Sunday, April 23, 2023

కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.

 కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి
ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే.
ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!
కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది.
ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది.
ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే.
మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి.
మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు.
మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది.
అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు.
కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు.
ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే“నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.
అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి.
అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది.
పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది.
ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మలగురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము.
అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు.
కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు.
కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు.
భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే.
అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి.
చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి.
రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి.
రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి.
అలాంటివాడు కేవలం“దొంగే” అవుతాడుగాని“రాజు” ఎన్నటికీ కాలేడు.
అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు.
కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!
అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి.  

No comments:

Post a Comment