*'అతి' ప్రగతికి అవరోధం*
భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి అన్ని విషయాల్లో అతిగా ప్రవర్తిస్తాడు. మితిమీరిన ఆనందం, ఉత్సాహం, వాత్సల్యం, క్రోధం, కామం, లోభం, ప్రేమ- ఏదైనా అనేక అనర్థాలు తెచ్చి పెడుతుంది.
అతిగా మాట్లాడటం వాచాలత్వం అనిపించుకుంటుంది. ఈ వాచాలత్వం వల్ల పరుషమైన మాటలు బయటకు వస్తాయి. స్పష్టత, స్వచ్ఛత ఉండవు. ఔచిత్యం, సందర్భ శుద్ధి లోపిస్తాయి. ఆలోచనను, విచక్షణను ఆక్రమించిన ఆవేశం కట్టలు తెంచుకుని మనిషిని మృగం చేస్తుంది. 'అగ్ని వాక్కు నాశ్రయిస్తుంది. ఆత్మ అమృతత్వాన్ని, బ్రహ్మను ఆశ్రయిస్తుంది' అని శాస్త్రాలు చెబుతున్నాయి. సందర్భ శుద్ధి కలిగిన మితభాషి కనుకనే హనుమను 'వాక్యజ్ఞ' అన్నారు. మందర వాచాలత్వం కైక మనసులో విషబీజం నాటింది. రావణుడి అధర్మకాముకత బంగారపు లంకను భస్మీపటలం చేసింది. శకుని కుత్సిత సంభాషణ దుష్టచతుష్టయ దుర్మార్గానికి ఆజ్యం పోసింది. ధృతరాష్ట్రుడి పుత్రవాత్సర్యాతిశయం దుర్యోధనుణ్ని అహంకారాంధుణ్ని చేసింది. ఉత్తర కుమారుడి ప్రగల్భం. అతడిని చరిత్ర హీనుణ్ని చేసింది. శిశుపాలుడి వాచాలత వాసుదేవుడి చక్రఘాతానికి నశించిపోయింది. వదరుబోతుదనం వల్ల చాడీలు అసత్యం, అసభ్యత, ప్రాణహాని మానహాని అవగుణాలు బయటపడతాయి. అందుకే 'మౌనం పరం భూషణం" అన్నారు. ఈ మౌనం కూడా మితిమీరి ఉండకూడదు. మేధావి, లోకకల్యాణ ఆకాంక్షి తన ఎదుట అనర్ధాలు జరుగుతుంటే మౌనం వహించి,
నిరసించక మిన్నకుంటే ఆ ఆకృత్యాలను ప్రోత్సహించినట్లవుతుంది. శ్రమను మించిన సంపద, అర్హతను మించిన పదవి, చిత్త శుద్ధి లేని కీర్తి- అనర్ధాలకు మూలాలు. ప్రగతికి అవరోధాలు కొందరు తమ కార్యసాఫల్యం కోసం, ప్రతిఫలాపేక్షతో ఎదుటివారిని అదేపనిగా హద్దుమీరి సందర్భంతో నిమిత్తం లేకుండా పొగుడుతూనే ఉంటారు.
ఏవేవో కోర్కెలతో, మొక్కుబడులతో భగవంతుణ్ని ఆరాధించడం, అర్చించడం, అవి తీరకపోయేసరికి ఆయన్ని నిందించడం అసలైన భక్తి అనిపించుకోదు. కోర్కెలతో కొలిచే కొలువుకు విలువే ఉండదు. ఎవరైనా స్వస్థత కలిగి ఉండాలి. ఇది గ్రహించక, తమ ఆరోగ్య స్థితిగతులను లక్ష్యపెట్టకుండా విపరీతంగా ఉపవాసాలు చేసి ఎవరైనా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం వాంచనీయం కాదు. చెంతగల విత్తాన్ని చిత్తం వచ్చినట్లుగా, ఉచితానుచితాలు గమనించకుండా దానధర్మాలు చేయడమూ మంచిది కాదు. అతి అప్రమత్తత ఎంతటి ప్రమాదకరమో అతిప్రమత్తత కూడా అంతటి వినాశ హేతువే
తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా ప్రేమించి, గారాబం చేయడం ఎంత అసమంజసమో, చీటికి మాటికి దూషించి, దండించడమూ అంత అనుచితమే. ఆత్మస్తుతి, పరనింద అత్యంత హేయమైన లక్షణాలు ప్రతి విషయంలోనూ ఆత్మన్యూనతాభావం మనిషిని ఆభ్యున్నతి పథాన నడిపించలేదు. సాత్వికమైన మితాహారం ఆరోగ్యప్రదమైంది. అతినిద్రాలోలుడు సోమరితనానికి మిత్రుడు. విశ్రాంతి లేని శ్రమ అనారోగ్యకారకం. అతి వేగవంతమైన ప్రయాణం ప్రాణాంతకం. అతనిదానం కార్యవైఫల్యానికి హేతువు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారందుకే.
చిమ్మపూడి శ్రీరామమూర్తి .
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment