Thursday, May 2, 2024

 గు : నేను మేను అనేటటువంటి గుర్తు. రెండు రకాల గుర్తులు ఉన్నాయట మానవుడికి. ఒకటి నేను రెండు మేను. 
నేను అంటే జ్ఞానం. 
మేను అంటే పదార్థం. 
ఈ సృష్టి జ్ఞానము పదార్థము ఈ రెండింటితో తయారైనది. 
సమిష్టి అంతఃకరణమునకు సాక్షి నేను, 
వ్వష్టి అంతఃకరణమునకు సాక్షి మేను.
వ్యష్టి అంతఃకరణ సాక్షి ప్రత్యగాత్మ.
సమిష్టి అంతఃకరణ సాక్షి కూటస్థుడు.
ఈ ప్రత్యగాత్మ ఆ కూటస్థుడు ఒక్క జ్ఞానమే. వేరు వేరు కాదు.
కానీ మనకు అర్థం కావడం కోసమని వ్యష్టి అంతఃకరణ సాక్షికి క్షరపురుషుడని,
సమిష్టి అంతఃకరణ సాక్షికి అక్షరపురుషుడని, 
ఈ క్షరాక్షరులు వేరు కాదని తెలియజెబుతున్నారు. 
ఆ అక్షరం యొక్క ప్రతిబింబమే ఈ క్షరుడు. 
ఆ జ్ఞానమే ఈ జ్ఞానం. 
అక్కడ నేనన్న ఇక్కడ నేనన్న ఒక్క నేనే.
జీవాత్మ నేనన్న పరమాత్మ నేనన్న ఆత్మ శబ్దము ఎప్పుడు నేనే.
ఈ నేను పరమును కాంచగనే కైవల్యమును అందుతుంది.
పురుషోత్తమ స్థితిని పొందగానే కైవల్యాన్ని పొందుతుంది.
పరబ్రహ్మము అనే నిర్ణయము పొందగానే కైవల్యాన్ని పొందుతుంది.
లేని ఎరుక అవుతుంది.
నేను లేను అనే స్థితికి చేరుతుంది.

కానీ ఈ నేనుకు ఎప్పుడు లక్ష్యం ఎటు ఉండాలి అంటె, పరము వైపు పరాత్పరం వైపు ఉండాలి. 
ఈ జ్ఞానానికి లక్ష్యం ఎటువైపు ఉండాలి అంటే.. పరము పరాత్పరం వైపు ఉండాలి. 

కానీ భ్రాంతి చేత ఈ జ్ఞానం నేను వైపుకు తిరిగినది. 
నేను మేను వైపుకు తిరిగినది. ఎప్పుడు తిరిగినది ? అనాది కాలంలో తిరిగింది. 
ఇప్పుడు తిరిగినదని ఎవరు చెప్పలేరు. 
సృష్టి ఆదియందు తిరిగింది. ఎప్పుడు తిరిగినది? బ్రహ్మ కర్మ సమారభే ప్రారంభించినప్పుడు తిరిగినది. 
తిరిగి ఏమైనది? ప్రతిబింబించబడినటువంటి మాయ.. మరల ప్రతిబింబించి స్వయముగా తానే సృష్టి అంతా చేయడం మొదలు పెట్టినది.

మాయ అంటేనే మూడు గుణాలు.
ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి సంయోజనీయత, వియోజనీయత పొంది తనకు తానే ఎరుక.. పిండ బ్రహ్మాండములను సృజించినది. 
తత్వ సముదాయముగా బ్రహ్మాండమును, ఇంద్రియ సముదాయంగా పిండాండమును మాయయే సృజించినది. 
కాబట్టి పిండ బ్రహ్మాండములు మాయా కార్యము. 
పిండ బ్రహ్మాండములకు అధిష్టానం.. జ్ఞానము. నేను అను జ్ఞానము.
పిండ బ్రహ్మాండములు మేను.
పిండబ్రహ్మాండముల అధిష్టానము...నేను. 

"నేను మేనుల జాడ ఎరిగి, నేను మేనుల మూలము పర బాహ్యమునందు లేదని తనను తా విడిచిన తాను హుళక్కి అగును".
దీనిని అర్థం చేసుకోవాలట ఈ సూత్రాన్ని.
నేను మేనుల జాడ ఎరగాలట మొట్టమొదట. అంటే సాంఖ్య విచారణ ద్వారా పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, విశ్వాండ పంచీకరణ, అక్షరబ్రహ్మాండ పంచీకరణలనే నాలుగు పంచీకరణల ద్వారా జాగ్రత్తగా తెలుసుకోవాలి. 
ఇది జాడ ఎరుగుట. 
నేను మేనుల జాడ ఎరిగి, 
నేను మేనుల అధిష్టానము అయినటువంటిది అఖండ ఎరుక‌, అది నేను. 
ఆ నేను ఎక్కడ పోగొట్టుకోవాలి. ఆ నేనుకు మూలాన్ని వెతకాలి. 
నేనుకు మూలాన్ని వెతికితే పర బాహ్యములో ఈ నేనుకు మూలం లేదు.
నేనుకే మూలం లేకపోతే, 
అధిష్టానమునకే మూలము లేకపోతే, 
చైతన్యానికే మూలం లేకపోతే,
బ్రహ్మమునకే మూలం లేకపోతే.. ఆశ్రయ మైనటువంటి పిండ బ్రహ్మాండములకు మూలము ఎట్లా ఉంటుంది?
నేనుకు మూలం లేకపోతే పరబాహ్యంలో మేనుకు కూడా లేదని తెలిసిపోతుంది.
         
