Saturday, September 24, 2022

వినదగు నెవ్వరు సెప్పిన….!

 Xxx. X2.  1-8.  240922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
       వినదగు నెవ్వరు సెప్పిన….!
                    ➖➖➖✍️

భరతుడు రాముడిని కలుసుకోవడానికి అడవికి వెడితే గుహుడు కనపడి రాముని గురించి, లక్ష్మణుని గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాడు. 

అయినా తోడ బుట్టినవాళ్లను గురించి భరతుడికి ఎక్కువ తెలుసా! వారితో ఒక్క రాత్రి గడిపిన గుహుడికి ఎక్కువ తెలుసా !!!  అయినా గుహుడు చెప్పినదంతా ఎంతో ఆసక్తిగా విన్నాడు.

వినడం చాలా గొప్ప లక్షణం. అది రమ్మంటే వచ్చేది కాదు. జీవితంలో ఏదయినా సరే బాగా వినాలి. అందుకే బద్దెనగారు ఏమంటున్నారంటే... 

వినదగు నెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్'.. 

వినినంతనే అంటే... 

కింద మంటను పరిశీలిస్తూ ఉండకపోతే.. పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతాయి. అలా ఏదయినా విన్నప్పుడు, విన్న వాటిని మనం పరిశీలించనప్పుడు... చెప్పేవాడు పదేపదే చెబుతూంటే మనం ఉద్వేగపడిపోయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నష్టపోతాం. 

అందుకే సావధానంగా విని, విన్నవాటిలోని నిజానిజాలను గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. "ఆయన గురించి ఈయన ఇలా చెప్పాడేమిటి అలా ఆయనను నేను ఎప్పుడూ చూడలేదే... ఆయన ఎప్పుడూ అలా తప్పుగా ప్రవర్తించలేదే... మరి ఈయన ఇలా ఎందుకు చెబుతున్నట్టు... మనం ఒకసారి పరి శీలిద్దాం.. ఇది నిజమయితే ఆయన మళ్ళీ తప్పు మార్గంలోకి వెళ్లకుండా మనం ఏదయినా చేయగలిగినది ఉంటే ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆయన గురించి ఈయన చెప్పినది అబద్ధమని తేలితే ఈయన మాటల విషయంలో ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. చాడీలు, కట్టుకథలు చెప్పకుండా కట్టడి చేద్దాం.” ... అలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే... ముఖ్యంగా యువకులకు, పిల్లలకు... మున్ముందు జీవితంలో పెద్ద పెద్ద పదవులు, అధికారాల్లోకి వెళ్ళినప్పుడు...      ఈ సూత్రాలు అమలు పరచే నైపుణ్యం లేకపోతే... నిజాలు చెబుతున్న వారిని వదిలించుకుని, ఎవరు ఏది చెబితే దానిని విని, ముందూ వెనకా ఆలోచించకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోవడమనే బలహీనతకు లోనయితే... చాలా చాలా అనర్థాలు వారికే కాదు, ఆ అంశంతో ముడిపడి ఉన్న పలువురి జీవితాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి.

మరి దీనికి    సుమతీ శతకకారుడు చెబుతున్న పరిష్కారం ఏమిటి ? 

"...కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !" 
అంటున్నారు... 

కని అంటే చూసి, బాగా విచారించి, లోతుగా పరీక్షించి చూడాలి. ఏది అబద్ధం, ఏది నిజం అని తెలుసుకోగలగాలి.

అలా తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తాడో వాడు నీతి పరుడు, వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అటువంటి వాడిని ఆశ్రయించిన వారు కూడా క్షేమంగా ఉంటారు.✍️

పద్యాల రూపంలో మనం నేర్చుకున్న నీతి సూత్రాలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. అవి జీవితంలో అవసరమయినప్పుడు పనికొస్తాయి. 

ఇంట్లో కర్ర ఉంది.. వీధిలో కుక్క వచ్చి మీద పడింది. కర్ర వచ్చి కాపాడదు. కర్ర చేతిలో ఉంటే కుక్క మీద పడదు, పడినా ఆత్మ రక్షణ చేసుకోగలం. ప్రమాదం నుండి సునాయాసంగా బయటపడ గలం...

అలాగే నీతి సూత్రాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. అప్పుడే మనం వాటిని జీవితంలో అన్వయించుకుని అనే కానేక సమస్యల చిక్కుముడుల నుండి కాపాడుకోగలుగుతాం. 

అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది. ఆకలి తీరాలంటే దానిని తినాలి... అందుకే అందరూ నీతి శతకాలు ఎప్పుడూ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండండి. 

మీరు ఆచరించండి. మరో నలుగురికి కూడా గుర్తు చేస్తూ ఉండండి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment