శరణాగతి
పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి. ఉన్నది ఒక్క పరమాత్మే అన్న గ్రహింపుతో ఈశ్వరార్పితం కావాలి. అంటే శరణాగతి కావాలి. శరణాగతి కలిగివుండడం అంత సులువైనది కాదు. అలాగని అసాధ్యం కాదు. శరణాగతితత్వం భక్తితో, కృతజ్ఞతతో, ప్రార్ధనతో ముడిపడి వుంది.
భక్తి : భగవంతుని పట్ల ప్రేమే భక్తి. స్వస్వరూప అనుసంధానమే భక్తి. అనన్య దైవచింతనయే భక్తి. సమస్త ఆచార వ్యవహారాలను భగవంతుడికి అర్పించడం భక్తి. ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి. ఇటువంటి భక్తిని దాటి పొందాల్సినది శరణాగతి. భక్తిలో మనస్సు కరిగిపోయి తీవ్రస్థాయికి రావడమే శరణాగతి. అంటే భక్తి యొక్క పరాకాష్ఠస్థితియే శరణాగతి.
కృతజ్ఞత : ఉత్కృష్టమైన మానవజన్మనిచ్చి మనమీద అపారదయతో అన్నీ సమకూర్చుతున్న సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు యందు ప్రేమతో వుండి, తనచే సృజింపబడిన సమస్త సృష్టి యందు ఆ భగవంతుడినే దర్శిస్తూ అన్నివేళల్లో అన్నింటా దయతో ప్రేమతో వుండడమే కృతజ్ఞత.
ప్రార్ధన : అంతరంగపు నైర్మల్యాలను తొలగించేదే ప్రార్ధన. ప్రార్ధన అంటే అంతర్యామి ముందు అంతరంగ ఆవిష్కరణ, అంతరశుద్ధికై పవిత్ర ప్రయత్నం, అనంతునికై అంతరంగనివేదన. విషయజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లగలిగేదే ప్రార్ధన. జీవాత్మను విశ్వాత్మలో విలీనం చేసేదే ప్రార్ధన. అంతేగాని ప్రార్ధన యాచనల వుండకూడదు. భగవంతుడు దగ్గర భక్తుడిగా వుండాలి, భిక్షగాడుగా కాదు.
క్రమేపి భక్తి, కృతజ్ఞత, ప్రార్ధన తదితర అభ్యాసాలని దాటి భక్తుడు, భగవంతుడు అన్న ద్వైతభావమును అధిగమించి ఉన్నది పరమాత్మ యొక్కటే అన్న ఆత్మభావన స్థితికి రావడమే శరణాగతి పొందడం. అయితే నోటితో చెప్పడమంత తేలిక కాదు శరణాగతి. అసలు శరణాగతి అంటే -
📷వ్యక్తి భావనను విడిచిపెట్టి పరిపూర్ణంగా ఈశ్వర ఇచ్ఛకు కట్టుబడి వుండుట. అంటే ఈశ్వర సంకల్పమే నా సంకల్పం, ఆయన ఇష్టమే నా ఇష్టం అనే దృఢవిశ్వాసం కలిగియుండుట. ఏ పరిస్థితులలోనైనను, ఏ సంఘటనలయందైనను చలించక చరించక స్థితప్రజ్ఞతో వుండగలగడం. దేహాత్మ బుద్ధిని వదుల్చుకొని ఇతర చింతనలు లేకుండా నిరంతరం ఆత్మచింతనలో ఉండుటయే శరణాగతి. అహంకారాన్ని(నేను అన్న భావాన్ని) దాని పుట్టుకస్థానమైన హృదయంలో నశింపజేయుటయే నిజమైన శరణాగతి. ఈశ్వరుడు లేక ఆత్మ తప్ప వేరేమీ లేదన్న జ్ఞానం, ఆత్మ తప్ప నేను, నాది అంటూ ఏమిలేదన్న అనుభవజ్ఞానం కల్గినప్పుడే శరణాగతి అలవడుతుంది. తన ఉనికికి మూలకారణమైన దానికి తనని తాను అర్పించుకోవడమే శరణాగతి. శరణాగతి చెందిన సాధకునికి సంకల్పాలు, ఇష్టాయిష్టాలు అంటూ వుండవు. ఏది ఎలా వున్నా అంతా పరమాత్మ అనుగ్రహమే, పరమాత్మ మయమే అనే ఆత్మభావనలోనే వుంటాడు. సర్వమూ నీవే, నీ ఇచ్ఛ ప్రకారమే కానియ్యు అనే స్థితిలో ఉంటూ భగవంతుడు ఏది అనుగ్రహిస్తే దానితోనే పరిపూర్ణ సంతుష్టుడై వుంటాడు. సర్వత్రా సర్వేశ్వరుడునే చూస్తాడు. త్రికరణలతో చేసే ప్రతీ పనికి భగవంతుడే ధ్యేయమై వుంటాడు.
"శరణాగతి, ఆత్మవిచారణ (నేనెవర్ని) రెండూ వేరు వేరు పేర్లున్న అభ్యాసలే అయినా రెండు ఒకటేననీ, ఆత్మ సాక్షాత్కారంకు ఈ రెండే ఉత్తమమైన పద్ధతు"లని శ్రీ రమణులు అనగా,
రామానుజాచార్యులవారు శరీరం విడిచిపెట్టటానికి సిద్ధంగా వున్న తరుణంలో వారి శిష్యులు అందరూ వారిచుట్టూ చేరి చివరిమాట ఏదైనా చెప్పండి అని అడుగగా -
"నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత శరణాగతి ద్వారా తప్పించి ఇతరత్రా మార్గాలు ద్వారా కూడా మోక్షం వస్తుందని ఎవరైనా చెబితే మీరు వారి మాటలు నమ్మవద్దు" అని రామానుజాచార్యులవారు అన్నారు.
పరిస్థితులు అనుకూలంగా వున్నా, ప్రతికూలంగా వున్నా దీర్ఘశరణాగతిలో నిలబడి వుండాలి. ఆచరణ పూర్వకమైన శరణాగతి చెందినప్పుడే ఈశ్వరానుగ్రహం కల్గుతుంది. శరణాగతి పరిపూర్ణంగా వుంటే పరమాత్మునిపరంపదం పొందడం తధ్యం.
భక్తిమార్గంలో ముక్తి పొందాలంటే శరణాగతే అందరికి నిజమైన గతి. సాధకుని సాధన భక్తీ కృతజ్ఞతాప్రార్ధనలతో ప్రారంభమై శరణాగతితో ముక్తినిస్తూ ముగుస్తుంది.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment