*🧘♂️90 - శ్రీ రమణ మార్గము
*జాఫ్నా మనిషి:-*
అరుణాచల రమణుడి జీవిత కాలంలో ఆయనకు సేవ చేసిన వారిని తలచు కోవడం కూడా మన మనస్సుకు ఎంతో సంతోషన్నిస్తుంది. శ్రీరామచంద్రుడికి సేవ చేసిన వారి భాగ్యమెటువంటిదో, ఈ రమణుడి సేవకుల భాగ్యం కూడా అటువంటిదే.
రమణుడు విరూపాక్ష గుహ వద్ద నివసిస్తున్న రోజుల్లో ఆయనకు తోడుగా కందస్వామి అనే భక్తుడొకడుండేవాడు. ఆ కాలంలో అక్కడ దగ్గరలో నీటి సదుపాయం ఉండేది కాదు. వంట చేయడానికి తగిన వసతి కానీ, మనుషులు నివసించే చోటు గానీ లేదు. ఆ ప్రాంతంలో నీటి ఊట ఒకటుంటే దానిచుట్టూ ఉన్న రాయి రప్పా తీసి, నీరు లభించేట్లు చేశాడు కందస్వామి. పెరిగిఉన్న ముళ్ళ చెట్లూ, దుబ్బూ అంతా తెగ్గొట్టి, పెకలించి వేశాడు. అక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించి ఆ చుట్టూ ఉన్న నేలనంతా చదును చేశాడు. మామిడి, పనస, కొబ్బరి వంటి ఫలవృక్షాలు నాటాడు. పెరుమాళ్ స్వామి అనే మరో భక్తుడి సాయంతో ఇప్పుడక్కడ ఉన్న ఇటుక నిర్మాణాన్ని పూర్తి చేసి శ్రీ రమణుల వారిని అక్కడికి వచ్చి నివసించమని ఆహ్వానించాడు. రమణుడితో అక్కడే కొన్నాళ్ళు కలిసి జీవించి ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరువణ్ణామలై తిరిగి రాలేదు. అటు తర్వాత అతడిని గురించి ఏ వర్తమానమూ లేదు. అతడు ఎంతో శ్రమించి నిర్మించిన ఆశ్రమానికి శ్రీ రమణులు అతడి పేరే పెట్టించారు. ఈ స్కందాశ్రమం ఈనాటికీ అక్కడ ఉన్నది. రమణాశ్రమ నిర్వాహకులే దానిని చూస్తుంటారు. రమణ భక్తులు ఈ స్కందాశ్రమాన్ని ఆసక్తితో వెళ్లి చూచి వస్తుంటారు.
సేవా ధర్మాన్ని పాటించిన వారిలో శ్రీలంకలోని జాఫ్నా నుంచి వచ్చిన అమృతానంద అనే మరో వ్యక్తి ఉండేవాడు. రమణుడి ఔన్నత్యం గురించి వినిన అమృతానంద, తిరువణ్ణామలై వచ్చి స్కందాశ్రమంలో కొంతకాలం నివసించాడు. కంద స్వామిలాగే ఇతడు కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. బాటల మీద రాలిన చెట్ల ఆకులూ, చెత్తా చెదారం అన్నిటినీ ఊడ్చి అవతల పారేస్తుండేవాడు.
ఆవు పేడతో తగిన ప్రదేశాలన్నీ అలికి చక్కగా ఉంచుతుండేవాడు. రమణుడు తిరుగాడే చోటంతా6. అమిత పరిశుభ్రంగా ఉండాలని అతడి భావన. అమృతానంద ఎప్పుడైనా ఒకసారి తిరువణ్ణామలై వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులు ఉండిపోయేవాడు. ఆ సమయాల్లో బాటల మీద, రాయీ రప్పా, చెట్ల కొమ్మలూ, చెత్తా కనిపిస్తే రమణుడు చిరునవ్వుతో "జాఫ్నా పెద్దమనిషి ఆశ్రమంలో లేదా ఏమిటి?” అని అంటుండేవారు.
ఒక రోజున అమృతానంద నీళ్ళలో ఆవుపేడ ఎక్కువగా కలిపి, బాటలన్నీ అలికే సరికి, వాటిపై నడచివెళ్ళిన వారి కాళ్ళకి, కొద్దిగా పేడ అతుక్కొన్నది. పెరుమాళ్ స్వామికి అమృతానంద మీద చెడ్డ కోపమొచ్చి, “ఈ జాఫ్నా మనిషి ఆవుపేడతో ఈ ప్రదేశాన్నంతా ఖరాబు చేస్తున్నాడు. అతడికిక్కడ ఇక అన్నం పెట్టకండి" అన్నాడు తోటి వారితో.
రమణుడు అమృతానందను 'జాఫ్నా జంటిల్మన్' అని ఎంతో ఆదరంగా వ్యవహరిస్తే, పెరుమాళ్ స్వామి అతణ్ణి 'జాఫ్నామాన్' అనే వాడనేది పాఠకులు ఈపాటికే గ్రహించి ఉంటారు. దీనిని బట్టి రమణుడికి అమృతానంద పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేదో, పెరుమాళస్వామి వంటి వారికి అతణ్ణి గురించి ఎలాంటి భావముండేదో తెలియడమే కాక, “ఆశ్రమంలో అన్నం పెట్టకండి" అనేటంతటి శిక్షకు అమృతానంద అర్హుడేనా అనే విషయం కూడా పాఠకులు ఆలోచించవచ్చు.
మరికాసేపటికి అమృతానంద ఆశ్రమంలో కనిపించలేదు. అందరూ అతడి కోసం వెతుకనారంభించారు. అమృతానంద చివరికో కొబ్బరిచెట్టు మీద మట్టల వెనుక కనిపించాడు. పెరుమాళ్ స్వామి, అతణ్ణి కిందికి దిగిరమ్మని అన్నాడు. అమృతానంద ఇతడికే సమాధానమూ చెప్పకుండా, తన చేతికందిన లేత కొబ్బరికాయలు కొట్టి, అందులోని నీరు తాగనారంభించాడు. పెరుమాళ్వామి 'ఇతడికి అన్నం పెట్టవద్దని' శాసించగలిగాడే కానీ, ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్ళను తాగడాన్ని అంత సులభంగా ఆటంకపరచలేడు కదా?
పెరుమాళ్వామి అమృతానందను దిగి రమ్మని మళ్ళీ పిలిచాడు. అక్కడున్న వారంతా కూడా, ‘దిగిరావయ్యా' అని ఎంతగానో అభ్యర్థించారు. కానీ అతడు ఎవర్నీ
లెక్క చేయలేదు. ఎవరి మాటా పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనవేళకు అమృతానంద హాజరు కాలేదనే విషయం గమనించిన శ్రీరమణులు 'అతడేడీ?' అని అడిగాడు. అమృతానంత చెట్టెక్కి కూచున్నాడనీ, అందుకు సంబంధించిన వృత్తాంతమంతా రమణుడికి చెప్పారు.
శ్రీ రమణుడు బయట చెట్టు వద్దకు వెళ్ళి, అమృతానందను దిగిరమ్మని పిలిచాడు. ఆశ్రమంలో మరెవర్నీ లెక్కచేయని అమృతానంద, రమణుడు పిలవగానే, మారు మాటాడకుండా, చిన్న పిల్లవాడివలె ఆయన చెప్పినట్లు చేస్తూ, దిగివచ్చాడు. శ్రీ రాముడు ఆజ్ఞ ఆంజనేయుడికి శిరోధార్యమైనట్లే, శ్రీ రమణుల మాట మీద అమృతానందకు అంత గురి ఉండటంలో ఆశ్చర్యమేముంది?
అతి సామాన్యుడిగా కనిపించే ఈ అమృతానంద, మహా గురువుగా గుర్తింపడిన శ్రీ రమణుల వారి మధ్య ఉన్న ఈ పరస్పర ఆదరాభిమానానికి కారణమేమిటో !
No comments:
Post a Comment