Sunday, December 25, 2022

***** ఆత్మజ్ఞానం, ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి.

 అరుణాచల👏
ఆత్మజ్ఞానం 
🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌿🌼🌿🌼🌿🌼
ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం ఆయనకు ఆధ్యాత్మిక కేంద్రమైంది. అది ఈశ్వరుడి హృదయ స్థానం. ఆ జ్యోతిర్లింగ దివ్యకాంతులు రమణులపై ప్రసరించాయి.
అది 1879 డిసెంబరు 30. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. అదే రమణమహర్షి అసలు పేరు. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి, ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు.
చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది. ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు... ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని!
ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు.
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు... ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే... జాగ్రత్తగా సాకు... ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం అతి సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.
శ్రీరమణులు ‘ఆత్మవిచారం’, ‘నేనెవరు’ అనే గ్రంథాల్ని రచించారు. ‘భగవంతుడు శాశ్వతుడు. ఎక్కడికీ పోడు!’ అని బోధించారు. ‘నేను ఎప్పటికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను’ అని చెప్పేవారు. అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆయన ఉన్నారనే దివ్యానుభూతి సందర్శకులకు ఇప్పటికీ కలుగుతుంటుంది. మహర్షి కరుణపూరిత నేత్రాలు వారిపై ప్రేమామృతాన్ని వర్షిస్తుంటాయి. అద్భుత సందేశాలు వారికి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి!
🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼 

No comments:

Post a Comment