బతికినంతకాలం ఆనందంగా బతకాలి. ప్రతి మనిషి కోరుకునేది ఇదే. కాని, ఎందుక ప్రతి నిమిషం దానికి మరింత దూరమై దుఃఖాన్ని మూట కట్టుకుంటున్నాడు?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలంటే ముందుగా అదేమిటో తెలుసుకోవాలి. దాని చిరునామా కనుక్కోవాలి. అవగాహనాలోపంవల్ల అయితేనేం, దాని స్వరూప స్వభావాలు తెలియకపోవటంవల్లనైతేనేం. మనిషి తన అన్వేషణ అర్ధాంతరంగా అపేయటం జరుగుతోంది. ఆనందానికి బదులుగా దాని లాయారూపాలలో తాత్కా లికంగా రాజీపడాల్సి వస్తోంది. ఆనందం మన పరిసరాల్లో, కనిపించే వస్తువుల్లో ఉందనుకోవటమే అవగాహనాలోపం, లేని ఆనందాన్ని ఆ వస్తువులో వూహించుకుని దానివెంట పడటంవల్ల ఇంద్రియాలకు సుఖం, మనసుకు సంతోషం కలుగుతున్నాయి. కనిపించే వస్తువులన్నీ నశించిపోయే గుణం కలవి కాబట్టి- సుఖం వెంట దుఃఖం, సంతోషం వెన్నంటే సంతాపం... బయట, లోపల అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఒక అందమైన రోజా పువ్వు ఒక శ్రావ్యమైన సంగీతం, ఒక పసందైన విందుభోజనం... అన్నీ తాత్కాలిక సుఖాలే. వాడిపోగానే, ఆగిపోగానే, అరిగిపోగానే మరో వస్తువు వెంటపడటం మనిషి నైజం. ఆ సుఖం, ఆ సంతోషం తనలోనుంచే తొంగిచూస్తాయన్న విషయం తెలిసేవరకూ ఆరని ఆరాటం, తీరని పోరాటం కొనసాగుతూ ఉండాల్సిందే. ఒక తల్లి బిడ్డను చంకలో వేసుకొని వూరంతా గాలించిందట. మనిషి సైతం ఆనందం తనలోనే ఉన్నదని తెలుసు కోలేక ఆ అమాయకపు తల్లిలా నకిలీ వస్తువుల్లో, తప్పుడు చిరునామాల్లో గాలిస్తున్నాడన్నమాట.
తూర్పుకొండ వెనక నుంచి సూర్యుడు బయలుదేరి పడమటి సముద్రంలో పడటం కవికల్పన, భూమి సూర్యుడి చుట్టూ తిరగటంవల్ల ఒక భ్రాంతికి లోనుకావటం అన్నది వాస్తవం. కనిపించకుండానే యాంత్రిక ప్రభావంవల్ల తెరమీద చలన చిత్రాలు కదిలినట్టు ఆనందం అంతరంగంలో అదృశ్యంగా తన తరంగాలను వస్తువుల్లో ప్రసరింపజేస్తోంది. శాశ్వతమైన ఆనందం కావాలనుకుంటే, దృష్టిని బయటి ప్రపంచం నుంచి ముళ్లించి మనలో వున్న మరో అద్భుతమైన ప్రపంచం వైపు ప్రసరించాలి. మెలకువలో, స్వప్నంలో కలగని ఒక గొప్ప అనుభూతి గాడనిద్రలో కలగటానికి కారణం- లోపల - హృదయాంతరాళంలో దాగివున్న ఆనందం. పరిసరాలను మరిచి, ఎలాంటి బాధకు లోనుకాకుండా తెల్లవారే దాకా హాయిగా నిద్రవచ్చేది ఆ ఆనందమే. దాని స్థావరం మానవ హృదయం. తాను అందరి హృదయాల్లో తిష్ఠవేసి ఉన్నారని స్వయంగా పరమాత్మే చెప్పాడు. ఆ పరమాత్మకు మరోపేరు సచ్చిదానందం. ప్రతి హృదయం ఒక పరమాత్మ విలాసం అయితే- ఆనందనిలయం కాకుండా ఎలా ఉండగలదు? ఆ బ్రహ్మ పర్యంతం మరెవరూ పొందలేని ఈ ఆనందాన్ని ద్యానావస్థలో ఒక దివ్యానుభూతిగా పొందగలిగే మనిషి జీవితమే ధన్యం!
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment