Monday, December 26, 2022

వివిధ గీతలు - అందులోని నిగూఢ భావాలు




 వివిధ గీతలు - అందులోని నిగూఢ భావాలు
-----------------------------------------------------------

భగవద్గీత
--------------
సర్వధర్మా న్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

భావం: సర్వ ధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము నిన్ను సమస్త పాపముల నుండి విముక్తినిగా చేసి మోక్షమును ప్రసాదించెదను దుఃఖించకము అని గీతాచార్యుడు అన్నాడు. భగవద్గీత ఉపనిషత్తుల సారము. విశ్వవ్యాప్తకమైన గ్రంథము. అర్జునుని శోకమోహాదులతో ప్రారంభమైన భగవద్గీత జ్ఞాన స్మృతిలో సమాప్తం అవుతుంది. నదిలో ప్రయాణం చేయు వానికి ఈత ఎలా అవసరమో జీవిత యాత్ర సాగించు వారికి గీత అంత అవసరము. గీత అర్జునుని సమస్యను పరిష్కరించింది .భగవద్గీత మానవుని మాధవుని స్థాయికి కొనిపోయి ముక్తిని ప్రసాదిస్తుంది. జనన మరణ సంసార చక్రము నుండి విడుదల చేసి మానవుడికి ఆత్మసాక్షాత్కారము నొసంగి ఆశీర్వదిస్తుంది.

అవధూత గీత
---------------------
న బాహ్యాభ్యన్తరో సి త్వం శివః సర్వత్ర సర్వదా
ఇత స్తతః కథం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్

భావం: నీవు బాహ్యమునందును కలవు. అంతర్యము నందును కలవు. సర్వత్ర సర్వకాలమునందును శివుడవై ఉన్నావని తెలియకుండా భ్రాంతికిలోనై పిశాచము వలె అటు ఇటు పరిభ్రవించెదవేల? అని అంటుంది ఈ అవధూత గీత. అవధూత గీత చాలా అద్భుతమైనది ,అపూర్వమైనది. దత్తాత్రేయుల వారు స్కందునికి గావించిన అద్వైత బోధయే అవధూత గీత

గురు గీత
--------------
ఏకాక్షర ప్రదాతారం యో గురుం నైవ మన్యతే 
శునాం యోనిశతం గత్వా  చండాలే ష్వభిజాయతే

భావం: మంత్ర దీక్ష ప్రసాదించి ప్రణవ స్వరూప స్థితికి కొనిపోవు గురుదేవుని గౌరవించని వాడు రాబోవు కొన్ని వందల జన్మలలో కూడా కుక్కగా జన్మించి తదుపరి చండాలుడుగా జన్మించును. గుర్తుతెలిసిన వాడు గురువు గుర్తు లేనివాడు శిష్యుడు. పరిమిత జ్ఞానంతో పలవరించేవాడు శిష్యుడు అపరిమిత జ్ఞానంతో ప్రకాశించేవాడు గురువు .ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధం అనిర్వచనీయ అమృతానుభూతి. గురు వైభవమును అత్యంత రమణీయంగా తెలుపు అపురూప గ్రంథము గురు గీత పార్వతి పరమేశ్వరుల మధ్య సంవాద రూపముగా సాగినది ఈ గురు గీత

బ్రహ్మగీత
--------------
నాహం తరంగః సలిల మహమిత్యేన యుక్తిః
బుద్ధం  యేన తరంగేన కుతస్తస్య తరంగతా

భావం: "నేను అలనుగాను అంభోధియే" అని యుక్తితో విచారించినచో ఆ తదుపరి వచ్చే తరంగము తరంగ భావనను కలిగి ఉండగలదా? ఈ బ్రహ్మగీత యోగ వాశిష్టము నందలి నిర్వాణ పరకాల ప్రకరణమునందు గలదు. శ్రీరామచంద్రునకు వాసిష్టుల వారికి సంవాద రూపమున నడిచిన విషయమే బ్రహ్మ గీత. జీవభ్రాంతి కల్పితమైనదనీ ,నిత్య శుద్ధాత్మయైన సచ్చిదానంద పరమాత్మయే సత్యమనీ ఈ బ్రహ్మగీత ధ్రువపరచును

రిభుగీత
-------------
క్షు తృష్ణే దేహ ధర్మాఖ్యేన మమైతే యతో ద్విజ
తతః క్షుత్సమ్బవాభావాత్  తృప్తి రస్త్యేన మే సదా

భావం: ఓ బ్రాహ్మణుడా!  ఆకలి దప్పులు దేహ ధర్మాలే గాని నావి కావు.. నాకు ఆకలి కలిగే అవకాశమే లేనందున నేను సదా తృప్తుడనై యున్నాను. ఈ రిభు గీత విష్ణు  పురాణాంతర్గతము రిభు ఋషి తన శిష్యుడైన నిదాఘునికి చేయు బోధయే రిభు గీతయని తెలియుచున్నది. ఆకలి దప్పులు దేహధర్మాలు. శాంతి అశాంతులు మనోధర్మాలు. అనంతానంద స్వరూపమైన ఆత్మకు ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు ఉండవు.అప్పుడు అసంతృప్తి అనే మాట ఉండదు

ఉత్తర గీత
----------------
అత్యన్త మలినో దేహో దేహీ చాత్యన్త నిర్మలః
ఉభయో రన్తరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే

భావం: దేహం మలిన పూరితమైనది గనుక శుద్ధి చేయుటకు వీలుపడదు. ఆత్మ నిర్మలము గనుక శుద్ధి చేయనవసరము లేదు. ఈ రెండిటి రహస్యము నీకు అవగతమైనచో ఆ పిమ్మట నీవు శుద్ధి చేయునది ఎవరిని ? ఉత్తర గీత యనునది బ్రహ్మాండ పురాణాంతర్గతము. ఇది భగవద్గీతకు అనుబంధ విషయమని శివానందజీ అభిప్రాయపడ్డారు. అమృత పానము చేసినవానికి జలపానము చేయనవసరము లేనట్లు, ఆత్మానంద స్వరూపుడైన వానికి సాధనల ఆవశ్యకత లేదని ఉత్తర గీత నొక్కి వక్కాణించు చున్నది.సర్వం బ్రహ్మమయమనెడి ప్రకాశైక స్వరూపమును నిర్ణయించుటయే ఈ గీత యందు ప్రధానాంశము

నహుష గీత
------------------
సత్యం దమ స్తపో దానం అహింసా ధర్మనిత్యతా
సాధకాని సదా పుంసాం న జాతి ర్నకులం నృప

భావం: ఓ రాజా! సత్యము, దమము, తపస్సు ,దానము అహింస ,ధర్మనిత్యత్వము సాధకునకు ప్రయోజనము కాగలవు .అంతేగాని జాతి కులాదులు కావు. "నహుషగీత" మహాభారతము నందున్నది .ఒకనాడు భీమసేనుడు నహుషుడనే సర్పము చేత చుట్టి వేయబడి ఉండగా భీమసేనుని వెతుకుచూ ధర్మరాజు ఆ వన ప్రదేశమునకు వచ్చెను. నహుషుని చూసి అతడు వేసిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు జవాబులు చెప్పగా నహుషుడు భీమసేనుని వదిలి పెట్టాడు ధర్మరాజు కోర్కెపై ధర్మోపదేశము గావించెను. ఇది ఏ నహుషగీత.

జనక గీత
---------------
ప్రబుద్ధో స్మిప్రహృష్టో స్మి దృష్టశ్చోరో య మాత్మ నః
మనోనామ నిహన్మ్యేనం మనసాస్మి చిరం హతః

భావం: "నేను మేల్కొంటిని సంతముగా యున్నాను. ఆత్మను అపహరించు చోరుడు ఎవడో తెలుసుకున్నాను. ఈ మనస్సే చోరుడు. నేను అతనిని ఇప్పుడే వధింతును.చిరకాలముగా నేనతని వలన బాధలు అనుభవించినాను". పూర్ణ స్వరూపులైన యోగులు తమ సానిధ్యంలో గానము చేసిన గీతములను వినిన తర్వాత వైరాగ్యముచే కదిలిన వాడై జనకమహారాజు పొందిన అనుభూతియే ఈ జనక గీత . యోగవాశిష్టములోని ఉపశాంతి ప్రకరణము నందు ఈ గీత కలదు.

