రాగద్వేషాలను వదలిపెట్టండి
ప్రతి మనిషి జీవితంలో కొన్ని విషయాలు తనకు కావలసినవనీ, మిగతావి అక్కరలేనివనీ అనుకుంటాడు. అలా అనుకోవటంతో తనకు కావాలనుకున్నవాటి పట్ల రాగాన్ని, అవసరంలేనివాటిపట్ల ద్వేషాన్ని కలిగియుంటాడు. రాగద్వేషాల కారణంగా కష్టాలనుభవించవలసి వస్తుంది.
వాస్తవానికి ఇష్టమైనదీ, అయిష్టమైనదీ అంటూ ఏమీలేదు. అదంతా మనస్సు సృష్టించుకున్నదే. ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే రాగద్వేషాలకు తావుండదు. అప్పుడు అతనికి కష్టనష్టాల బాధ ఉండదు.
శ్రీకృష్ణభగవానుడు ఇలా అన్నాడు -
इंद्रियस्येंद्रिय स्यार्धे रागद्वेषौ व्यवस्थितौ |
तयोर्न वशमागच्छे त्तौ ह्यस्य परिपन्थिनौ ||
ఇంద్రియగ్రాహ్యములైన శబ్దస్పర్శాది విషయములందు తనకు అనుకూలమయిన దానియందు రాగము, ప్రతికూలమయిన దానియందు ద్వేషము ప్రతియొక్కరికి ఉంటాయి. కాని అవి మానవుని జీవితంలో శత్రువులు వంటివి. కావున మానవుడు వాటికి వశము కాకూడదు. అంటే మానవుడు రాగద్వేషాలకు అతీతుడుగా ఉండాలి.
दद्यान्नावसरं किंचित् कामादीनां मनागपि |
రాగద్వేషములులేని వ్యక్తికి, ప్రపంచంలోని ఏ వస్తువు పట్లా కోరిక ఉండదు. అన్నిటిపట్లా సమదృష్టి ఏర్పడుతుంది. అతని మనస్సుకూడ నిర్మలంగా ఉంటుందని మన పూర్వీకులు చెప్పారు. అటువంటి మనఃస్థితిని పొందటం జీవిత లక్ష్యం కావాలి.
न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत्प्राव्य चाप्रियम् |
కోరుకున్నది లభించిందని అతి సంతోషంకాని, అననుకూలమైన సంఘటన జరిగిందని అతి విచారం పనికికాదు. అందువలన శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లుగా రాగద్వేషాలను మన జీవితంలో స్థానం ఇవ్వకుండా మన జీవితాల్ని మలచుకోవాలి. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తే జీవితంలో ప్రగతిని సాధించగలం. అందరూ అటువంటి పవిత్రజీవనాన్ని గడుపుదురుగాక.
हर नमः पार्वती पतये हरहर महादेव
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment