అవమానం
🔹🔸🔹🔸🔹🔸🔹
అవమానమనేది మోయలేని భారం.
మనసును దహించి వేస్తుంది.
అన్నపానీయాలను ముట్టనీయదు.
నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది
మనసు. ఆ మహోష్ణానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది.
సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి.
ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను మరచిపోతారేమోగానీ- అవమానాలను మరచిపోలేరు. ఇది మానవ సహజ గుణం. వీటిని అధిగమిస్తేనే ప్రగతి!! రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది.
పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు. అవమానించాడు ద్రుపదుడు. తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికికాని శాంతించలేదు ద్రోణుడి హృదయం.
అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలించాడు.
పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తాయి ఇటువంటి ఉదాహరణలు. అవమానానికి పగలు, ప్రతీకారాలు జ్వలింపజేసుకుంటూపోతే సహన గుణానికున్న ఔన్నత్యం ఉనికిని కోల్పోతుంది. మనలోని సహన గుణం ఎదుటివారిలోనూ పరివర్తన తెస్తుంది. కారణాలేవైనా అవమానాలను కూడా భరిస్తూ, సహిస్తూ, సాగిపోవడమే ఉత్తమమైన విధానం.
ప్రకృతి అందచందాలకు నిలయం. కార్చిచ్చు దహిస్తుంది. జలవిలయం తుడిచిపెడుతుంది. కానీ తిరిగి చిగురేయడం, పచ్చదనంతో కళకళలాడటం వృక్ష నైజం. బంగారాన్ని అందించే పుడమితల్లి కంపనాలకు గురవుతూనే ఉంటుంది.
గౌరవ మర్యాదలకు ఆనందించే మనసు అవమానాల్నీ తట్టుకోగలగాలి. తిరిగి స్వీయ వైభవాన్ని పొందాలి. అదే సమస్థితి.
కొండమీది చిన్న గుడిలో ధ్యానం చేసుకుంటూ శిష్యుడితోపాటు నివసిస్తున్నాడు ఓ సాధువు. కొండ దిగువున పల్లెవాసులందరికీ ఆయనంటే గురి. నొప్పివచ్చినా, జ్వరం వచ్చినా ఏదో ఒక ఆకో, ఫలమో ఇవ్వమనేవారు. వైద్యుడి దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినేవారు కాదు.
అగ్నిగుండంనుంచి ఓ చిటికెడు బూడిద ఇచ్చేవాడు. కాలగమనంలో వ్యాధులు తగ్గిపోయేవి. క్రమంగా జనంతాకిడి పెరిగింది. ఆ సాధువును భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన అనుగ్రహ భాషణం చాలు, సకలమూ చక్కబడుతుందన్న నమ్మకం పెరిగిపోయింది.
ఇలా ఉండగా ఓసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. పొలాలన్నీ బీళ్ళుగా మారాయి. చుక్క నీరు లేదు. పసిపిల్లలకు పాలు కూడా కరవయ్యాయి. పశువులు బక్కచిక్కాయి. పల్లెవాసులకు వలస మార్గమే దిక్కైంది.
ఈ కరవుకు కొండపై ఉన్న సాధువే కారణమన్న వదంతులు వ్యాపించాయి. రోజులు గడిచేకొద్దీ ఈ భావం ప్రజల్లో బలంగా నాటుకొంది.
సాధువును అనరాని మాటలంటూ, ఛీత్కరిస్తూ, రాళ్ళతో కొడుతూ తరిమేశారు. సాధువు కాషాయంబరాలు పీలికలయ్యాయి. రాళ్ళదెబ్బలకు రక్తం కారసాగింది. దుర్భర స్థితి.
దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళి తిరిగి ధ్యానం చేసుకోసాగాడు. సాధువు వెంటే ఉన్న శిష్యుడు- 'స్వామీ! ఏమిటీ దారుణం? ఇంత అవమానం పొంది కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.
సాధువు నవ్వి- 'చూడు నాయనా! పల్లెవాసులు నన్ను మహాపురుషుడిలా గౌరవించినప్పుడు పొంగిపోనూ లేదు. ఛీత్కరిస్తూ తరిమేసినప్పుడు బాధపడనూ లేదు. రెండింటినీ ఒకే చిత్తంతో స్వీకరించాను. కాలమే వారికి జ్ఞానోదయం గావిస్తుంది. ఏదో జరిగిందని వ్యాకుల చిత్తంతో నేను బాధపడాల్సిన అవసరమే లేదు...' అంటూ ధ్యానముద్ర వహించాడు- నిశ్చలచిత్తంతో.
ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని, దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.
నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి, విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నతస్థితికి చేరినవారే.
స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు. వారే జీవితంలో విజేతలు!..
మీ జీవితంలో నమ్మడం ఎప్పుడూ ఆపకండి ఎందుకంటే మీరు నమ్మితే ప్రతిరోజూ ప్రతి క్షణం అద్భుతాలు జరుగుతాయి...
🔹🔸🔹🔸🔹🔸🔹
.
No comments:
Post a Comment