*"శ్రీరమణీయం"*
*"బయటి పరిస్థితులకు, అంతరంగంలోని పరిస్థితులకు మధ్య సమన్వయం కుదరటం లేదు?"*
*"మనకి బాహ్యజీవనం కావాలంటే 'మనసు కావాలి'. ఆధ్యాత్మిక జీవనం కావాలంటే 'మనసు పోవాలి'. ఇక్కడ మనసంటే కావాలనుకునే గుణం. ప్రపంచం బయట ఉంది. ప్రశాంతత మనలో ఉంది. కోరికతో బయటికి వచ్చిన మనసు ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. కోరిక లేని మనసు మనలోని 'ప్రశాంతత'ను తెలుసుకుంటుంది. బయటి ప్రపంచం కారణంగానే మనసు ఏర్పడిందని తెలుస్తున్నప్పుడు ఇక మనసులో కలిగే సంకల్పాలకు అనుగుణంగా ప్రపంచం మారాలని మనం కోరుకోము. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషికి ఉన్న ఇచ్ఛాశక్తి ఏమిటో తెలుస్తుంది ! నేను స్త్రీనని, నేను పురుషుడినని నా మనసులో ఉన్న భావన వాస్తవంలో ఉన్న విషయం కనుక మనసులో అలాగే స్థిరపడింది. అద్దంలో ప్రతిబింబంలాగా బయటి పరిస్థితులను బట్టే మనసు ఏర్పడుతుంది. అంతేగాని మనసునుబట్టి పరిస్థితి మారదు. అద్దంలో ఒక వస్తువు అందంగా కనిపించటం లేదంటే వాస్తవంలోనే ఆ వస్తువు అలా ఉందని అర్ధం చేసుకోవాలి. దాన్ని సరిచేయాలన్నా అద్దంలో సరిచేయలేము. బాహ్యంలోనే సరిచేయాలి. అద్దంలాంటి మన మనసు బాహ్యంలో ఉన్న విషయాలను గ్రహిస్తుంది. ఆ వాస్తవాన్ని అర్ధం చేసుకోలేకనే మనం కోరుకున్నది జరగాలని ఆరాటపడుతుంటాం !"*
*"ఇచ్ఛాశక్తి అంటే ఏమిటి ?"*
*"ఇచ్ఛాశక్తి అంటే కోరుకున్న ఫలాన్ని పొందటం అని మనం అనుకుంటాం. అది తప్పు. ఫలాన్ని కోరటం అంటే ఫలితాన్ని ముందే నిర్ధారించటం. ఫలం ప్రకృతిపైన, ప్రారబ్ధంపైన ఆధారపడినప్పుడు, మనం కోరుకున్న ఫలితం రావటం ఎలా సాధ్యం. ఒక్కోసారి సాధ్యమైనప్పటికీ అది కాకతాళీయంగా జరిగేది గానీ మన ప్రమేయంతో జరిగేది కాదు. ఫలాఫలాలు మన సంకల్పశక్తి, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉండవని భగవాన్ శ్రీరమణమహర్షి స్పష్టంగా చెప్పారు. మనం కోరుకున్నది జరుగటమే ఇచ్ఛాశక్తి అయితే దాన్ని మనం ఎన్నటికీ సాధించలేము. వివేకంతో వాస్తవాన్ని అవగాహన చేసుకుంటే జరిగేదాన్ని తెలుసుకోగలం. అందుకే ఇచ్ఛాశక్తి అంటే ఫలాఫలాలను నిర్ధారించటం కాదని, వాటిని సమంగా స్వీకరించగలగటమేనని శ్రీరమణమహర్షి సెలవిచ్చారు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment