Tuesday, September 27, 2022

అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానాన్ని, ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు.

 శాస్త్రాలను చదివి సంపాదించిన జ్ఞానంతో ఆ జ్ఞానాన్ని ఆచరించి ఆర్జించిన విజ్ఞానంతో తృప్తి చెందిన మనసు కలవాడు, చలించని మనసు కలవాడు, ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనపడుతున్న బంగారం, రాయి, మట్టిబెడ్డలను ఒకేవిధంగా భావిస్తాడు. అటువంటి వాడిని యుక్తుడు అయిన యోగి అంటారు. 

యోగి అంటే ప్రాపంచిక విషయాలలో మునిగి ఉన్న జీవాత్మను వెనుక్కు మళ్లించి, తన నిజస్వరూపమైన ఆత్మ స్వరూపంతో, పరమాత్మలో కలపడానికి ప్రయత్నించేవాడు యోగి.
యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనపడతారు. కాని యోగులలో యోగయుక్తులు కొంతమందే ఉంటారు. అటువంటి 

యోగులు వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానం అంటారు. ఆ జ్ఞానవిజ్ఞానాల చేత తృప్తి పొందుతారు. 

జ్ఞానం అంటే వేదాలులు, శాస్త్రాలు, పురాణాలు చదివి సంపాదించినది. గురువుల వలన ఉపదేశము పొందినది, పెద్దల ద్వారా విన్నది. జ్ఞానం. విజ్ఞానం అంటే తానుపొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. కొంత మంది శాస్త్రాలు వేదాలు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు, అది తప్పు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినపుడే అది విజ్ఞానం అవుతుంది. 

పుస్తకాలు చూసి, తన తల్లి, అత్తగారు ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూచి వంట చేయడం నేర్చుకోవడం జ్ఞానం, తానే స్వయంగా వంటచేసి, అందరికీ వడ్డించడం విజ్ఞానం. రెండూ అవసరమే. 

అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వము గురించి, ఆయనను పొందే మార్గం గురించి తెలసుకోవడం జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించి పరమాత్మలో ఐక్యం కావడం విజ్ఞానం. వీటివలన ఆత్మతత్వాన్ని తెలుసుకొని తృప్తిపడిన వాడు యోగయుక్తుడు. 
తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందడం. లేని దాని కొరకు ఆరాటపడకపోవడం.

కొంత మంది వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతూనే ఉంటారు. వల్లెవేస్తుంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కాని వాటిని ఆచరణలో పెట్టడం శూన్యం. వారికి కేవలం శాస్త్ర జ్ఞానం తప్ప వేరే ఉండదు. తృప్తి అనేది అసలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఏం లాభం లేదు. పైగా చదివింది చాలదు, ఇంకా ఇంకా చదవాలి అని నిరంతరం అశాంతితో బాధపడుతుంటాడు. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానాన్ని, ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు.
.

No comments:

Post a Comment