1110. 1-4. 010223-6
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఉపసాళకుడు*
➖➖➖✍️
*మనిషికి మరణ భయం లేకపోతే, ‘మరణించాక నేను ఏమైపోతాను? ఏమైపోవాలి?’ అనే ఆలోచన లేకపోతే పారలౌకిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు, రావు. ఈ మరణ భయాలే మత బీజాలుగా ఆదిమ సమాజాల్లో మొలకెత్తాయి. జన్మదినం, నామకరణం, గృహ ప్రవేశం, వివాహం, మరణం... మనిషి జీవితంలో నిర్వహించుకొనే ఈ కార్యక్రమాలలో మానవులు అనాది నుంచీ పాటించినవి మరణానంతర కర్మలే. ఉత్తర క్రియలే!*
*నాలుగు మంచి పనులు చేసి మరణించిన వ్యక్తికి... ఇతర గతుల సంగతి ఎలా ఉన్నా కీర్తి మాత్రం మిగిలిపోతుంది.*
*బతికినంత కాలం అమానుషంగా జీవించి, మరణించిన తరువాత తనకు అంతిమ సంస్కారాలు శుద్ధంగా జరగాలని భావించిన ఒక వ్యక్తి గురించి బుద్ధుడు చెప్పిన కథ ఇది…*
*పూర్వం విదేహలో ఉపసాళకుడు అనే పండితుడు ఉండేవాడు.*
*మొత్తం జంబూ ద్వీపంలో తనంతటి జ్ఞాని, మహా పండితుడూ ఎవరూ లేరని అతను మిడిసిపడేవాడు. ఎక్కడకు వెళ్ళినా తన పట్ల గౌరవ మర్యాదలు ఏ కొంచెం తగ్గినా సహించేవాడు కాదు. అన్ని విషయాల్లో శుద్ధి పాటించేవాడు. శుద్ధి పేరుతో మనుషులను దూరం పెట్టేవాడు.*
*ఉపసాళకుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను కూడా మంచి పండితుడే. ఉపసాళకుడికి వయసు పెరిగింది. వృద్ధాప్యం వచ్చింది. ఏ క్షణమైనా మృత్యువు రావచ్చని నిశ్చయించుకున్నాడు. తన కుమారుణ్ణి పిలిచి….*
*”నాయనా! నాకు ఎప్పుడైనా మృత్యువు రావచ్చు. నా మరణ కర్మలు చాలా శుద్ధిగా జరిపించు. నన్ను చందనం కట్టెలతో దహనం చేయించు. నన్ను దహనం ఎక్కడ చెయ్యాలో తెలుసా?” అని అడిగాడు.*
*”లేదు తండ్రీ!” అన్నాడు అతని కుమారుడు.*
*”అందరినీ దహనం చేస్తున్న మన ఊరి శ్మశానంలో మాత్రం చెయ్యకు. అక్కడ శుద్ధి, ఆచారాలు పాటించని వారెవరినో దహనం చేసి ఉంటారు. గతంలో ఎవరినీ దహనం చేయని పరిశుద్ధ ప్రదేశంలో నా అంతిమ సంస్కారాలు కావించు!” అని చెప్పాడు.*
*”తండ్రీ! అలాంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో నాకు మాత్రం ఏం తెలుసు? మీరే ఆ ప్రదేశాన్ని చూపించండి. అక్కడే చేస్తాను” అన్నాడు కుమారుడు.*
*ఉపసాళకుడు తన కుమారుణ్ణి వెంట తీసుకొని, ఊరి చివరికి వెళ్ళాడు. అక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీదకు చేరాడు. అక్కడ మూడు పర్వతాలు కలిసిన లోయ ప్రాంతాన్ని చూపుతూ- ‘‘నాయనా! ఈ ప్రదేశం ఉత్తమమైనది!” అన్నాడు.*
*అతని కుమారుడు సరేనన్నాడు.*
*వారిద్దరూ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న సమయంలో... బుద్ధుడు తన శిష్యులతో కలిసి అటుగా వస్తూ, ఉపసాళకుని దగ్గర ఆగాడు.*
*విషయం తెలుసుకొని “ఉపసాళకా! ఈప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నావు?” అని అడిగాడు.”*
*”అక్కడకు అంత్యక్రియల కోసం ఎవరూ వెళ్ళరు. మూర్ఖులు, అజ్ఞానులు, అస్పృశ్యుల స్పర్శ లేని ప్రదేశం అది!” అన్నాడు.*
*అప్పుడు బుద్ధుడు- “ఉపసాళకా! ఎంత అజ్ఞానివి? ఈ భూమి మీద జీవులు పుట్టని స్థలం కానీ, సంచరించని తావులు కానీ, మరణించి మట్టిలో కలసిపోని ప్రదేశం కానీ ఎక్కడా మిగిలి ఉండదు. ఎన్నెన్నో కల్పాల నుంచి ఈ జీవుల చక్రం ఇక్కడ నడుస్తూ ఉంది. జీవుల భస్మంతో నిండని ప్రదేశం ఏదీ ఈ అవని మీద ఉండదు. మూర్ఖంగా శ్మశాన శుద్ధి కోసం ఆరాటపడకు!” అని చెప్పాడు.*
*ఉపసాళకుడు తన అజ్ఞానాన్ని వీడి, బుద్ధుని శరణు వేడాడు.*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment