271222g1859. 281222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నిజమైన భగవద్భక్తి*
➖➖➖✍️
*సృష్టిక్రమంలో మనిషిగా పుట్టడం, పెరగడం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం, సంతానాన్ని పొందడం, ఈతి బాధలు అనుభవించడం, చివరికి మరణించడంతో జీవనచక్రం ముగుస్తుంది. క్షణికమైన ఈ కాలంలో నేను, నాది అనే స్వార్ధభావన పెచ్చు పెరిగి, మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.*
*సంసార లంపటంలో చిక్కుపడి తన గురించి తాను ఆలోచించలేక పోతున్నాడు. ప్రకృతి పురుషుల స్వరూపాన్ని తెలుసుకోలేక, పాశాలను తెంచుకోలేక కూపంలో మండూకంలా బతుకుతున్నాడు. జన్మ వైశిష్ట్యాన్ని, జీవిత పరమార్థాన్ని, మోక్షమార్గాన్ని అన్వేషించక కాలం కోరల్లో నలిగి వ్యర్థ జీవితం గడుపుతున్నాడు. వీటిని గమనించిన మనుపుత్రిక దేవహూతి- సంసార దుఃఖం నుంచి పరమాత్మను చేరే మార్గాన్ని బోధించేవాడు సాక్షాత్తు వైకుంఠవాసుడే అని తెలుసుకొన్నది. స్వామిని పుత్రుడిగా పొంది ఆయన ముఖతః లోకానికి సందేశమివ్వాలని భావించింది.*
*తల్లిదండ్రులైన స్వాయంభువ మనువు, శతరూపలతో కలిసి సరస్వతీ నదీతీరంలోని బిందుసరోవర తీర్థంలో నివసిస్తున్న కర్దమ మహామునిని సందర్శించింది. వివాహేచ్ఛతో ఉన్న మునిని ఆ అతిలోకసుందరి కోరిమరీ పెండ్లాడింది. సంతానానంతరం సన్యసిస్తానని ముని ఆమెకు ముందే చెప్పాడు. ఆమె అంగీకరించింది.*
*తొమ్మిదిమంది కుమార్తెలకు ఆమె జన్మనిచ్చింది. వారిని ఉత్తమ ప్రజాపతులకిచ్చి వివాహాలు జరిపించింది. సన్యాసానికి సంసిద్ధుడైన భర్తతో తనకొక పుత్రుడిని అనుగ్రహించమని కోరింది.*
*వరప్రభావంతో శ్రీమహావిష్ణువును పుత్రుడిగా ప్రసాదించాడు కర్దముడు. ఆయనే కపిలుడు.*
*కాలాంతరంలో ఆమెకు వైరాగ్య భావన పెరిగింది. జ్ఞానభిక్షతో మానవజాతిని సముద్ధరించమని అర్థించింది. మానవులకు ఆత్మ తత్త్వాన్ని బోధించేందుకే అవతరించిన కపిలుడు మాయాశక్తితో తానే స్వయంగా సాంఖ్యశాస్త్రాన్ని తల్లికి వివరించి పరోక్షంగా మానవజాతికి సందేశాన్నిచ్చాడు.*
*మనిషి మనసే బంధమోక్షాలకు మూలకారణం. భోగాలపై ఆసక్తిగల మనసు బంధాన్ని, పరమేశ్వరుడిపై నిలిచే మనసు మోక్షాన్ని కోరుతుంది. ఇది నేను, ఇది నాది అనే అభిమానం వల్ల కామ క్రోధ లోభాది దోషాలు పెరుగుతాయి. మనసు నుంచి ఇవి ఏనాడు తొలగిపోతాయో ఆనాడు సుఖాలపై విరక్తి కలిగి భక్తి వైరాగ్యాలు ఉదయిస్తాయి. జ్ఞానానికి వైరాగ్యాన్ని జోడించి యోగసాధన చేస్తూ భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటే ఈ జన్మలోనే అంతరాత్మ రూపుడైన పరమాత్మను చేరుకోగలం.*
*భక్తివిస్తారాన్ని, తత్త్వాల ఉత్పత్తిని, మోక్ష ప్రాప్తిని, అష్టాంగయోగ విధానాన్ని, భాగవత ధర్మాలను తల్లికి బోధించాడు కపిలుడు.*
*నిష్కామంగా భగవంతుడిని ప్రార్థించడమే నిజమైన భగవద్భక్తి.*
*మనసును స్థిరంగా నిలిపి భగవానుడికి సమర్పిస్తే అంతకన్నా గొప్ప కల్యాణమే లేదు. త్రికరణశుద్ధిగా దీన్ని నమ్మినవారికి ఏ కాలంలోనైనా శాంతియుత జీవనం లభిస్తుంది.*
*సంసారం సాగరంలోంచి బయట పడాలనుకునేవారు చైతన్య రూపమైన బ్రహ్మను దర్శించాలంటే మౌనాన్ని పాటించాలి.*
*శత్రుభావాన్ని దూరం చేసుకుని కర్తవ్యాన్ని శ్రద్ధగా పాటించాలి. లభించినదానితో తృప్తి పొంది రాగద్వేషాలకు అతీతంగా ప్రేమ, దయను ప్రదర్శించాలి. *
*స్వధర్మాన్ని పాటిస్తూ మితాహారంతో ధ్యానాన్ని అభ్యసించాలి. ఈశ్వరుడికంటే ఏదీ భిన్నం లేదన్న చింతన చెయ్యాలి.*
*ప్రాణుల్లో అంతర్యామిగా వ్యాపించి ఉన్న పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి అని తెలుసుకోవాలి. ఆ జ్ఞానమూర్తిని ప్రేమించేవారే పరమపదాన్ని అధిరోహించేందుకు అర్హులు అని తల్లీతనయులైన కపిల దేవహూతులు భాగవత కథ ద్వారా సందేశాన్ని అందించారు.*✍️
-మాడుగుల రామకృష్ణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment