మనిషి లక్ష్యం కోసం లక్ష్య సాధన కోసం జీవించాలి. అది ఎలాగో తెలుసుకుందాం.
సింహం గొప్ప పరాక్రమం కలిగిన జంతువు. అది అడవి రాజు. అయినా ఆహారం కోసం గుహ నుండి బయటకు వెళ్ళవలసిందే. అంతే తప్ప జంతువులు తమంతట తాముగా సింహం నోట్లో చొరబడి ఆహారం కావు కదా! అలాగే ఏ కార్యాన్నయినా సాధించాలంటే మన వంతు ప్రయత్నం చెయ్యవలసిందే. ప్రయత్నం లేకుండా... ఆ కార్యం జరగాలని మనసులో అనుకుంటూ కూర్చుంటే విజయం సాధించలేమని ఈ సుభాషితం అర్థం. అప్రకటితమైన దేవుడిని నిత్యం తలుస్తూ.. ఆయన గుణగణాలను ప్రతిఫలాపేక్ష లేకుండా అనునిత్యం సంకీర్తన చేయటమే నిజమైన భక్తి. ఆధునిక ప్రపంచంలో ఈ భక్తిని నలుదిశలకు ప్రసారం చేయటం ఒక ముఖ్యమైన కార్యం.
‘నేను’ ఎవరిని? ఈ జీవితం ఎందుకోసం? మన లక్ష్యం ఏమిటి? లక్ష్య సిద్ధి కోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటి? వైజ్ఞానికపరంగా ఎంత పురోగతి సాధించినా, సిరిసంపదలు కూడబెట్టినా, కీర్తి ప్రతిష్టలు సాధించినా... సత్యమైన ఆనందం, అనుభూతి పొందగలిగామా? వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహా భారతాలతో మన లక్ష్యాన్ని చేరడానికి దారి చూపడానికి ప్రయత్నించిన మాట నిజమే. కానీ దైవచింతన, ధర్మచింతనతో జీవించేవారు సైతం కలికాలపు ప్రభావంతో డబ్బు వ్యామోహంలో పడిపోతున్నారు. దానికి దాసోహమై, స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. విలువలు మట్టిపాలయ్యాయి. ప్రాపంచిక సుఖాల వెంపర్లాటలో మనిషి పతనం అయ్యాడు.
ఈ పరిస్థితి మారాలంటే మనిషిలోని దైవీ గుణాలు, శక్తులు బహిర్గతం కావాలి. సింహం గుహ నుంచి బయటకు వచ్చినట్టు మనిషిలోని శక్తులు, దైవీ సంపద జాగృతం కావాలి. శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, ఆత్మీయత అనుబంధం అనురాగం... ఇవన్నీ మన సహజ గుణాలు. ఇవి మళ్ళీ మనలో చిగురించాలి. మనిషి పరివర్తన చెంది, సమాజ పరివర్తనకు సహకరించాలి. అప్పుడే నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం
No comments:
Post a Comment