Wednesday, September 28, 2022

నిరాడంబరత గొప్ప ఐశ్వర్యం అది ఎలాగో తెలుసుకుందాం.

 నిరాడంబరత గొప్ప ఐశ్వర్యం అది ఎలాగో తెలుసుకుందాం. 

సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే.
అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం.
అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం.

నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం.
శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే  స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు.
నిరాడంబరత కొందరికి స్వాభావికం. కాని కొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి.

నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సాధారణ దుస్తులు ధరించి  తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు  ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి  స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే  విలువివ్వాలి.

నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని  చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది.
మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా  కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం.
నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు.

ఏమిటా ఐశ్వర్యం..!?
పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం.
ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల  వరకూ  ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే.

సేకరణ. మానస సరోవరం

No comments:

Post a Comment