కాబట్టి ఎవరికైతే అధిష్టానము, అధిష్టాన చేతన బ్రహ్మమే నేను అనే నిర్ణయము సమిష్టి అంతకరణ సాక్షిగా నిర్ణయం అయినదో వాళ్ళు తన మూలమును తాను గుర్తు ఎరిగే పనిలో పడతారు. 
తన మూలమును తాను గుర్తు ఎరిగేవాడిని కర్మ బంధించ జాలదు. దానికి యోగము అని పేరు. రాజయోగమని పేరు. పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి. పరిపూర్ణ రాజయోగము అంటారు. 
రాజయోగీయము అని కూడా అంటారు. పాఠాంతరాలు ఇవన్నీ.
          
కాబట్టి మానవుడు ఏమి చేయాలి? 
ముందు తనను తాను ఎరగాలి, 
తర్వాత తన మూలమును తాను ఎరగాలి. 
తన మూలమును తాను ఎరిగేటప్పుడు తానే లేకుండా పోతాడు. 
తాను లేకుండా పోతే ఉన్నదేదో అదే పరబాహ్యం. 
ఈ రీతిగా రెండే రెండు పనులు ఉన్నాయి మానవుడిగా పుట్టిన వాడికి.
తనను తాను తెలుసుకొనుట,
తన మూలమును తాను గుర్తెరిగి, 
పర బాహ్యము నందు తనకు మూలము లేదని తానే లేకపోవుట.
ఈ రెండే పనులు వాస్తవానికి, ఇంక ఏమీ లేవు మానవుడిగా పుట్టినటువంటి వాడికి.
'ధీ' విశేషం కలిగినటువంటి వాడికి, 
బుద్ధి శక్తి కలిగినటువంటి వాడికి.. 
మానవుడై పుట్టినటువంటివాడు 'ధీ' శక్తిని బలముగా కలిగి ఉంటాడు మిగిలిన జీవరాశి కంటే. 

వీడికి పరమాత్మ విధించినటువంటి స్వధర్మం.. తనను తాను ఎరుగుట. 
తన మూలమును గుర్తు ఎరిగే పనిలో తనను తాను పోగొట్టుకొనుట.
ఈ రెండే పనులు పరమాత్మ మానవుడికి చెప్పినటువంటివి. 
         
ఈ రెండు పనులు తప్ప మిగిలిన పనులు మాత్రమే చేస్తాడు మానవుడు. 
అందుకని భోగి, భ్రాంతి, భ్రమ.. ఇవన్నీ బలపడి పోయినవి. 
ఏమండీ! ఏమి చేస్తావు ఎవరినైనా అడిగామకోండి.. ఎవరు ఈ రెండు మాటలు చెప్పరు.

తనను తాను గుర్తు ఎరుగుట, 
తన మూలమును తాను గుర్తెరిగి తానే లేకపోవుట.. ఈ రెండు పనులు మాత్రమే నాకు ఉన్నాయి. నిజానికి ఇవి పనులేనా.. అవి పనులు కావు. ఎందుకని, ఎవరైనా ఏం చెప్తారు.. నీ గురించి నీకు తెలుసా తెలియదా అన్నామనుకోండి.. నా గురించి నాకు బాగా తెలుసు అంటాడు. నా గురించి నాకు తెలియదని మూడు ఏళ్ళ పిల్లవాడు కూడా చెప్పడు. మూడేళ్ళ పిల్లవాడిని అడిగినా సరే నా గురించి నాకు బాగా తెలుసు అంటాడు. 

కాబట్టి తనను తాను ఎరుగుట అనేది పని కాదు కదా, తనకు తాను తెలుసు. 
నిర్ణయంగా తెలుసుకోవాలి. 
వస్తు నిశ్చయ జ్ఞానంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు. తరువాత ఏమి చేయాలి? తన మూలమును ఎరగాలి. 
తన మూలమును గుర్తించే అన్వేషించే పనిలో పడితే.. అశరీరి అయినటువంటి గురువులు దొరుకుతారు. అప్పటి వరకు దొరకరు.
అప్పటివరకు సశరీరులైన గురువులే. 

తన మూలమును ఎరిగి తానే లేకపోయే పనిలో పడ్డప్పుడు. నిజంగా తనని తాను పోగొట్టుకోవడం పనేనా! లేనని తెలుసుకోవడమే అక్కడ పని. అంతే. 
చీకటి లేనిదని తెలుసుకుంటే.. వెలుతురు ఉన్నట్లే. 
వెలుతురు ఉన్నదని తెలుసుకుంటే, చీకటి లేదని తెలుసుకున్న ట్లే. 
పర బాహ్యము ఉన్నదని చూసినటువాడికి ఎరుక తనకు తా విడుచును. 
ఎరుక విడిచినటువంటి వాడికి ఉన్న పర బాహ్యము ఎప్పుడు ఉన్నది. 
అంటే ఒకటి చెబితే రెండవది చెప్పినట్లే. 
రెండవ దాని గురించి చెప్పక్కర్లేదు. 
ఉన్నది బ్రహ్మము... అంటే జగత్తు మిథ్య అని చెప్పాలా! చెప్పక్కర్లేదు. 
ఉన్నది బ్రహ్మమని చెప్పేసాను కదా ఆల్రెడీ. ఉన్నది బ్రహ్మమనే నిర్ణయము కలిగినటువంటి వారికి జగత్తు మిథ్యా వస్తువని చెప్పవలసిన అవసరం లేదు. 
ఒకవేళ జగత్తు మిథ్యా వస్తువని చెప్పామనుకోండి.. ఉన్నది బ్రహ్మమని నిర్ణయం అయినట్లే. 
ఇది వేదాంతంలో తత్వ జ్ఞానములో ఉన్నటువంటి గొప్ప లక్షణం.
ఉన్నదంతా ఆత్మ స్వరూపమే
అంతటా నిండి ఉన్నది నేనే.
అన్నీ నాయందే ఉన్నవి అన్నాము.. అంటే ఆత్మ అనుభవం. అంటె అనాత్మ లేదనే, అనాత్మ ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఉన్నది ఆత్మే, 
ఎప్పుడూ ఉన్నది బ్రహ్మమే. 
ఎప్పుడు ఉన్నది బయలే.
ఈ ఎప్పుడూ ఉన్న దానిని గుర్తించడమే, అలా ఉండడమే యోగం. ఇది అచల సిద్ధాంతములో.. 

కాసేపు ఉండి పోయేటటువంటి, తాత్కాలిక మైనటువంటి వాటిలో కలవడం విడిపోవడం అనే పనులు లేవు. 
ఒకసారి పండుగా పండితే.. పునః కాయగా మారదు. 
ఒకసారి జ్ఞానిగా నిర్ణయమైనటువంటివాడు.. పునః అజ్ఞానిగా మారే అవకాశం లేదు. 
ఒకసారి తనకు మూలము లేదని తనను తాను పోగొట్టుకున్నవాడు.. పునః నేను ఉన్నానని చెప్పడానికి అవకాశం లేదు. 
ఒకసారి నేను ఆత్మానుభవంతో ఆత్మనిష్ఠుడై నటువంటివాడు.. పునః మూడు గుణాలతో సంగత్వం పొందే అవకాశం లేదు. 
ఒకసారి ఉన్నది బ్రహ్మమనే బ్రహ్మజ్ఞానంతో జీవన్ముక్తుడు అయినటువంటి వాడు..
పునః జీవ భావముతో వ్యవహరించే అవకాశం లేదు. 
ఉన్నది పరము, పర బాహ్యము అనేటటువంటి నిర్ణయం అయినవాడికి.. ఎరుక అనేటటువంటి గుర్తు కలిగే అవకాశం లేదు. 
నేను మేను ఈ రెండింటి జాడ ఎరిగి, ఈ రెండింటిలో ఒక దానిలోనే రెండుగా చెబుతున్నావు. 
ఉన్న నేనులోనే ఈ మేను కూడా ఉన్నది. 
ఆ జ్ఞానములోనే ఈ కర్మ కలిసి ఉన్నది. 
ఆ జ్ఞానములోనే ఈ కర్మ ఫలము కూడా కలిసి ఉన్నది. 
ఎందుకని, జ్ఞానమే కర్మ ఉత్పాదన అవడానికి కారణం. 
ఆ కర్మఫలం కూడా పునః జ్ఞానం గానే మారి చేరిపోతోంది జ్ఞానంలో. 
కాబట్టి కర్మ చేయకముందు ఉన్నది కూడా జ్ఞానమే, 
కర్మఫలం అనుభవించిన తర్వాత మిగిలేది జ్ఞానమే.
మధ్యలో వ్యవహార కాలంలో కేవలము మిథ్యా భూతమైనటువంటి మిథ్యా జ్ఞానము మాత్రమే స్ఫురిస్తోంది.
ఆ మిథ్యాజ్ఞానము యొక్క ప్రభావం చేత దానిని భోగము అనుకుంటున్నాడు. 
కానీ వాస్తవానికి ఉన్నది ఎప్పుడు జ్ఞానమే. ఉన్నది ఎప్పుడు స్వరూపమే. 
ఉన్నది ఎప్పుడు పర బాహ్యమే.
ఈ సత్యం నీకు బోధ పడడమే యోగం. దానికే బుద్ధి యోగమని పేరు.

విద్యాసాగర్ స్వామి 
భగవద్గీత - 25

No comments:

Post a Comment