Wednesday, May 1, 2024

*****అహం నశిస్తే, ఆత్మ ప్రకాశిస్తుంది

అహం నశిస్తే, ఆత్మ ప్రకాశిస్తుంది.

అహంకారం మూడు విధాలు. ‘అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. 

మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.

 అహం రావడం ఏంటి? ఆకారంతో వచ్చి చేరడం ఏంటన్న ప్రశ్న పడవచ్చు. అంటే అర్థం…. ‘నేను’ అనేది ఒక భావన. నా యొక్క ఉనికికి ‘నేను’ అని పేరు.

 ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే, నా యదార్థ అస్తిత్వమే నేనన్నమాట. ఈ నేను అనుదానికి ఎట్టి ఆకారము లేదు. అది నిరాకార స్వరూపం. 

ఇది దేని యొక్క ఆధారం లేకుండా తనకు తానుగా వున్నప్పటికీ, ‘నేను’ అనునది ఈ సర్వానికీ ఆధారంగా వున్నదని తెలియక, ఏదో ఒక ఆకారమే నేను అని, ఈ ‘నేను’ను పరిమితం చేయడమే ‘అహంకారం’ అంటే. 

అంటే ఏ ఆకారం లేకుండా అపరిమితంగా, అనంతంగా, తనకు తానుగా వున్న ‘నేను’ని…. పరిమితమైన, ఖండమైన, వ్యయం చెందేటువంటి శరీర, ప్రాణ, మనో, బుద్ధులకు ఆపాదించడమనేది ఒక రకంగా అహంకారం అనబడుతుంది.

 కాగా వేదాంతంలో ‘అంతఃకరణ చతుష్టయం’గా చెప్పబడే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములలో నాలుగవది ఇది. 

ఈ శరీర ప్రాణ మనో బుద్ధుల సంఘాతాన్ని కలిపి ఉపాధి అంటారు. శరీరాన్ని స్థూల ఉపాధి అని, ప్రాణ మనో బుద్ధులను కలిపి సూక్ష్మ ఉపాధిగా చెబుతుంటారు. అయితే… ఏ ఉపాధిని నేను అని భావించినా అది ‘అహంకారం’ క్రిందకే వస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అంటే అర్థం ఇదే. ‘ఎవరెట్లు భావిస్తారో, వారిని అట్లే బంధిస్తుంది’. ‘శరీరమే నేను’ అని అనుకునే వారికి జనన మరణాల చేత, ప్రాణమే నేను అనుకునేవారికి ఆకలి దప్పులు, ‘మనసే నేను’ అని భావించే వారికి శోక, మోహాలు ఇలా ఒక్కో ఉపాధి నేనుకు ఒక్కొక్క రకమైన పరిమితి వుందన్నమాట. అంచేత ఉపాధి సంగత్వం (ఉపాధి నేను అనే భావం) లేని మహనీయులను నిరహంకారులుగా పిలువబడుతారు. 

ఇప్పుడు ఇది ఎన్ని విధాలుగా వుంటుందో గమనిద్దాము.ఆదిత్యయోగీ..

1. తమో గుణ అహం, 
2. రజోగుణ అహం, 
3. సత్వగుణ అహం.
అని అహాన్ని మూడు విధాలుగా చెప్పుకోవచ్చును.

*తమోగుణ అహం అంటే:-*… “నాకు నచ్చినట్లే జరగాలి, అంతా నా ఇష్టం, నాకు తోచినట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను….” అనేవిధమైన వైఖరి కలిగినది తమోగుణ అహం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దీనినే రాక్షస ప్రవృత్తి అనవచ్చు. తమ అహం చాటుకోవడానికి, నిలుపుకోవడానికి విధ్వంసకరమైన, హింసతో కూడిన, పచ్చి స్వార్థంతో ప్రవర్తించడానికి, ఆ విధమైన కార్యకలాపాలు చేయడానికి ఈ అహమే మూలకారణం.

