241222g1305. 251222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
అవసరమా? ఆడంబరమా?
➖➖➖✍️
పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, వారి పెంపకం.
కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము.
ఎందుకంటే మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము.
తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య.
కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. అదో సైన్స్, అదో ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం. ఫలితమే ఇలాంటి సమస్యలు.
#మరిఈతప్పులెవరివి?
ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాప్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యిందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువచ్చారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? ‘నువ్వు చేస్తుంది ఏంటి డాడీ?’ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?
చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన వారి కొడుకు తమను పట్టించుకోవడం లేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?
కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?
విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు, ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు. దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?
సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.
తిరుపతికి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడు. అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (need ) ఆడంబరానికి (want) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం?
#ఏం నేర్పిస్తున్నాం మనం?
కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆఫీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?
నచ్చిన చీర కొనుక్కుని, ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి లలలసయఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?
పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?
ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?
లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తల్లి తండ్రుల పై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?
పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?
పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్, BIG BOSS లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?
మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?
చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?
అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?
అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?
సరదాకు, విచ్చలవిడి తనానికి తేడా ఏమిటో వివరించారా?
వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?
మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?
మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి. అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, YES మీ ఇంటినుంచే మొదలుపెట్టండి. భావి తరాన్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుదాం.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment