Thursday, May 2, 2024

నేటి కథ ✍🏼* *పులి వన్నె నక్క!

 *✍🏼 నేటి కథ ✍🏼*


*పులి వన్నె నక్క!*


ఒక చిట్టడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలనేది దాని కోరిక. ఒక రోజు పొరుగున ఉన్న ఒక పెద్ద అడవికి ఆ నక్క వెళ్లింది. అక్కడ ఒక పొదలో పులి చచ్చిపడి ఉంది.
నక్కకు ఒక ఆలోచన వచ్చింది. పులి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి పులి మాంసాన్ని తినేసింది. ఆ చర్మాన్ని తీసుకెళ్లి ఒక కొలనులో బాగా కడిగి ఎండబెట్టింది. అక్కడకు కొన్ని కొంగలు చేరి ‘ఏమిటి విశేషం?’ అని అడిగాయి.
‘శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి ఈ పులి తోలు నాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు దీన్ని జాగ్రత్తగా కుట్టి నాకు ఇవ్వండి. నన్ను మిత్రుడిగా భావించి నాకు ఈ సాయం చేసిపెట్టండి. నా వల్ల మీకు ఏ అపకారమూ ఉండదు. అంతేకాదు.. మిగతా జంతువులు, పురుగూపుట్రా నుంచి కూడా మీకు అపకారం జరగకుండా చూసుకుంటాను’ అని చెప్పింది నక్క.
‘ఇదేదో బాగుంది’ అనుకుంటూ కొలను పరిసరాల్లో ఉన్న సన్నని తీగలను తెచ్చి తమ నైపుణ్యం ఉపయోగించి నక్క శరీర కొలతలకు సరిపడేలా పులితోలుతో చక్కని జుబ్బా కుట్టాయి కొంగలు.
పులితోలు జుబ్బాతో చిట్టడవి చేరిన నక్క ఒక రహస్య ప్రదేశానికి వెళ్లింది. అక్కడ దాన్ని తొడుక్కొని.. ఎవరికీ అనుమానం రాకుండా జుబ్బాను సవరించుకుని గట్టిగా కట్లు కట్టుకుంది. ఒక నీటిగుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తాను అచ్చం పులిలా కనిపిస్తున్నాను అని నిర్ధారించుకున్న తరవాత ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది.
పులితోలు కప్పుకున్న నక్కను చూసిన జీవులు సంభ్రమాశ్చర్యాలు చెందాయి. ‘చిట్టడవిలో పులా?’ అని గుసగుసలాడుకుంటూ ఆ వార్తను చిట్టడవి మొత్తానికి చేర్చాయి. చిట్టడవిలోని సమస్త జీవరాశీ ఆ చెట్టు దగ్గరకు చేరింది. ‘చిట్టడవికి పులి రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఇకపై మీరే మా అడవికి రాజు’ అని ప్రకటించాయి.
నక్క మురిసి పోయింది. అయితే బరువైన పులి తోలు కప్పుకున్న తాను అడవిలో తిరగడానికి ప్రయత్నించి చతికిలపడితే అసలుకే మోసం వస్తుందని ఆలోచించింది. ‘మిత్రులారా..! మీ అందరి కోరిక మేరకు నేను ఈ చిట్టడవిలోనే ఉండిపోయి, వేటగాళ్ల నుంచి మీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. ఒక పెద్ద అడవిలో ఒక సింహంతో పోరాడి విజయం సాధించాను. కానీ దాని పంజా దెబ్బలకు నా చర్మం చిట్లి.. ఒళ్లంతా కట్లుకట్టుకున్నాను. బహుశా నేను ఇక జీవితంలో దూరాభారాలు నడవలేను, వేటాడలేను. నాకు ముసలితనమూ వచ్చింది. గొంతులోనూ మార్పు వచ్చింది. ఎలాగూ నన్ను ఈ అడవికి రాజును చేశారు కాబట్టి.. నాకు కావాల్సిన ఆహారాన్ని రోజూ తెచ్చిపెట్టండి’ అని కోరింది.
ఆ రోజు నుంచి ఆ నక్కకు కావాల్సిన ఆహారాన్ని వంతుల వారీగా తెచ్చి ఇచ్చేవి ఆ చిట్టడవి జీవులు. తన పాచిక పారినందుకు నక్క చాలా సంతోషించింది. ఈ అమాయక చిట్టడవి జీవరాశి మధ్య తన శేష జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది అనుకుంది ఆ నక్క. అయితే తాను కప్పుకున్న పులి తోలును కలలో కూడా తొలగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.
రోజురోజుకూ ఆ నక్క అహంకారం ఎక్కువై.. తనకు ఆహారం తెస్తున్న జీవులపైనే జులుం చెలాయించేది. ఇంకా రుచికరమైన భోజనం తెమ్మని ఆదేశాలు ఇచ్చేది. లేదంటే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించేది. ‘ప్రశాంతంగా ఉండే చిట్టడవిలోకి అనవసరంగా ఈ ముసలి పులిని ఆహ్వానించి, రాజును చేసి తప్పు చేశాం అనిపిస్తుంది’ అని మదనపడ్డాయి ఆ జీవులు.
ఒక రోజు కొన్ని పావురాలు నక్కను పలకరించగా తన శరీరంపై క్రిమికీటకాలు ఉంటే ఏరిపారేయమని కోరింది. పావురాలు ఆ పనిచేస్తుండగా అసలు రహస్యం బయటపడింది. ‘ఇది పులితోలు కప్పుకున్న నక్క’ అని ఇట్టే గ్రహించాయి ఆ పావురాలు. అవి కొన్నిరోజులపాటు మిగతా జంతువులతో సమాలోచనలు జరిపి, ఒక ఎత్తుగడ వేశాయి.
ఒక తొండ నక్క దగ్గరకు వచ్చి ‘ఓ రాజా! మీకు నిత్యం అన్యాయం జరుగుతోంది. ఈ అడవిలోకి కొన్ని నక్కలు చేరాయి. అవి బలమైన జీవులను వేటాడి.. ఆ నాణ్యమైన మాంసాన్ని ఆరగించేసి తమకు మాత్రం ఒట్టి ఎముకలను పంపిస్తున్నాయి. పైగా ఆ ముసలి పులి మనల్ని ఏమీ చెయ్యలేదులే.. దాని ఒంటి నిండా సింహం పంజా దెబ్బలే అని మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుకుంటున్నాయి’ అని చెప్పి, దూరంగా ఉన్న పొదల్ని చూపించింది. నక్కకు పట్టరాని కోపం వచ్చి ‘ఇప్పుడే ఆ నక్కలపై దాడి చేసి చంపేస్తాను’ అంటూ చివాలున లేచి పొదలవైపు పరుగు పెట్టింది. అంతే తాను కప్పుకున్న పులితోలు బాగా ముక్కిపోయి, చివికిపోయి ఉండడంతో చీలికలు, పీలికలుగా ఊడిపోయింది.
నక్క బండారం బయటపడింది. అక్కడే మాటు వేసి ఉన్న మిగతా జంతువులన్నీ నక్కను ఆ అడవి నుంచి తరిమేశాయి. ‘తన దురాశ వల్లే ఇదంతా జరిగిందని’ బాధపడుతూ నక్క ఆ అడవి నుంచి దూరంగా పారిపోయింది.

*- ఎం.వి.స్వామి*

No comments:

Post a Comment