వ్యాధ గీత
----------------
కుశలః సుఖదుఃఖేషు సాధూంశ్చా ప్యుపసేవతే
తస్య సాధు సమారంమ్బా బుద్ధి దర్మేషు జాయతే

భావం: పుణ్యాత్ముడగు పురుషుడు సుఖదుఃఖాల యందు స్థిమితముగా ఉండును. సాధువులను సేవించును. సత్పురుష సాంగత్య ప్రభావముచే సదా తన బుద్ధుని ధర్మచింతనయందు గడుపును. ధర్మవ్యాధుడనే బోయవాడు తన స్వధర్మముననుసరించి జంతువులను వేటాడి చంపుతూ జీవించేవాడు. దుకాణమునందు జనులకు మాంసమును నిక్రయించి బ్రతికెడివాడు. అతడు స్వధర్మము నవలంబించుచు తల్లిదండ్రులకు సేవ చేసెడివాడు. స్వధర్మాచరణయందే అంతఃకరణ శుద్ధిని పొంది దాని ద్వారా ముక్తిని బొందవీలగునని ధర్మవ్యాధుడు కౌశికునికి బోధించెను.

నారద గీత
----------------
చంద్ర హీనా యధా రాత్రీ రవి హీనం యధా దినమ్
నృప హీనం యధా సైన్యమ్ గురు హీన స్తధా నరః

భావం: చంద్రుడు లేని, సూర్యుడు లేని పగలు, అధిపతి లేని సైన్యము ఎలా ఉండునో గురువు లేని వ్యక్తి అలా ఉండును. నారదునకు శ్రీకృష్ణ పరమాత్మకు సంవాద రూపమున నడిచిన ఈ నారదగీత యందు గురుత్వమును ,సాధనా విషయములను కూలంకషంగా చర్చించడం జరిగినది .ముముక్షువులు తప్పక పఠించదగినది ఈ నారద గీత.

హంస గీత
----------------
దేహం చ నశ్వర మవస్థిత మస్థితం వా
సిద్దోన పశ్యతి యతో ధ్యగ మత్స్య రూపకమ్
దైవాదపేతముత దైవవశా దుపేతం
వాసో యధా పరికృతం మదిరా మదాంథః

భావం: ఎవడైతే జ్ఞానవంతుడై తన స్వరూపమును సాక్షాత్కరింప చేసుకొనునో అట్టివాడు శరీరము కదులుచున్నను ,కదలిక యున్నను, కిందపడినను, కర్మవశమై యున్నను ,కర్మ విడిపడినను, అది అశాశ్వతమని గ్రహించినవాడై ,త్రాగుబోతు తనపై వస్త్రమున్నను ,జారిపడినను ,తెలియక యుండునట్లు దేహ విషయమునందు విలక్షణుడై యుండును. భగవానుడు శ్రీ మహావిష్ణువు హంస రూపధారియై బ్రహ్మకుమారులైన సతర్కుకుమారాదులకు చేసిన బోధయే హంసగీత

కపిల గీత
---------------
జ్ఞానమేకం పరాచీనైః ఇంద్రియైర్భ్రహ్మ  నిర్గుణమ్
అవభాత్యర్ధ రూపేణ భ్రాన్త్యా శబ్దాదిధర్మిణా

భావం: నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన ప్రజ్ఞాన సత్తా స్వరూపమే బ్రాంతిమయ ఇంద్రియముల ద్వారా శబ్దాది భిన్న విషయములుగా తెలియుచున్నది. కపిల గీత యనునది శ్రీమద్భాగవతము తృతీయ స్కంధమునందు ఉన్నది. అవతార పురుషుడైన కపిల మహర్షి బ్రహ్మవాదిని అయిన దేవహూతికి బోధించిన తత్వమే కపిల గీత. పరబ్రహ్మము నిర్గుణము అయిన ప్రజ్ఞా విశేషమే కపిల గీత అని కపిల మహర్షి భావము.

ఋషభ గీత
------------------
మానం ప్రమత్వః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆపృణోతి 
న సాధు మాష్యయత ఆత్మనో య మసన్నపిక్లేశాద్ ఆ సదేహః 

భావం: ఇంద్రియాలను సంతృప్తిపరిచే ఉబలాటములో మానవుడు తేలికగా పాపం చేస్తుంటాడు. గత జన్మలలో పాపములాచరించి తత్ఫలితముగా అనిత్యమైన శరీరమును పొందిన మానవుడు ఇప్పుడు కూడా ఆ కర్మలనే ఆచరించుట మంచిది కాదు. ఋషభ గీత అనునది భాగవతము నందు పంచమ స్కందమునందు గోచరించును. మహర్షియైన ఋషభుడు తన సంతానమునకు తెలియజేసిన ప్రబోధమే ఋషభ గీత..

బక గీత
-------------
దేవ దానవ గంధర్వ మనుష్యోరగ రాక్షసాః
ప్రాప్నువన్తి విపర్యాసం కిం ను దుఃఖతరం తతః

భావం: దేవతలు, దానవులు ,గంధర్వులు, మానవులు, సర్పములు ,రాక్షసులు మొదలగు వారందరూ జీవితంలోని భయంకర మార్పులచే దుఃఖిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప దుఃఖమేమున్నది . బకగీత మహాభారతాంతర్గతము. అనేక కల్పములు జీవించిన బక మహర్షికి ,ఇంద్రునికి సంవాద రూపమున జరిగినదే బకగీత .దేవ ప్రభువైన ఇంద్రుడు బక మహర్షిని సమీపించి మహర్షి జీవిత అనుభవములను తెలుపమని అడగగా అందుకు ప్రత్యుత్తరముగా బక మహర్షి తెలియజేసిన తత్వమే బక గీత 

భిక్షు గీత
--------------
సమాహితం యస్యమనః ప్రశాంన్తం దానాదిభిఃకింవద తస్యకృతమ్
అసంయతం యస్య మనో వినశ్య ద్దానాదిభిశ్చేద పరం కిమేభిః

భావం: ఎవని మనస్సు నిగ్రహించబడి ప్రశాంతత ననుభవించునో  అట్టివానికి దానాది సత్కర్మల అవసరమేమున్నది. దానాది సత్కర్మల నాచరించి నను మనసు నిగ్రహింపబడనచో ఆ యొక్క సత్కర్మల ఉపయోగమేమీ ? భిక్షు గీత యనునది భాగవతము ఏకాదశ స్కంధమునందు కలదు. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి బోధ చేయుచు లోభిగా ఉండి మహర్షిగా మారిన ఒక బ్రాహ్మణుని వృత్తాంతమును ఉదాహరణగా తెలియజేస్తారు. మనసును నిగ్రహించుటలో గల బాధను ఆ బ్రాహ్మణుడు తెలియజేస్తాడు. అదియే భిక్షుగీత.

వసిష్ట గీత
---------------
భ్రాన్తి వస్తు స్వభావో సౌ న స్వప్నో న సుషుప్తతా
న స్వర్గో నచ నిర్వాణం సత్యం శాంత మశేషతః

భావం: వాస్తవానికి సర్వము భ్రాంతియే. స్వప్నమూ లేదు సుషుప్తియులేదు. స్వర్గము లేదు. నిర్వాణము లేదు. సమస్తము అనంత శాంతియే అనునది సత్యము. వసిష్ట గీత యోగ వాసిష్టములోని నిర్వాణ ప్రకరణమునందున్నది. సత్య దర్శనము చేయలేని నిస్సహాయ స్థితిలో అసత్య వస్తు దర్శనము జరిగి ఆవేదన కలిగే ప్రమాదం ఉన్నదని వసిష్టుల వారు శ్రీరామచంద్రునికి గావించిన ఈ వసిష్ట గీతలో బోధించారు.