*రజోగుణ అహం అంటే:-*… ఈ అహం వున్నవారిలో కూడా స్వార్థం వుంటుంది కానీ అది పూర్వం మాదిరి నెగిటివ్ గానే వుండాలని లేదు. ఈ రజోగుణ అహం వున్నవారు కూడా కాస్తంత మధ్యస్త వైఖరి కలిగి వుంటారు. అంటే తమకు అనుకూలంగా వున్నవాటిని అందలమెక్కిస్తారు, ప్రతికూలమనిపిస్తే కూలదూస్తారు. ఈ అహం ప్రభావం చేత…. తమ అహాన్ని చాటుకునేందుకు లోకహిత కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. అటు దైవీ లక్షణాలను, ఇటు ఆసురీ లక్షణాలను తమకు అనూకూలమైన విధంగా వ్యక్తపరచటం ఈ రజోగుణ అహంతో వున్నవారి నైజం
ఇక మిగిలినది. *సత్వగుణ అహం:-*
అసలు సత్వగుణాన్నే ‘బంగారు సంకెళ్ళు’ అని అభివర్ణిస్తుంటారు. అయితే మిగితా రెండు అహాలకంటే ఇది కాస్తంత మెరుగు, ఇంకా శ్రేయోదాయకమైనది కూడా. సత్వగుణ అహం అనేది మానవుని యందు దైవీ లక్షణాలైన ప్రేమ, దయ, కరుణ, శాంతి, సహనం, క్షణ వంటివి పెంపొందేలా చేసుకుని… తదనుగుణమైన విధంగా జీవనశైలిని అవలంబించేలా, పుణ్యాభిలాషను, జ్ఞానాభిలాషణతో కూడిన వర్తనం ఈ రకమైన అహం వున్నవారిలో కనిపిస్తుంది. 

 “అహం నశిస్తే, ఆత్మ ప్రకాశిస్తుంది”. ఈ వాక్యం కేవలం లౌకికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అక్షర సత్యం. మానవులు పెద్దలను ఆశ్రయించి, వారి బోధలను అనుసరిస్తూ జీవనాన్ని సాగించుట ద్వారా, క్రమంగా భక్తి భావంతో మెలగి, క్రమంగా తమ యందలి భక్తి భావాన్ని, దైవీ లక్షణాలను వృద్ధి చేసుకుని… క్రమంగా సాధకులుగా పరివర్తన చెంది, ఆపై అను నిత్యం స్వాధ్యాయం చేయాలి. 

‘నేను ఇప్పుడు ఏ నేనుగా వున్నాను?’ ‘నాలో ఇప్పుడు ఏ అహం పనిచేస్తుంది?’ ‘ఇవాళ ఫలానా పనిలో నేను వ్యవహరించిన తీరు, నాలోని ఏ అహాన్ని ప్రతిబింబిస్తుంది?’ అంటూ విచారణ చేస్తూ, స్వ అధ్యయనం చేయాలి. దీనినే ‘ఆత్మ విమర్శ’ అంటారు. 

ఇలా చేసినప్పుడు, వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించుట చేత, ఏ అహం యొక్క వ్యక్తత అలా పనిగా మారినదో తెలుస్తుంది మొదట. అలా తెలిసిన తరువాత ఏ అహంతో వున్నప్పుడు ఆ పని సజావుగా జరిగింది? ఇదే పనిని తమస్సుతో కాక సత్వంతో చేస్తే, తేడా ఏం కనిపించింది? అంటూ… విచారణను వృద్ధి చేస్తే… క్రమంగా మనకు ఏ అహం ఎప్పుడు ఎలా పనిచేస్తున్నదనేది స్పష్టంగా తెలియడంతో పాటుగా… రజో తమో అహాలను నిరసిస్తూ… సత్వగుణ అహంతో వ్యవహారం నడుపుతూ… ఆంతర్యంలో అభావంగా వుంటూ… వ్యష్టి చైతన్యమైన ‘జ్ఞాత’ వుండే అవకాశం లభిస్తుంది.

No comments:

Post a Comment