హం. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఆటగానిగా స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికే గర్వకారణమైన నీరజ్‌ చోప్రా ‘‘నైపుణ్యం ప్రతి ఆటగాడికీ అవసరమే. అయితే, పరాజయాన్ని తట్టుకుని, సహనంతో ముందుకు సాగడం వల్లనే, ఎవరికైనా విజయం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని పలికిన మాటలు అందరికీ ఆచరణీయమైనవే.

ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. 

ఓం నమః శివాయ🙏 

No comments:

Post a Comment