రామగీత
--------------
అజ్ఞానమే వాస్యహి మూలకారణం తద్దానమే వాత్ర విధౌ విధీయతే
విద్యైవ తన్నాశ విధౌ పటీయసీ నకర్మ తజ్జం నవిరోధ మీరితమ్

భావం: సంసార జీవనానికి అజ్ఞానమే మూల కారణమై యున్నది .అజ్ఞాన వినాశమే సంసార బంధములను త్రెంచుటకు తరుణోపాయము. జ్ఞానమే అజ్ఞానమును అంతమొందించగలదు.కర్మ అజ్ఞాన జనితమైనందున అజ్ఞానమును అంతమొందించ జాలదు .ఆధ్యాత్మ రామాయణము నందు ఈ రామ గీత గలదు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునికి చేసిన ప్రబోధమే రామ గీత

వేణుగీత
--------------
వివిధ గోప చరణేషు విదగ్ధో వేణు వాద్య ఉరుధా నిజ శిక్షాః
తవ సుతః సతి యదాధరబింబే దత్తవేణు రనయ త్స్వర  జాతీః
సవన శస్తదుపధార్య సురేశాః శుక్ర శర్వ పరమేష్టి పురోగాః
కవయ ఆనత కన్ద రచితాః కశ్మలం యముర నిశ్చితతత్వాః

భావం: ఓ యశోదా!  వివిధ గోప క్రీడల యందు దక్షుడైన నీ కుమారుడు అధరముపై ధరించి శ్రావ్యమైన స్వరముల ఆలపించగనే ఇంద్ర, శివ, బ్రహ్మాది దేవతలు సంపూర్ణ హృదయముతో అవధాన చిత్తులై స్వర మధురిమలను ఆలకించి, వాని నిజ స్వరూపములను గ్రహించలేక కలత చెంది యున్నారు. శ్రీమద్భాగవతము నందలి దశమస్కంధము నందు ఈ వేణు గీత గోచరించుచున్నది. శ్రీకృష్ణుని దివ్య తలపును మననం చేసుకొనుచున్న గోపికల మురళీ  వైభవమును వర్ణించుటయే విషయమే వేణుగీత ప్రధాన విషయమై ఉన్నది.

అష్టావక్ర గీత
-------------------
అహం కర్తేత్యహం మాన మహా కృష్ణావిందం శితః
నాహం కర్తేతి నిశ్వాసా మృతం పీత్వా సుఖీభవ

భావం: నేను కర్తను ననెడి అహంకార నల్లత్రాచు చేత నీవు కాటు వేయబడుతివి. నేను కర్తను గాను అనెడి విశ్వాసామృతమును పానము చేసి సుఖించుము .ఆత్మ విధుడైన అష్టావక్ర మహర్షి జనక మహారాజునకు తెలియజేసిన అద్వైత బోధయే అష్టావక్ర గీత .జీవన్ముక్త గీతల వలె ఇదియును చాలా అద్భుతమైనది .అద్వైత మకరందమును పంచి ముముక్షకులను ముక్త పురుషులుగా చేయుటలో అష్టావక్ర గీత అగ్రగామి అయి ఉన్నది

జీవన్ముక్త గీత
-------------------
ఏవం బ్రహ్మ జగత్సర్వ మఖిలం భాసతే రవిః
సంస్థితం సర్వ భూతానాం జీవన్ముక్తః స ఉచ్యతే

భావం: సర్వభూతములలో అంతర్యామియై సమస్త జగత్తును సూర్యుని వలె వెలుగులు వెదజల్లు అఖండ బ్రహ్మమును దర్శించువాడే జీవన్ముక్తుడు. అనంత ఆత్మ స్వరూపమును అనుభవమునకు అందించు జీవన్ముక్త గీత శ్రీ దత్తాత్రేయ విరచితము ఆత్మవిధుడై ఆప్తకాముడై వెల్గొందు జ్ఞాని యొక్క అపూర్వ అంతరంగి కానుభూతిని ఈ జీవన్ముక్త గీత మనకు అందించును

సిద్ధ గీత
-------------
ద్రష్టదర్శన దృశ్యాని త్యక్త్వా వాసనయా సహా
దర్శన ప్రధమా భాస మాత్మానం సముపాస్మ హే

భావం: దృష్ట దర్శన దృశ్యములనెడి త్రిపుటిని వాసనలతో సహా త్యజించి దృశ్య జీవనమునకు ఆధార బీజరూపమై వెలుగొందు సత్తా స్వరూపమును పొందెదము. సిద్ధ గీత యనునది యోగవాసిష్టములోని ఉపశాంతి ప్రకరణము నందున్నది .మహాత్ములైన సిద్ధపురుషులు కొందరు జనక మహారాజు నగర సమీపమున గానము చేసిన విషయమే ఈ సిద్దగీత. త్రిపుటి అసత్యమై చూడబడు దృశ్య ప్రపంచము చూచెడు వానికన్నా అన్యముగా లేదని వ్యావహారిక ప్రపంచ మనుగడను నిషేధిస్తూ, పారమార్థిక సత్తా స్వరూపమును నిర్దేశించుటయే ఇందు విషయము.

శౌనక గీత
---------------
తృష్ణాహి సర్వ పాపిష్ఠా నిత్యోద్వేగ కరీ స్మృతా
అధర్మ బహులా చైవ ఘోరా పాపాను బన్దినీ

భావం : పాపములలో కెల్లా తృష్ణయే భయంకరమైన పాపము. తృష్ణ  సదా ఉద్వేగకరమై ఉండును. తృష్ణ యనునది అధర్మమునకు మూలమై ఘోర పాపమును అంటగట్టుచున్నది. మహాభారతంలోని అరణ్య పర్వము నందు శౌనక గీత గోచరించుచున్నది. ధర్మరాజునకు శౌనక మహర్షి చేయు బోధయే శౌనక గీత. ధర్మసూత్రములను తెలియపరచి కామ క్రోధ లోభాది అరిషడ్వర్గములను తొలగించి అమృతతుల్యమైన ముక్తి ధామమును అలంకరించుటకు అనువైన సోపానములను ఈ శౌనక గీత యందు తెలియజేయుట జరిగినది.

గోపీ గీత
-------------
నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహేనాం అంతరాత్మ దృక్
విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే..

భావం : కృష్ణా ! నీవు యశోద నందనుడవు గావు. సర్వదేహములలో సాక్షి మాత్రమై ప్రకాశించు అంతరాత్మవు. బ్రహ్మదేవుడు ప్రార్థించగా విశ్వము నుద్ధరించుటకు సాత్త్వత కులమున జన్మించిన వాడవు. గోపిగీత అనునది భాగవతాంత ర్గతము.దశమ స్కంధములోని రాస పంచాధ్యాయి యందు ఈ గోపీ గీతము కలదు. శ్రీకృష్ణుని కొరకు పరితపిస్తూ యమునా నది తీరంలో గోపికలు గానము చేసిన విరహగీతమే ఈ గోపీగీతము.

అను గీత
---------------
పునః పునశ్చ మరణం జన్మ చైవ పునః పునః
ఆహార వివిధా భుక్తాః పీతా నానావిధాః స్తనాః

భావం: మృత్యువు పదేపదే సంభవించుచున్నది. జీవనము మళ్లీమళ్లీ కలుగుచున్నది. వివిధములైన ఆహార పదార్ధములు భుజించుట తల్లుల స్తన్యపానము చేయుట జరిగినది. మహాభారతము నందలి అశ్వమేధ పర్వము నందు అనుగీత కనిపించును .కురుక్షేత్ర సంగ్రామ సమయమున శ్రీకృష్ణుడు తనకు బోధించిన భగవద్గీత స్మృతికి తెచ్చుకొనుట కష్టతరముగానున్న దనియు తిరిగి బోధించమని అర్జునుడు ప్రశ్నించగా శ్రీకృష్ణ పరమాత్మ మందహాసము చిందించుచూ యోగారూఢ స్థితిలో నిలిచి బోధించుట సులభ సాధ్యము కాదనియు, దాని సారాంశమును మరో విధముగా తెలుపుటకు ఉపక్రమించెను. అదియే అను గీత. భగవద్గీతకు అనుబంధమైన గీత.

*** ఈ పోస్ట్ వ్రాయడానికి ఒక పూట సమయం పట్టింది.. మనకు తెలీని చాలా విషయాలు తెలుసుకుందాం... అందరికీ తెలియజేద్దాం.. 👍🚩

మీ

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*

No comments:

Post a Comment